ఆదుకోనందుకే రైతు ఆత్మహత్యలు
అనంతపురం : చంద్రబాబు ప్రభుత్వం అనంతపురం జిల్లాను రైతుల ఆత్మహత్యలకు నిలయంగా మారుస్తోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన అరటి రైతు నాగలింగమయ్య ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆయన స్పందించారు. అరటి కిలో రూపాయి చొప్పున కొనుగోలు చేస్తుండటంతో పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని తెలిపారు. అరటి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అరటి రైతు నాగలింగమయ్య ఆత్మహత్యను చంద్రబాబు ప్రభుత్వ హత్యగానే భావించాలని పేర్కొన్నారు. అరటి రైతులను ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ తరఫున వారం, పది రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని ధ్వజమెత్తారు. రైతు నాగలింగమయ్య కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులెవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దని ఈ సందర్భంగా సూచించారు.


