2026లో సెలవుల జాబితా ఇదే
సాక్షి, అమరావతి: 2026 క్యాలెండర్ ఇయర్‌లో సాధారణ సెలవులు, ఆప్షనల్ హాలిడేల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం మొత్తం 24 సెలవు దినాలు ప్రకటించింది. ఇందులో నాలుగు సెలవులు మహాశివరాత్రి, బాబూ జగ్జీవన్‌రాం జయంతి, దుర్గాష్టమి, దీపావళిలు ఆదివారం రావడంతో నికరంగా 20 సెలవులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులకు లభించనున్నాయి. కానీ ఈసారి అత్యధిక సెలవులు శుక్రవారం రావడంతో మధ్యలో శనివారం లీవ్ పెట్టుకుంటే వారాంతాల్లో మూడు రోజులు ఆటవిడుపు కలగనుంది.

పై అధికారికి ముందస్తు సమాచారంతో గరిష్టంగా ఐదు సెలవుదినాలను వినియోగించుకునేలా 21 ఆప్షనల్ హాలిడేలను ప్రకటించింది. ఇందులో రెండు ఈద్ ఈ గదర్, మహాలయ అమావాస్య ఆదివారంతో కలిసిపోయాయి. బ్యాంకులు వంటి ఇతర వ్యాపార సంస్థలకు నెగోషబుల్ ఇనిస్ట్రుమెంట్స్ యాక్ట్ 1981 ద్వారా 21 సాధారణ సెలవులను ప్రకటించింది.
చంద్ర దర్శనాన్ని బట్టి నిర్ణయించే రంజాన్, బక్రీద్, మొహర్రం, ఈద్ మిలాద్ ఉన్‌నబీతో పాటు హిందూ పర్వదినాల్లో ఏమైనా మార్పులు ఉంటే వాటిని ప్రసార మాధ్యమాల ద్వారా ముందుగానే తెలియజేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


