సీఎం చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపాటు
తిరుమల లడ్డూ ప్రసాదం జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో తయారు చేశారన్నావ్..
వాటిని భక్తులు తిన్నారన్నావ్..
వాటికి ఆధారాలు దొరికాయా చంద్రబాబూ?
రాజకీయ లబ్ధి కోసం తిరుమల శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీస్తారా?
సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం
నెయ్యి నాణ్యత నిర్ధారించడానికి టీటీడీలో అనాదిగా అత్యంత పకడ్బందీ విధానాలు
ఎన్‌బీఎల్ అదీకృత ల్యాబ్ నాణ్యత నిర్ధారిస్తూ సర్టిఫికెట్ ఇచ్చిన ట్యాంకర్లకే తిరుపతికి అనుమతి
నెయ్యి నాణ్యతను ల్యాబ్‌లో మరోసారి నిర్ధారించాకే గోదాములోకి అనుమతించనున్న టీటీడీ
నాణ్యత లేని నెయ్యిని 2014–19 మధ్య 15 సార్లు, 2019–24 మధ్య 18 సార్లు వెనక్కి పంపారు
జూలై 2024లో కల్తీ జరిగిందని ఆరోపిస్తున్న నాలుగు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపామని మీ ఈవోనే చెప్పారు
మరి ఆ నెయ్యి ట్యాంకర్లను ఆగస్టులో ఎలా అనుమతించారు?
వాటితో లడ్డూ ఎలా తయారు చేశారు?
ఇదేగనక నిజమైతే.. మీ చైర్మన్, ఈవోపై కేసులు ఎందుకు పెట్టలేదు..? తప్పు జరిగింది మీ హయాంలోనే కదా?
పరకామణిలో దొంగతనం చేస్తున్న దొంగను పట్టుకున్నది మేం ఏర్పాటు చేసిన అత్యాధునిక పరకామణి వల్లే
30 ఏళ్లుగా జీయ్యర్ స్వామి వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆ దొంగ పరకామణిలో కానుకలు లెక్కిస్తున్నాడు
అప్పటి నుంచి దొంగతనం చేస్తున్నారేమో.. స్వామికే తెలుసు
రూ.72 వేలు విలువైన డాలర్లు కాజేసిన ఆ దొంగ నుంచి.. రూ.14 కోట్ల విలువైన ఆస్తులను న్యాయమూర్తుల సలహా తీసుకున్నాకే టీటీడీకి రాయించుకున్నారు.. ఇదేం తప్పు?
సింహాచలం దేవస్థానంలో డబ్బులు దొంగతనం చేస్తూ పట్టుబడిన రమణ అనే ఉద్యోగిని స్టేషన్ బెయిల్ ఇచ్చి మీరు వదిలేశారు
ఆ దేవస్థానం చైర్మన్ అశోక్ గజపతిరాజుపై కేసు ఎందుకు పెట్టలేదు?
ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా?
తనకు అనుకూలంగా లేకుంటే వ్యవస్థలపై దాడి చేయించడం చంద్రబాబుకు పరిపాటే. ఏకంగా న్యాయవ్యవస్థపైనే
దాడి చేస్తున్నారు. తిరుపతి జడ్జి, లోక్ అదాలత్ జడ్జిపైనే కాకుండా, ఒక సుప్రీం కోర్టు పెద్ద జడ్జి ఒత్తిడి తెచ్చారని దుష్ప్రచారానికి తెగబడ్డారు. పెద్ద జడ్జిల గురించి వీళ్లు మాట్లాడుతున్నారు. ధర్మం తెలిసిన మనుషులుగా, చట్టాలు తెలిసిన వ్యక్తులుగా టీటీడీకి మంచి చేయడం కోసం ఒక మంచి పరిష్కారం చూపుతూ ఈ జడ్జిలు సమస్య పరిష్కారంలో భాగస్వామ్యం అవ్వడం తప్పా?’’ - వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘‘జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో తిరుమల లడ్డూ ప్రసాదాలు తయారు చేశారని.. వాటిని భక్తులు తిన్నారని అన్నావ్..! వాటికి ఆధారాలు దొరికాయా..?’’ అంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల వెంకటేశ్వరస్వామి విశిష్టతను అభాసుపాలు చేస్తావా బాబూ? అంటూ మండిపడ్డారు.
గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. బెయిల్‌పై ఉన్న చంద్రబాబు షరతులను ఉల్లంఘిస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అవినీతి కేసులను తీసేయించుకుంటున్నారని తూర్పారబట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..
ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా బాబూ..?
చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నా! టీటీడీ లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని.. వాటిని భక్తులు తిన్నారని చెప్పడానికి ఆధారాలు దొరికాయా? కల్తీ నెయ్యి ఆరోపణలు ఉన్న ట్యాంకర్లు ప్రసాదం తయారీ కేంద్రంలోకి వెళ్లాయా? వీటికి ఆధారాలున్నాయా? టీటీడీలో ఒక బలమైన తనిఖీ వ్యవస్థ (రోబస్ట్ ప్రొసీజర్) ఉంది. టీటీడీకి వచ్చే ఏ నెయ్యి ట్యాంకర్ అయినా ఎన్‌ఏబీఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లా»ొరేటరీస్) సర్టిఫికేషన్‌తోనే రావాలి.
ఇది దశాబ్దాలుగా టీటీడీలో పాటిస్తున్న నిబంధన. ఈ సర్టిఫికెట్ లేకుండా తిరుమలలోకి ట్యాంకర్లు రావు. ఎన్‌ఏబీఎల్ సర్టిఫికెట్ ఒక్కటే సరిపోదు. టీటీడీకి ఒక సొంత ల్యాబ్ కూడా ఉంది. ఆ ల్యాబ్‌లో మళ్లీ టెస్టు పాస్ అయితేనే ట్యాంకర్ లోపలికి వెళ్తుంది. ఈ స్టాండర్డ్స్ లేకపోతే నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించి, వెనక్కి పంపిస్తారు. ఇలా గతంలో చంద్రబాబు హయాంలో 15 సార్లు వెనక్కి పంపించారు. వైఎస్సార్ సీపీ హయాంలో 18 సార్లు వెనక్కి పంపారు. టీటీడీలో బలమైన తనిఖీ వ్యవస్థ ఉందని, సమర్థవంతంగా పని చేస్తుందని చెప్పడానికి ఇవి నిదర్శనాలు. అలాంటప్పుడు తప్పు జరిగేందుకు ఆస్కారం ఎక్కడిది?
కల్తీ నెయ్యి వాడితే నీ వైఫల్యం కాదా బాబూ?
చంద్రబాబు హయాంలో, ఆయన నియమించిన టీటీడీ ఈవో టైమ్స్ నౌలో(ఈవో మాట్లాడిన వీడియో ప్రదర్శించారు) స్వయంగా ఆ ట్యాంకర్ల నెయ్యిని వినియోగించలేదని చెప్పారు. సెపె్టంబర్ 20, 2024న చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నియమించిన టీటీడీ ఈవో.. నాలుగు నెయ్యి ట్యాంకర్లు టెస్టులు పాస్ కాకపోవడంతో రిజెక్ట్ చేసి వెనక్కి పంపించామని ప్రకటించారు. వాస్తవానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయన హయాంలో జూలైలో∙4 ట్యాంకర్లు తిప్పి పంపారు.
మళ్లీ ఆ ట్యాంకర్లు ఆగస్టులో తిరిగి వచ్చాయట! మరి అప్పుడు సీఎం ఎవరు? చంద్రబాబు కాదా..? ప్రభుత్వాన్ని నడిపేది ఆయన కాదా..? గతంలో రిజెక్టు చేసిన నెయ్యి ట్యాంకులు ఆగస్టులో తిరిగి వచ్చాయని, లడ్డూ ప్రసాదంలో వినియోగించారని సిట్ రిమాండ్ రిపోర్టులో రాసింది. అలాంటప్పుడు ఇక్కడ ఎవరిని లోపల వేయాలి? ఇదే నిజమైతే రిజెక్ట్ చేసిన నెల రోజుల తర్వాత ఆ నెయ్యి ట్యాంకులు ఎలా తిరిగి వచ్చాయి? చంద్రబాబు చెప్పినట్టుగా ఆ నెయ్యిని వాడి ఉంటే అది ఈ ప్రభుత్వ వైఫల్యం కాదా?
ప్రస్తుత టీటీడీ చైర్మన్, అప్పటి టీటీడీ ఈవో ఇద్దరూ ఏం చేస్తున్నారు? వాళ్లిద్దరిపై కేసులు పెట్టి ఎందుకు అరెస్టు చేయలేదు? పైగా మాపై నిందలు వేస్తారా? చంద్రబాబు ముఠాకు దేవుడంటే భయం, భక్తీ లేదు. దుర్మార్గమైన అసత్యాలు ప్రచారం చేయడమే వీళ్ల పని. పైగా చంద్రబాబు వేసిన సిట్.. వ్యక్తులను ఇరికించాలనే ఆరాటం, తపన, తాపత్రయంతో తప్పులపై తప్పులు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు.
2014–19 మధ్య కిలో నెయ్యి రూ.276–రూ.314
మరి అదంతా కల్తీ నెయ్యేనా బాబూ?
స్వచ్ఛమైన నెయ్యి రూ.320కే మీరు ఎలా సప్లయ్ చేయిస్తారు? అని చంద్రబాబు, ఆయన పార్టీకి చెందిన నాయకులు ప్రశ్నలు వేశారు. నాణ్యమైనది కావాలంటే కిలో రూ.3 వేలు అవుతుందని ప్రకటించారు. చంద్రబాబు గెజిట్ పత్రిక ఈనాడు అయితే కనీసం రూ.1,000–రూ.1,600 అని రాసింది. మరి టీటీడీలో ఇప్పుడు నెయ్యి ఎంతకు కొంటున్నారు? రూ.3 వేలు ఇస్తున్నారా? రూ.1,600 లేక రూ.1,000 ఇచ్చి కొంటున్నారా? 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో ఐదేళ్లూ కిలో నెయ్యి రూ.276–314 మధ్య కొన్నాడు.
ఇది రూ.320 కంటే తక్కువ కదా? కాబట్టి అదంతా కల్తీ నెయ్యేనా? దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. పైగా భోలే బాబా డెయిరీ విషయంలో చేస్తున్న దు్రష్పచారం అంతా ఇంతా కాదు. 2018 జూన్ 26న టీటీడీ బోర్డు మినిట్స్ చూస్తే భోలేబాబా ఎవరో తేలింది. హర్‡్ష ఫ్రెష్ డెయిరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్.. భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్‌గా మారింది. ఈ సంస్థ టీటీడీకి పాలు సప్లై చేయడానికి డీమ్డ్ టు క్వాలిఫై అని సర్టిఫై చేసింది చంద్రబాబు హయాంలోనే. తిరుమలకు నెయ్యిని అనేక కంపెనీలు సప్లయ్ చేస్తుంటాయి. ప్రతి 6 నెలలకోసారి టెండర్లు పిలుస్తుంటారు.
ఎవరు తక్కువకు కోట్ చేస్తారో వారి దగ్గర నుంచి కొంటారు. ఇది సాధారణంగా జరిగే ప్రొసీజర్. టెండర్లలో ఎల్–1 ఎవరుంటారో వారికి కేటాయిస్తారు. ఇందులో రాజకీయ ప్రమేయం ఉండదు. దేవుడి పేరుతో రాజకీయాలు చేయడానికి వీళ్లు ప్రయతి్నస్తున్నారు. నెయ్యిని సప్లై చేసే ఏ కంపెనీ అయినా కచ్చితంగా ఏన్‌ఏబీఎల్ సర్టిఫికెట్ తీసుకోవాలి, టీటీడీలో ఉన్న ల్యాబ్‌లో టెస్టులు పాసవ్వాలి. అప్పుడే ట్యాంకులు లోపలకు వెళ్తాయి.
దుష్ప్రచారం ఆపాలని సుప్రీంకు వెళ్లింది మేం కాదా?
