అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అవినీతి కేసులను తీసేయించుకుంటున్న చంద్రబాబు
బెయిల్‌పై ఉన్న చంద్రబాబు షరతులు ఉల్లంఘిస్తుంటే ఎందుకు ఆయన బెయిల్ రద్దు చేయకూడదు?
2014–19 మధ్య సాక్ష్యాధారాలతో సహా అవినీతి కేసుల్లో పట్టుబడిన బాబు
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు దుర్మార్గపు పాలన సాగిస్తూ మరో వైపు తనపై అవినీతి కేసులను సందట్లో సడేమియా మాదిరిగా ఎత్తేసుకునే కుట్ర చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దుయ్యబట్టారు. న్యాయస్థానాలు ఇచ్చిన బెయిల్ షరతులను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి కేసుల్లో బెయిల్‌పై బయట ఉన్న చంద్రబాబు ‘తానే దొంగ.. తానే పోలీస్.. తానే పబ్లిక్ ప్రాసిక్యూటర్..’ అన్నట్లు వ్యవహరిస్తూ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి.. తనపై కేసులను తన ప్రభుత్వం ద్వారా విత్ డ్రా చేసుకుంటూ బరితెగిస్తున్నారని మండిపడ్డారు.
గురువారం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు 2014–19 మధ్య ఆషామాషీ స్కాములు చేయలేదు. ఒక్క స్కిల్ స్కామ్‌లోనే వందల కోట్లు బొక్కేశారు. స్వయంగా ఆ ఫైళ్లపై చంద్రబాబు సంతకాలు చేసి డొల్ల కంపెనీలకు రూ.370 కోట్లు దోచిపెట్టారు. అక్కడేమో సీమెన్స్ ఎండీ ఆ డబ్బులు నాకు రాలేదు, నా కంపెనీయే కాదని స్టేట్మెంట్ ఇచ్చారు.
డొల్ల కంపెనీలకు చంద్రబాబు స్వయంగా సంతకాలు పెట్టి ఫైల్ మూవ్ చేసి రూ.370 కోట్లు ఇచ్చిన కేసులో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ అయిన ఈడీ.. డొల్ల కంపెనీలు పెట్టిన వాళ్లను, డబ్బులు తీసుకున్నోళ్లను అరెస్టు చేసింది. కానీ, డబ్బులు ఇచ్చినోడిని అరెస్టు చేయలేదు. డబ్బు మాత్రం పోయింది. డబ్బు ఇచ్చినోడిని అరెస్టు చేయకుండా ప్రొటెస్ట్ చేస్తుండటం ఏంటని ఏసీబీ కోర్టు ఆయన్ను జైలుకు పంపింది’ అని అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
అతిపెద్ద అసైన్డ్ ల్యాండ్ స్కామ్
చంద్రబాబు, ఆయన బినామీలు అసైన్డ్ భూములు కొనడం ఒక స్కాం అయితే.. ఆ తర్వాత వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడం మరో పెద్ద స్కాం. అదే స్థాయిలో రింగు రోడ్డు అలైన్‌మెంట్ స్కాం చేశారు. కరెక్టుగా చంద్రబాబు హెరిటేజ్ భూముల దగ్గరకు వచ్చే సరికే రింగ్ రోడ్డు పక్కకు వెళ్లిపోతుంది. మరో వైపు ఉచితం పేరుతో రూ.కోట్ల విలువైన ఇసుకను దోచేస్తున్నారు. మా హయాంలో ఏడాదికి రూ.750 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.3,750 కోట్లు ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది.
బ్లాక్ లిస్టులోని కంపెనీకి కాంట్రాక్టులు!
ఫైబర్ నెట్‌లో అర్హత లేని, బ్లాక్ లిస్టులో ఉన్న తన అనుచరుడి కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టి రూ.వందల కోట్లు అప్పనంగా మింగేశారు. లిక్కర్‌లో ఎమ్మార్పీ కన్నా అధిక రేట్లకు అమ్మి తన బెల్ట్ షాపుల ద్వారా, పర్మిట్ రూముల ద్వారా, తన మాఫియా సామ్రాజ్యం ద్వారా దోచేశారు. కేబినెట్ ఆమోదం లేకుండా ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసి, దాని మీద చంద్రబాబు స్వయంగా సంతకాలు పెట్టి వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కాంకు తెర తీశారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో లిక్కర్ స్కామ్ చేస్తున్నారు. డిస్టిలరీలకు ఆర్డర్లు ఇచ్చేది ప్రైవేట్ షాపులు. అలాంటి ప్రైవేట్ షాపులన్నీ చంద్రబాబు వ్యక్తులవి కాదా? ప్రతి ఐదు బాటిళ్లకు ఒక బాటిల్ కల్తీ మద్యం అమ్మేస్తున్నారు.
చట్టం.. చంద్రబాబు చుట్టం!
ప్రజాధనాన్ని బొక్కేసిన ఈ గజదొంగను చట్టం ముందు నిలబెట్టి శిక్షించడానికి కావాల్సిన అన్ని ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నా కూడా చంద్రబాబు తన అధికార బలంతో కేసులు విత్‌డ్రా చేసుకునే కుట్రలకు తెగబడ్డారు. ఫిర్యాదుదారులైన అధికారుల్ని భయపెట్టి, బెదిరించి స్టేట్‌మెంట్లు విత్ డ్రా చేయించి, వాటిని కోర్టు ముందు పెట్టి, ఈ కేసులో ఏమీ లేదంటూ వ్యవస్థల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. రెఫర్ చార్జ్ షీట్ వేయించి మూసేయిస్తున్నారు.
గతంలో కూడా సేమ్ మోడస్ ఆపరెండీకి పాల్పడ్డారు. ఏలేరు స్కామ్ తీసుకున్నా అంతే. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ బ్యాంకు అకౌంట్లను, ఆ పార్టీ గుర్తును లాక్కోవడం దగ్గర నుంచి మొన్నటి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఇస్తూ ఆడియో టేపులు, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన కేసులో.. ఇవాళ్టి కేసు వరకు చట్టం ఒక వైపు, వ్యవస్థలు మరో వైపు.. చంద్రబాబుకు చుట్టాలుగా మారి దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజల దృష్టి మళ్లించడానికే వైఎస్సార్‌సీపీ నేతలను అక్రమ కేసులతో వేధిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న ఈ అన్యాయాలను వేలెత్తి చూపిస్తూ.. సాక్ష్యాలు, ఆధారాలతో ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెడతాం. వాస్తవాలు ప్రజా క్షేత్రంలోకి తీసుకెళ్తాం.


