విపక్షంలో ఉండగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నారు..
ప్రైవేటీకరించకుండా అడ్డుకుంటామని ప్రగల్భాలు పలికి ఇప్పుడు మాట మారుస్తారా?
ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం... కలిసి పోరాడతాం అని చెప్పారు
ఇప్పుడేమో ఇంట్లో పడుకుంటే జీతాలివ్వాలా? తమాషాలొద్దంటూ సీరియస్ అవుతారా?
స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు మామూలు దగా చేయలేదు
పీడీ యాక్టులు పెట్టి విశాఖ ఉక్కు ఉద్యోగులను లోపల వేస్తానంటారా?
మండిపడిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్
‘‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.. ప్రైవేటీకరించకుండా కాపాడుకుంటాం అంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చుతున్నారు. ప్రైవేటు సంస్థ స్టీల్ ప్లాంట్ పెడితే లాభాల్లో ఉంటుందట, తమాషాలు చేయొద్దు... పీడీ యాక్ట్ పెట్టి లోపలేస్తాం అని ఉద్యోగులను బెదిరిస్తున్నారు. సినిమాల్లో విలన్ పాత్ర ఎలా ఉంటుందో చెప్పడానికి... చంద్రబాబు వ్యవహరిస్తున్న ఈ తీరే నిదర్శనం’’ - వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: విపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు... ప్రైవేటీకరించకుండా కాపాడుకుంటాం అంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చుతున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించకుండా కాపాడుకున్నామని, ప్రభుత్వ రంగంలోనే నడపాలని, సొంత గని (క్యాప్టివ్ మైన్) కేటాయించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని గుర్తుచేశారు.
స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణం కార్మికులు కానే కాదని, సొంత గని లేకపోవడమేనని తేల్చి చెప్పారు. దీనికి ఆధారంగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌ఏఐఎల్) వార్షిక నివేదికలను చూపారు. ‘‘విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గని కేటాయించాలని అడగరు కాని.. మిట్టల్ సంస్థ పెట్టే ప్రైవేటు స్టీల్ ప్లాంట్‌కు సొంత ఇనుప గని కేటాయించాలని టీడీపీ కూటమి ఎంపీలతో కేంద్రాన్ని అడిగిస్తారా?’’ అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. గురువారం మీడియాతో మాట్లాడిన జగన్ ఇంకా ఏమన్నారంటే..
అప్పుడో మాట.. ఇప్పుడో మాటా?
మా ప్రభుత్వ హయాంలో స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించకుండా అడ్డుకున్నాం. కానీ, ఎన్నికల ముందు చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏం మాట్లాడారు..? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారనేది చూడండి. (2021 ఫిబ్రవరి 16న చంద్రబాబు మాట్లాడిన మాటలు, 2025 నవంబర్ 15న మాట్లాడిన మాటల వీడియో క్లిప్పింగ్‌లను చూపించారు). ప్లాంట్‌ను కాపాడుకుంటాం. కలిసి పోరాడతాం అంటూ వీర డైలాగులు చెప్పారు. ఇప్పుడు ఇంట్లో పడుకుంటే జీతాలివ్వాలా? అంటున్నారు.
ప్రైవేటు సంస్థ స్టీల్ ప్లాంట్ పెడితే లాభాల్లో ఉంటుందట, తమాషాలు చేయెద్దు పీడీ యాక్ట్ పెట్టి లోపలేస్తాం అని ఉద్యోగులను బెదిరిస్తున్నారు. నిజానికి నష్టాలకు ఉద్యోగులు కారణం కాదు. విశాఖ స్టీల్‌కు సొంత గనుల్లేకనే నష్టాలు. ఆర్‌ఐఎన్‌ఎల్, ఎస్‌ఏఐఎల్ 2023–24 వార్షిక నివేదిక ప్రకారం.. సెయిల్, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల కోసం చేసే వ్యయం 11.2 శాతం ఉంది.
కానీ, సెయిల్‌కు ఐరన్ ఓర్ ఉంది. క్యాప్టివ్ ఐరన్ ఓర్ ఉంది. దాన్నుంచి 34.34 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ తీసుకోవడమే కాకుండా, జార్ఖండ్ ప్రభుత్వం అనుమతితో 1.16 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్‌ను మార్కెట్‌లో అమ్ముకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ లేవు. అందుకే ఐరన్ ఓర్ వ్యయం 18.6 శాతం అవుతుంటే సెయిల్‌లో ఇది 9.8 శాతమే. 10 శాతం తేడా ఉంది.