టీటీడీ లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం ఆపాలని, నిజాలు బయటకు తీసుకురావాలని సుప్రీం కోర్టుకు వెళ్లింది వైవీ సుబ్బారెడ్డే. అంతేగానీ టీడీపీ వాళ్లు కాదు. అలాంటిది.. సుబ్బారెడ్డిపై అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి ఇంటికి ఎప్పుడైనా వెళ్లారా? హైదరాబాద్‌లో ఆయన ఇంట్లోనే గోపూజ జరుగుతుంది. ఆయన 1978 నుంచి 35–40 సార్లు అయ్యప్పమాల ధరించి కొండకు వెళ్లి ఉంటారు. అందులోనూ ఆయనది గురుస్వామి స్థానం. అలాంటి వ్యక్తిపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో మీకే తెలియాలి.
టీటీడీలో స్కాములన్నీ బాబువే!
పరకామణి కేసులో దొంగను పట్టుకున్న పోలీసు అధికారి మరణించేలా చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చాడు. ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ రూ.72 వేల విలువైన అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ ఓ వ్యక్తి దొరికిపోయాడు. ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు రూ.14 కోట్లు విలువైన ఆస్తులను దేవుడికి ఇవ్వడం తప్పు అవుతుందా? దేశంలో అనేక చోట్ల, అనేక ఆలయాల్లో ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి.
కానీ, ఎక్కడైనా ఇలా ఆస్తులు దేవుడికి ఇచ్చారా? ఈ దొంగ దొరికినప్పుడు కేసు నమోదు అయ్యింది. తిరుపతి కోర్టులో చార్జిషీట్ వేశారు. మెగా లోక్ అదాలత్ కోర్టులో కేసును పరిష్కరించారు. అన్నీ కోర్టుల పరిధిలో ప్రాపర్ కోర్టు ప్రొసీజర్‌తో జరిగాయి. జ్యుడీషియల్ ప్రాసెస్ అంతా జరిగింది. ఇందులో సాంకేతిక పరమైన అంశాలు ఏమైనా ఉంటే దర్యాప్తు చేసుకోవచ్చు తప్పులేదు.
కానీ, రాజకీయాల కోసం ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ఉన్నాడనో.. భూమన కరుణాకర్‌రెడ్డి ఉన్నాడనో.. వారి మీద బురదజల్లాలని తప్పుడు స్టేట్‌మెంట్ కోసం అక్కడ పనిచేస్తున్న బీసీ పోలీస్ అధికారిని వేధించి, వెంటాడి, బెదిరించి, చివరకు ఆయన చనిపోయేలా చేశారు. ఆ మరణానికి ఎవరో కారణం అంటూ ఎల్లో మీడియా చేత తప్పుడు కథనాలు రాయించారు.
మీ హయాంలో పట్టుకోలేదేం బాబూ?
ఆ దొరికిన దొంగ... 30 ఏళ్ల నుంచి జీయర్ స్వామి మఠంలో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. పరకామణి లెక్కింపులో ఎన్నో ఏళ్ల నుంచి పాల్గొంటున్నాడు. కొత్తగా మా ప్రభుత్వంలో వచి్చన వ్యక్తి కాదు. మరి గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఎందుకు పట్టుకోలేకపోయారు? ఆ దొంగను మేం పట్టుకున్నాం. వాస్తవానికి మేం వచ్చిన తర్వాత మా ప్రభుత్వంలో తిరుమల హుండీ డబ్బు లెక్కింపు ప్రక్రియను ఇంకా పారదర్శకంగా చేశాం. దేవుడి సొమ్ము దొంగల పాలు కాకూడదని రూ.23 కోట్లు ఖర్చు పెట్టి కొత్త పరకామణి బిల్డింగ్ కట్టాం.
అత్యాధునిక కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశాం. దాన్ని సీఎం హోదాలో నేను ప్రారంభించా. 2023 ఫిబ్రవరి 5 నుంచి ఆ బిల్డింగ్‌లో పూర్తి స్థాయి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పాత భవనంలో అరకొరగా సీసీ కెమెరాలు ఉండేవి. రికార్డింగ్ క్వాలిటీ కూడా తక్కువే. బ్లయిండ్ స్పాట్స్ ఎక్కువ. వాటిని అన్నింటినీ మారుస్తూ కొత్త భవనంలో 360 డిగ్రీల కవరేజ్‌తో 4కే హెచ్‌డీ సీసీ టీవీ వ్యవస్థలు, హైబ్రీడ్ నైట్ విజన్ కెమెరాలు, ఎక్కువ రోజులు డేటా ఉండేలా మల్టీ టీమ్ రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్స్ తెచ్చాం.
