శభాష్‌ రోనాల్డ్‌.. | - | Sakshi
Sakshi News home page

శభాష్‌ రోనాల్డ్‌..

Apr 2 2026 7:35 AM | Updated on Apr 2 2026 7:35 AM

గుంతకల్లు: అంతర్జాతీయ సాఫ్ట్‌ టెన్నిస్‌ చాంపియన్‌ షిప్‌లో గుంతకల్లులోని శ్రీశంకరానందగిరి స్వామి డిగ్రీ కళాశాల బీసీఏ విద్యార్థి ఆరోనా రోనాల్డ్‌ హో రాణించాడు. గత నెల 25 నుంచి 30వ తేదీ వరకు థాయిలాండ్‌లోని పాథూంధానిలో రెండో ఏషియన్‌ యూనివర్సిటీ సాఫ్ట్‌ టెన్నిస్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు జరిగాయి. ఆసియా ఖండంలోని వివిధ దేశాలకు చెందిన 32 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఆరోనా రోనాల్డ్‌ కు కాంస్య పతకం దక్కింది. బుధవారం కళాశాలకు చేరుకున్న విద్యార్థిని కరస్పాండెంట్‌ కేసీ హరి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వర్లు, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆర్‌.సురేష్‌బాబు, అధ్యాపకులు టి.వెంకటరమణ, బశెట్టి కృష్ణయ్య, ఖాజావలి, కోచ్‌ శేఖర్‌ అభినందించారు.

నేడు కూడేరు

సంగమేశ్వరుడి రథోత్సవం

కూడేరు: స్థానిక సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 6.45 గంటలకు మడుగు తేరు, సాయంత్రం 5.30 గంటలకు రథోత్సవం ఉంటుందని ఆలయ ఈఒ రమేష్‌ బాబు బుధవారం వెల్లడించారు. రథోత్సవానికి జిల్లా నలమూల నుంచే కాక కర్ణాటక ప్రాంతాల నుంచి వేలాదిగా తరలి వచ్చే భక్తులు సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు.

గంజాయి పట్టివేత

గుంతకల్లు రూరల్‌: స్థానిక శివారు ప్రాంతంలోని దోనిముక్కల మార్గంలో కారులో గంజాయి తరలిస్తూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. వివరాలను గుంతకల్లు రూరల్‌ పీఎస్‌ ఎస్‌ఐ బాలముని బుధవారం వెల్లడించారు. బెంగళూరుకు చెందిన అరుణ్‌కుమార్‌ కారులో కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం డేగులపాడు గ్రామం నుంచి గంజాయిని తీసుకుని బుధవారం తిరుగు ప్రయాణమయ్యాడు. ప్రధాన రహదారులపై ప్రయాణిస్తే పోలీసులకు పట్టుబడే ప్రమాదముండడంతో గ్రామీణ రహదారులను ఎంచుకున్నాడు. ఈ నేపథ్యంలో గుంతకల్లు నుంచి దోనిముక్కల మార్గంలో పామిడి మీదుగా బెంగళూరుకు చేరుకోవాలని భావించి ఆ దిశగా కారును మళ్లించాడు. అయితే అప్పటికే దోనిముక్కల బ్రిడ్జి వద్ద వాహన తనిఖీలు చేపట్టిన గుంతకల్లు రూరల్‌ పోలీసులు.. శరవేగంగా వస్తున్న కారును గమనించి ఆపి పరిశీలించారు. అందులో కిలో గంజాయిని గుర్తించి అరుణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. కారును సీజ్‌ చేశారు. విచారణ అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement