అరటి రైతుది ప్రభుత్వ హత్యే
శింగనమల : ఎల్లుట్లలో అరటి రైతు నాగలింగం ఆత్మహత్యను ప్రభుత్వ హత్యగా వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంరత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ అభివర్ణించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అరటికి మార్కెట్లో కిలో రూపాయిలోపే ధర ఉండటంతో పంట కోసం చేసిన రూ.15 లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలియక రైతు నాగలింగం ఆత్మహత్య చేసుకున్నారని, ఇది చాలా బాధాకరమని అన్నారు. అరటి రైతుల సమస్యలపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేసి, హెచ్చరించినా ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంతో రైతు బలయ్యాడని, ప్రభుత్వమే రైతు చావుకు పూర్తి బాధ్యత వహించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అధికారం చేపట్టకముందు ఒక మాట, అధికారం చేపట్టిన తర్వాత మరో మాట మాట్లడటం చంద్రబాబుకే చెల్లుతుందన్నారు. అరటి పంటకు మార్కెలో సరైన ధర లేక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఉచిత పంటల బీమాను లక్షల మంది రైతులు సద్వినియోగం చేసుకున్నారన్నారు.పూట్లూరు మండలం ఎల్లుట్లలో శుక్రవారం పర్యటించి ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన రైతు నాగలింగం కుటుంబాన్ని పరామర్శిస్తున్నట్లు తెలిపారు.ఇప్పటికై నా రైతులను ఆదుకోక పోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మళ్లీ ఉద్యమిస్తామని హెచ్చరించారు.