ఇవన్నీ చేసిన తర్వాత ఏప్రిల్ 4, 2023లో దొంగతనం చేస్తూ ఈ వ్యక్తి పట్టుబడ్డాడు. ఇప్పుడు చెప్పండి.. ఎవరు మంచివారు? ఇంత గొప్ప వ్యవస్థను సృష్టించినందుకు మాపై నిందలా..? ఆ వ్యక్తి దశాబ్దాలుగా ఇదే పనిచేస్తున్నాడని అనుకోవచ్చు. కానీ చంద్రబాబు హయాంలో ఎవరూ పట్టుకోలేదు. మా హయాంలో పట్టుకున్నాం. గతంలో ఏం జరిగిందో దేవుడికే తెలుసు. రూ.72 వేల విలువైన అమెరికన్ డాలర్లు దొరికితే.. ఏకంగా రూ.14 కోట్ల ఆస్తిని ఆ కుటుంబం దేవుడికి రాసిచ్చింది.
న్యాయ వ్యవస్థపైనే దాడి..!
చంద్రబాబు తనకు అనుకూలంగా లేకుంటే వ్యవస్థలపై సైతం దాడి చేయించడం పరిపాటే. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, అధికార ప్రతినిధి వర్ల రామయ్యతో మాట్లాడిస్తున్న మాటలు న్యాయ వ్యవస్థపై దాడి చేయించినట్లే! (వర్ల వీడియోను ప్రదర్శించారు)!
‘‘23–9–2025: ప్రాపర్టీ ఓనర్ ఎవరు? కోర్టు కూడా తప్పు చేసిందా.. అనుమానం వస్తుంది. హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కోరుతున్నా.. మీ తరఫున దర్యాప్తు చేయించాలి. ఈ కేసులు సీరియస్. ఎందుకు లోక్ అదాలత్‌తో దర్యాప్తు చేయిస్తారు? తిరుపతిలో రూమర్స్ వస్తున్నాయి. ఈ జడ్జిగారికి పైనుంచి ఎవరో మరో జడ్జి చెప్పారట. నేను జడ్జి ఎవరని అడగట్లేదు. అందరం మనుషులమే. ఈ జడ్జికి పైనుంచి ఎవరో జడ్జి చెప్పారట. ఏ జడ్జి చెప్పినా.. ఇన్‌స్పెక్టర్ దర్యాప్తు చేసినా.. అన్యాయం జరిగింది మాత్రం స్వామి వారికే.
13–11–2025: తమిళనాడులో రిజిస్టర్ చేశారట ఆస్తులు. దీని వెనుక జడ్జి ఉన్నారని చెబుతున్నారు. రూ.50 లక్షల స్టాంపు డ్యూటీ కట్టారట. ఆ రూ.50 లక్షలు ఎవరు కట్టారు?
జడ్జిలు, టీటీడీ అధికారులపై నిందలు సిగ్గుచేటు..
ఇలా ఏకంగా న్యాయవ్యవస్థపైనే చంద్రబాబు దాడి చేస్తున్నారు. తిరుపతి జడ్జి, లోక్ అదాలత్ జడ్జిపైనే కాకుండా, ఒక సుప్రీంకోర్టు పెద్ద జడ్జి ఒత్తిడి తెచ్చారని దు్రష్పచారానికి తెగబడ్డారు. పెద్ద జడ్జిల గురించి వీళ్లు మాట్లాడుతున్నారు. ధర్మం తెలిసిన మనుషులుగా, చట్టాలు తెలిసిన వ్యక్తులుగా టీటీడీకి మంచి చేయడం కోసం ఒక మంచి పరిష్కారం చూపుతూ ఈ జడ్జిలు సమస్య పరిష్కారంలో భాగస్వామ్యం అవ్వడం తప్పా? తిరుమలకు పెద్ద పెద్ద సీనియర్ జడ్జిలు వస్తుంటారు.
