మళ్లీ మళ్లీ ప్రారంభోత్సవం!
● ముచ్చటగా మూడోసారి డీఎల్‌డీఓ కార్యాలయం ప్రారంభం
గుంతకల్లు: భవనం ఒకటే.. కానీ ప్రారంభోత్సవం మూడోసారి. ప్రచారం కోసం ఇలా పదే పదే ప్రారంభించి చంద్రబాబు ప్రభుత్వం అబాసుపాలైంది. రాష్ట్రంలో 77 డీఎల్‌డీఓ కార్యాలయాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం వర్చువల్‌గా ప్రారంభోత్సవం చేశారు. ఇందులో గుంతకల్లులోని ఆర్డీఓ కార్యాలయ సమీపంలో డివిజనల్ అభివృద్ధి అధికారి (డీఎల్‌డీఓ) కార్యాలయం కూడా ఉంది. వాస్తవానికి ఇక్కడి జిల్లా పరిషత్ అతిథి గృహాన్ని 2017 జూలై 14న అప్పటి ఎమ్మెల్యే ఆర్.జితేంద్రగౌడ్, జిల్లా చైర్మన్ చమన్‌సాబ్ ప్రారంభించారు. అయితే భవనాన్ని అభివృద్ధి పరచాడానికి రూ.లక్షలు ఖర్చు చేసి తిరిగి డీఎల్‌డీఓ కార్యాలయంగా నామకరణం చేసి 2024 అక్టోబర్ 16న ప్రసుత్త ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రారంభించారు. ఇదే కార్యాలయాన్ని ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా ప్రారంభించారు. పైగా రంగులు, ఫర్నీచర్ కోసం అంటూ తాజాగా రూ.10 లక్షల దాకా నిధులు ఖర్చు చేశారు. గతంలో ప్రారంభించిన భవనాన్ని మళ్లీ మళ్లీ ప్రారంభిస్తూ ఉండడంతో ప్రజలు అవాక్కవుతున్నారు.
విద్యుత్ సబ్‌స్టేషన్‌దీ ఇదే తీరు
స్థానిక ఎమ్మెల్యే మెప్పు కోసం అధికారులు ప్రారంభించిన భవనాలనే మళ్లీ మళ్లీ ఆయన ఓప్రారంభింపజేస్తున్నట్లు అర్థమవుతోంది. పట్టణంలోని సత్యనారాయణ పేట విద్యుత్ సబ్‌స్టేషన్ విషయంలోనూ ఇలాగే జరిగింది. ఈ సబ్‌స్టేషన్‌కు వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి దాదపు రూ. 2 కోట్ల నిధులుతో శంకుస్థాపన, భూమిపూజ చేయగా.. సగం పనులు పూర్తి చేశారు. అయితే ఇటీవల ఈ సబ్‌స్టేషన్‌ను తామే పూర్తి చేసినట్లు గొప్పలు చెప్పుకుంటూ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రారంభించారు.
అది తాత్కాలిక భవనమే
డిప్యూటీ సీఎం వర్చువల్‌గా ప్రారంభోత్సవం చేసిన డీఎల్‌డీఓ భవనం తాత్కాలికమే. డీఎల్‌డీఓ కార్యాలయానికి స్థలం కేటాయించపోవడంతో జిల్లా పరిషత్ అతిథి భవనాన్ని 2024లో మండల పరిషత్ నిధులు ఖర్చు చేసి దెబ్బతిన్న స్లాబ్‌ను తొలగించచి, అభివృద్ధి పరిచాం. తాజాగా జిల్లా పరిషత్ నిధులతో దాదాపు రూ.10 లక్షలు ఖర్చు చేసి ఫర్నీచర్‌తో పాటు డీఎల్‌డీఓ కార్యాలయంగా ఆధునికీకరించాం.డీఎల్‌డీఓ కార్యాలయానికి ప్రత్యేక స్థలం కేటాయిస్తే శాశ్వత భవనం నిర్మించుకుంటాం.
– విజయలక్ష్మి, డీఎల్‌డీఓ, గుంతకల్లు


