పెద్దవడుగూరు: జొన్న ఇగురు తిని 35 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. బాధిత కాపరులు తెలిపిన మేరకు... పెద్దవడుగూరు మండలం చిత్రచేడు గ్రామానికి చెందిన చెట్ల పుల్లన్న, రామాంజనేయులు, గణేష్, నారాయణ, నాగార్జున, తరిమెల రామాంజనేయులు జీవాల పోషణతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో తమకున్న 800 గొర్రెల మందను మేపు కోసమని పి.కొట్టాలపల్లి గ్రామ సమీపంలో బుధవారం విడిచారు. అక్కడి ఓ రైతు పొలంలో ఉన్న లేత జొన్న ఇగురు మేసిన తర్వాత ఎండలు అధికంగా ఉండటంతో చెట్టు నీడకు గొర్రెలను తరలిస్తుండగా మార్గమధ్యంలోని కాలువను దాటే క్రమంలో సుమారు 45 గొర్రెల నీళ్లు తాగాయి. గమనించిన కాపరులు వెంటనే అప్రమత్తమై గొర్రెలు నీళ్లు తాగకుండా అక్కడి నుంచి చెట్టుకిందకు మళ్లించారు. కొద్ది సేపటి తర్వాత నీళ్లు తాగిన 40 గొర్రెలు అపస్మారక స్థితికి చేరుకున్నాయి. వాటిని కాపాడుకునేందుకు కాపరులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 39 గొర్రెలు మృతి చెందడంతో బాధితులు బోరుమని విలపించారు. రూ.4 లక్షల మేర నష్టం వాటిల్లిందని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.