ఇలాంటి కేసులు ఏమైనా జరిగినప్పుడు తిరుపతిలో ఉన్న జడ్జిలు, సుప్రీం కోర్టు జడ్జిల దాకా కూడా మాట్లాడుకుంటారు. ఇలాంటి ముఖ్యమైన కేసుల్లో, దేశం మొత్తం చూస్తున్న కేసులో సలహాలు కోరతారు. జ్యుడీషియల్ పరిధిలో సలహాలు తీసుకుంటారు. ఏ తప్పూ జరగలేదు, ఏ తప్పూ చేయలేదు కాబట్టి సలహాలు తీసుకొని, ఇంప్లిమెంట్ చేశారేమో..! దాంట్లో రాజకీయం చేయడానికి ఏముంది? జడ్జిలపై, టీటీడీ అధికారులపై నిందలు వేయడం సిగ్గుచేటు.
ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా?
టీడీపీ స్టాండ్ ఎలా ఉంటుందంటే.. ఈ ఏడాది సెపె్టంబర్ 1న చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే, అత్యంత విశిష్టత కలిగిన సింహాచలంలో రూ.55 వేలు హుండీ డబ్బులు చోరీ చేస్తూ దేవస్థానం ఉద్యోగి రమణ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ పట్టుబడ్డారు. ఉద్యోగి రమణను సస్పెండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ ను పోలీసులకు అప్పగించి, ఆ వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు.
ఆ వ్యకిని ఎందుకు జైల్లో పెట్టలేదు? మరి చంద్రబాబు దీనిపై ఎందుకు విచారణ చేయలే దు? మొత్తం వారిద్దరి ఆస్తులపై విచారణ చేసి, వాటిని మొత్తం ఎందుకు స్వా«దీనం చేసుకోలేదు? పైగా సింహాచలం ఆలయానికి ధర్మకర్త టీడీపీకి చెందిన అశోక్ గజపతిరాజు. వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి చైర్మన్‌గా ఉంటే ఒక న్యాయం..! అదే అశోక్ గజపతిరాజు ధర్మకర్తగా ఉంటే ఇంకో న్యాయం..! మరి ఆయన మీద విచారణ ఎందుకు చేయడం లేదు? ఎక్కడైనా న్యాయం ఒక్కటే కదా!!
టీటీడీలో బాబు స్కాములు ఇవీ...!
రాష్ట్రంలో దేవుడి సొమ్ముతో స్కామ్‌లు చేసింది చంద్రబాబే. తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుంచి కపిలతీర్థం వరకు శ్రీనివాస సేతు 6 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతిపాదన చేశారు. ఇందులో 67 శాతం ఖర్చు టీటీడీ, 33 శాతం ప్రభుత్వం పెట్టాలని నిర్ణయించారు. అప్పటి తిరుపతి కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌ను చంద్రబాబు పిలిపించుకుని రూ.684 కోట్లతో శ్రీనివాససేతు కట్టేయమని చెప్పారు.
అయితే, ఆ మీటింగ్‌లో టీటీడీ ప్రతినిధులు లేకుండానే.. ఏకంగా 67 శాతం డబ్బులు టీటీడీ నుంచి తీసుకునేలా నిర్ణయం తీసేసుకున్నారు. అసలు బోర్డు అనుమతి, ఆమోదం లేకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారు? ఇది కాదా స్కామ్? మన ప్రభుత్వం వచ్చాక టీటీడీ బోర్డు రీ విజిట్ చేసి రూ.40 కోట్లు ఖర్చు తగ్గించింది. కొత్త బోర్డు రాకపోయి ఉంటే ఆ రూ.40 కోట్లు ఎవరి జేబుల్లోకి పోయేవి?
కమీషన్ల కోసం కక్కుర్తి!
టీటీడీ డబ్బుల్లో 10 శాతానికి మించి ప్రైవేట్ బ్యాంకుల్లో జమ చేయకూడదు. ఇది టీటీడీ రూల్. చంద్రబాబు హయాంలో కమీషన్లకు కక్కుర్తిపడి రూ.1,300 కోట్లు ఎస్ బ్యాంక్‌లో పెట్టించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచి్చన తర్వాత బోర్డు ఆ నిర్ణయాన్ని రీవిజిట్ చేసి ఎస్ బ్యాంక్ నుంచి ఆ డబ్బును విత్ డ్రా చేసి జాతీయ బ్యాంకులో పెట్టింది. ఆ తర్వాత మూడు నెలలకు ఎస్ బ్యాంక్ ఆర్థికంగా కుదేలయ్యింది.
