సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు
మెరుగైన పీఆర్సీ ఇస్తామని.. ఉన్న చైర్మన్‌నే తొలగించారు..
జీతాలు పెంచాల్సి వస్తుందనే దుర్బుద్ధితోనే పీఆర్సీ చైర్మన్‌ను నియమించడం లేదు
ఉద్యోగులకు రూ.31 వేల కోట్లు బకాయిపడ్డారు
ఆప్కాస్ ఉద్యోగులకు రెండు మూడు నెలలకు ఒకసారి జీతాలు
‘‘ఉద్యోగుల సమస్యలు చూస్తే.. ఈ డిసెంబర్ పూర్తై జనవరి వస్తే ఐదు డీఏలు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఒక్కటి మాత్రమే ఇచ్చారు. అది కూడా వాయిదాల్లో ఇస్తామంటున్నారు. మెరుగైన పీఆర్సీ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఉన్న పీఆర్‌సీ చైర్మన్‌నే తీసేశారు. ఇప్పటివరకూ కొత్త చైర్మన్‌ను నియమించలేదు. ఉద్యోగులకు పెరిగిన జీతాలు వెంటనే ఇవ్వాల్సి వస్తుందనే దుర్బుద్ధితోనే పీఆర్సీ ఛైర్మన్‌ను నియమించలేదు. ఐఆర్ ఊసే లేదు’’ - వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను సీఎం చంద్రబాబు నిండా ముంచేశారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో చంద్రబాబు కుప్పలు తెప్పలుగా ఇచ్చిన హామీలు.. వాటిని అమలు చేయకుండా మోసం చేస్తున్న తీరును ఎండగడుతూ సర్కార్ తీరును కడిగిపారేశారు. గురువారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే..
ఐదింటికి ఒకే డీఏ..
ఉద్యోగుల సమస్యలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూస్తే... ఈ డిసెంబర్ పూర్తయి జనవరి వస్తే ఐదు డీఏలు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఒక్కటి మాత్రమే ఇచ్చారు. అది కూడా వాయిదాల్లో ఇస్తామంటున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే.. డీఏ అరియర్స్‌ను రిటైర్ అయిన తర్వాత ఇస్తామని చెప్పిన ప్రభుత్వాన్ని బహుశా చరిత్రలో ఎప్పుడూ చూసి ఉండం... ఒక్క చంద్రబాబు ప్రభుత్వంలో మినహా! దానికి తగ్గట్టుగా జీవో 60 జారీ చేశారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంత దౌర్బాగ్యమైన జీవోను తీసుకొని వచ్చి ఉండరు (జీవో నంబర్ 60ని ప్రదర్శించారు). దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో దాన్ని ఉపసంహరించుకుని, వాయిదాల్లో ఇస్తామన్నారు.

ఐఆర్ లేదు.. మెరుగైన పీఆర్సీ బూటకం
మెరుగైన పీఆర్సీ ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఉన్న పీఆర్‌సీ చైర్మన్‌నే తీసేశారు. ఆ స్థానంలో ఇప్పటివరకూ కొత్త చైర్మన్‌ను నియమించలేదు. చైర్మన్‌ను నియమిస్తే పీఆర్సీ రిపోర్టు ఇవ్వాలి. రిపోర్టు వస్తే దాన్ని వెంటనే అమలు చేయాలి. అమలు చేస్తే.. ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. దీంతో ఉద్యోగులకు పెరిగిన జీతాలు వెంటనే ఇవ్వాల్సి వస్తుందనే దుర్బుద్ధితోనే పీఆర్సీ చైర్మన్‌ను ఇప్పటివరకూ నియమించలేదు. అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ.. ఇప్పటివరకు ఐఆర్ ఊసే లేదు. నాడు మేం అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్ ఇచ్చాం.
దాంతో ఉద్యోగుల జీతాలు పెరిగాయి. ఆశ్చర్యం ఏమిటంటే.. మా ప్రభుత్వం ఇచ్చిన జీపీఎస్(గ్యారంటీడ్ పెన్షన్ స్కీం)ను కూడా చెల్లుబాటు కాకుండా చేసి ఉద్యోగులను చంద్రబాబు త్రిశంకు స్వర్గంలోకి నెట్టాడు. మేం తెచ్చిన జీపీఎస్‌ను దేశమంతా కాపీ కొడుతున్నారు. కనీసం అదైనా అమలు చేసి ఉంటే రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ వచ్చేవి. పీఆర్‌సీ బకాయిలు, పెండింగ్ డీఏలు, జీపీఎఫ్‌లు, ఏపీజీఎల్‌ఐలు, మెడికల్ రీయింబర్స్‌మెంట్, సరెండర్ లీవ్స్ రూపంలో ఉద్యోగులకు చంద్రబాబు ఏకంగా రూ.31 వేల కోట్లు బకాయి పడ్డారు.
ఆప్కాస్(ఏపీసీఓఎస్)లో ప్రతి నెలా 1వ తేదీనే జీతాలిచ్చేలా మా ప్రభుత్వంలో చర్యలు తీసుకున్నాం. కానీ ఇప్పుడు రెండు మూడు నెలలకోసారి ఇస్తున్నారు. నేను పులివెందులకు వెళ్తే మా వాళ్లు వచ్చి వినతిపత్రం ఇచ్చారు. మీరున్నప్పుడు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు వచ్చేవి.. ఇప్పుడు ఒకటో తేదీన జీతం కథ దేవుడెరుగు.. రెండు మూడు నెలలకు ఒకసారి ఇస్తున్నారు సార్..! అని చెబుతున్నారు. గెస్ట్ లెక్చరర్లకైతే ఎనిమిది నెలలుగా జీతాలే లేవు. ఈ ప్రభుత్వంలోఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నారు. దేవాలయాల్లో శానిటేషన్ పనులు కూడా కాంట్రాక్టర్లకే కట్టబెట్టేస్తున్నారు. భాస్కరనాయుడు లాంటి చంద్రబాబు బంధువులు, సన్నిహితులకే కాంట్రాక్టులు ఇస్తున్నారు.


