మీ స్కామ్‌ల కోసం ప్రజల ఆరోగ్య భద్రతను దెబ్బతీస్తారా బాబూ?: వైఎస్ జగన్
ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేశారు.. కొత్త వైద్య కళాశాలలు ప్రైవేటుకిస్తున్నారు
ప్రైవేటుపరం చేసి ప్రభుత్వమే జీతాలు ఇస్తుందట.. ఇంతకన్నా పెద్ద స్కామ్ ఉందా?
వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కోటి సంతకాలు
ఈ నెల 16న ఆ పత్రాలను గవర్నరును కలిసి అందజేస్తాం
అనంతరం ఆ పత్రాలతో హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తాం
‘‘ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేయడం అన్నది నిజంగా మాయరోగమే. బకాయిలు ఇవ్వకపోవడంతో నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు దాదాపుగా నిలిచిపోయాయి. ఆరోగ్యశ్రీకి 18 నెలలకు రూ.5,400 కోట్లు ఇవ్వాలి. కానీ ఈ ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.1,800 కోట్లు. ఇంకా రూ.3,600 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలున్నాయి. ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణే పెద్ద స్కాము.. వాటిని తీసుకున్న వారికి మరో పెద్ద బొనాంజా..!
ఈ కాలేజీలు ప్రైవేట్ పరం అయ్యాక అందులో పని చేస్తున్న సిబ్బందికి గవర్నమెంటే జీతాలు ఇస్తుందట. గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ భవనాలు, గవర్నమెంట్ సిబ్బంది, గవర్నమెంట్ జీతాలు.. కానీ ఓనర్లేమో ప్రైవేటు వాళ్లు! లాభాలేమో ప్రైవేటు వాళ్లకు! భారమేమో ప్రజలపై! బొనాంజా కాదా ఇది?’’ - వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘‘చంద్రబాబు ప్రభుత్వానికి మాయరోగం వచ్చింది. ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేశారు. గవర్నమెంట్ ఉన్నది ఎందుకు? ఏం చేయడం కోసం ప్రజలు నీకు అధికారం ఇచ్చారు? విద్య, వైద్యం, వ్యవసాయం, శాంతిభద్రతల పరిరక్షణ, పారదర్శక పాలన.. ఇవి కదా చేయాల్సింది. కానీ అన్నీ తిరోగమనమే. అన్నీ స్కాములే. ఏవీ పట్టించుకునే పరిస్థితి లేదు.
అన్నీ ప్రైవేటీకరణే.. బాధ్యత నుంచి తప్పించుకోవడం.. ఉన్నకాడికి స్కామ్‌లు చేయడమే..’’ అంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే..
దారుణంగా ప్రజారోగ్య వ్యవస్థ
ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేయడం అన్నది నిజంగా మాయరోగమే. బకాయిలు ఇవ్వకపోవడంతో నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు దాదాపుగా నిలిచిపోయాయి. ఆరోగ్యశ్రీ అమలుకు నెలకు రూ.300 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 18 నెలలకు కలిపి రూ.5,400 కోట్లు ఇవ్వాలి. ఇటీవల నేను దీనిపై పలుదఫాలు మాట్లాడటం.. వాళ్లు కూడా (నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు) స్ట్రైక్‌లు చేయడంతో ఈ ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.1,800 కోట్లు. అంటే ఇంకా రూ.3,600 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలున్నాయి.
చివరికి మొన్న నెట్‌వర్క్ ఆస్పత్రులన్నీ సమ్మెకు దిగాయి. సమ్మె విరమించేటప్పుడు ప్రభుత్వం వాళ్లకిచి్చన మాటకు ఇంతవరకు దిక్కులేదు. పేదలకు ఆరోగ్య భద్రత లేని పరిస్థితి. 104, 108 సేవలను స్కాములుగా మార్చేశారు. రూ.5 కోట్లు టర్నోవర్ లేని వాటికి 104, 108 సరీ్వసుల నిర్వహణను అప్పగించేశారు. ఆ వ్యక్తి ఎవరంటే.. టీడీపీ ఆఫీసులో డాక్టర్ల సెల్ అధ్యక్షుడట..! ఓ పక్క ఇంత దారుణంగా ఆరోగ్య వ్యవస్థ ఉంటే.. మరోవైపు సంజీవని అంటారు. అది ఇంకో డ్రామా.