ఒకవేళ చంద్రబాబు పెట్టిన రూ.1,300 కోట్లు ఎస్ బ్యాంక్‌లోనే ఉండి ఉంటే ఆ డబ్బు ఏమయ్యేది? మరి ఏది స్కామ్? మాకు ఇవన్నీ తెలిసినా కూడా టీటీడీ కాబట్టి రాజకీయాల్లో లాగకూడదని సమస్య పరిష్కరించి, సరిదిద్దాం. మన ఇప్పుడు వీళ్లు చేసేవి చూస్తుంటే అసలు ఏమీ జరగకపోయినా, మంచి చేసే కార్యక్రమం జరిగినా దాన్ని వక్రీకరిస్తూ, రివర్స్ అబద్ధాలు చెబుతున్నారు.
వాస్తవానికి టీటీడీ ఒక స్వతంత్ర వ్యవస్థ. కొన్ని శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ విధానాలను తిరుమల తిరుపతి దేవస్థానంలో అమలు చేస్తున్నారు. అలాంటి ఆలయాన్ని, ఏకంగా దేవుడి ప్రతిష్టను మంటగలుపుతున్నామనే కనీస ధ్యాస కూడా లేకుండా, వెంకటేశ్వరస్వామి ప్రతిష్టను దిగజారుస్తూ చంద్రబాబు అత్యంత హేయమైన రాజకీయాలు చేస్తున్నారు.
అది చంద్రబాబు సొంత సిట్!
లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు వేసిన సిట్ చూస్తే వాళ్ల బాగోతం తెలిసిపోతుంది. సిట్‌లో ఉన్న గోపీనాథ్ జెట్టి.. ఎన్టీఆర్ ట్రస్టులో ట్రస్టీగా పని చేసిన కృష్ణయ్యకు అత్యంత సమీప బంధువు (ఎన్టీఆర్ ట్రస్టులో ట్రస్టీగా సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో దిగిన ఫొటో ప్రదర్శించారు). కృష్ణయ్యపై చంద్రబాబుకు ఎంత ప్రేమ అంటే.. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఎన్టీఆర్ ట్రస్టులో ట్రస్టీగా పెట్టుకున్నారు.
ఇన్నేళ్ల తర్వాత ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చైర్మన్‌ను చేశారు. ఇలాంటి వ్యక్తి సమీప బంధువు సిట్ ఆఫీసర్లలో ఒకరు. మరో ఆఫీసర్ డీఐజీ త్రిపాఠి. ఈ సర్వశ్రేష్ట త్రిపాఠి ఎలాంటి వాడో చెప్పాల్సిన పనిలేదు. పల్నాడు జిల్లాలో ఆయన సృష్టించిన అల్లకల్లోలం ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదు. తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం కోసం భుజాన వేసుకుని పాకులాడారు. ఆ తర్వాత చంద్రబాబు ఈ అధికారిని పక్కన కూర్చోబెట్టుకుని డీఐజీ స్థానం ఇచ్చి.. ఆయన చేస్తున్న మాఫియా కలెక్షన్లలో ప్రముఖ ప్రధాన పాత్ర ఇచ్చారు. ఇలాంటోళ్లు అందరూ సిట్‌లో ఉన్నారు.
మరోవైపు వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్న అనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అతను వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (వీపీఆర్) పీఏ. వీపీఆర్ ఒక టీడీపీ ఎంపీ. ఆయన దగ్గర నుంచి ప్రతి నెలా అప్పన్న జీతం (చెక్కులు) తీసుకుంటున్నాడు. పైగా ఏపీ భవన్ ఉద్యోగి. వీపీఆర్ పీఏ, తర్వాత ఏపీ భవన్ ఉద్యోగి. మరి వైవీ సుబ్బారెడ్డి పిక్చర్‌లోకి ఎలా వచ్చారు? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు ఎంతసేపూ వైవీ సుబ్బారెడ్డి పీఏ అని గోబెల్స్ ప్రచారం చేస్తూ డ్రిల్ చేస్తున్నారు!.


