నెల్లూరు సిటీ: స్నేహితులతో కలిసి సరదాగా నీటి ప్రవాహాన్ని చూసేందుకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తూ వరదలో కొట్టుకుపోయి మృతి చెందిన ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు నగరంలోని పొర్లుకట్టకు చెందిన మెహ్రాజ్ మస్తాన్ (18) ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. పొట్టేపాళెం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వరద చూడటానికి సుందరంగా ఉందని తెలుసుకుని స్నేహితులతో కలిసి వెళ్లాడు.
సరదాగా గడుపుతుండగా ప్రమాదవశాత్తూ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. స్నేహితులు కేకలేయడంతో స్థానికులు వచ్చి ఆరా తీశారు. అప్పటికే యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలించగా.. ఓ తూము వద్ద యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. తండ్రి మహబూబ్‌బాషా ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా యువకుడు ఫిట్స్‌కు గురవడంతో ఘటన జరిగిందని సమాచారం.