అన్నీ గవర్నమెంట్‌వే.. లాభాలేమో ప్రైవేటు వాళ్లకు!
మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణే పెద్ద స్కాము.. వాటిని తీసుకున్న వారికి మరో పెద్ద బొనాంజా.. ఓవైపున ఆరోగ్యశ్రీని ఖూనీ చేస్తూ.. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రులను పూర్తిగా హతం చేస్తూ ఇంకోవైపు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఒక స్కాముగా మారుస్తూ ఈ ప్రభుత్వ పాలన సాగుతోంది. కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం ఒక స్కాము అయితే, ఆ కాలేజీలు తీసుకున్న వారికి ఒక పెద్ద బొనాంజా కూడా ఇచ్చారు. అది ఇంకో పెద్ద స్కామ్.
ఈ కాలేజీలు ప్రైవేట్ పరం అయ్యాక అందులో పని చేస్తున్న సిబ్బందికి గవర్నమెంటే జీతాలు ఇస్తుందంట. (ప్రభుత్వం జారీ చేసిన జీవో 847ను ప్రదర్శించారు). ఒక్కో టీచింగ్ హాస్పిటల్ (550 పడకల ఆసుపత్రి)లో ఉద్యోగుల జీతాల కోసం నెలకు దాదాపు రూ.5 నుంచి రూ.6 కోట్లు ఖర్చవుతుంది. అంటే ఏడాదికి రూ.60 నుంచి రూ.70 కోట్లు. రెండేళ్లకు రూ.120 నుంచి రూ.140 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం ఇస్తుంది.
ఆశ్చర్యమేమిటంటే.. గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ భవనాలు, గవర్నమెంట్ సిబ్బంది, గవర్నమెంట్ జీతాలు.. కానీ ఓనర్లేమో ప్రైవేటు వాళ్లు! లాభాలేమో ప్రైవేటు వాళ్లకు! భారమేమో ప్రజలపై! ఆశ్చర్యంగా లేదా ఇది..? బొనాంజా కాదా ఇది? స్కాముల్లో అన్నిటికంటే పెద్ద స్కామ్ కాదా ఇది? ఓవైపు ప్రజా ఉద్యమం జరుగుతోంది. దానిని ఖాతరు చేయకుండా, సిగ్గు లేకుండా చంద్రబాబు స్కాములపర్వం ముందుకు పోతోంది.
ఒక పక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి మందికిపైగా ప్రజలు సంతకాలు చేస్తున్నారు. మరో వైపున వాటిని ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తున్న స్కామ్‌ల్లో ఒక అడుగు ముందుకేసి ఇంకో స్కామ్ చేస్తున్నాడు.
16న గవర్నర్‌కు కోటి సంతకాల పత్రాలు అందచేస్తాం
కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోవడంతో రోడ్లెక్కుతున్నారు. 175 నియోజకవర్గాల్లో ప్రజలతో కలిసి మా పార్టీ భారీ ర్యాలీలు చేపట్టి ప్రజల గొంతుకను వినిపించింది. కోటిమందికి పైగా సంతకాలు చేసి ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు.
ఈ నెల 10వ తేదీన సంతకాలు చేసిన పత్రాలను నియోజకవర్గ కేంద్రాల్లో ప్రదర్శించి ప్రజలకు, మీడియాకు అందరికీ చూపించి జిల్లా కేంద్రాలకు పంపుతారు. ఈ నెల 13వ తేదీన జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేసి పార్టీ సెంట్రల్ ఆఫీసుకు చేరుస్తారు. ఆ కోటి సంతకాల పత్రాలను ఈ నెల 16న గవర్నర్‌కు అందచేస్తాం. ఆ తరువాత ఈ పత్రాలతో హైకోర్టులో పిటిషన్ వేస్తాం.


