సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నలకు కూటమి నేతల్లో వణుకు మొదలైంది. వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రులు నీళ్లు నమిలారు. వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించిన అనేక ప్రశ్నలకు ప్రభుత్వ పెద్దలు, మంత్రులు నోరు తెరవకపోవడం గమనార్హం.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్.. కూటమి సర్కార్‌కు పలు ప్రశ్నలు సంధించారు. సూపర్ సిక్స్ అమలు చేశామంటున్న ప్రభుత్వ పెద్దలను సూటిగా ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు చొప్పున ఇచ్చారా?. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు రూ.1500 చొప్పున ఇచ్చారా?. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చారా? అని అడిగారు.

అలాగే, తిరుమల లడ్డూపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను సైతం వైఎస్ జగన్ ప్రశ్నించారు. 2024 జులైలో కల్తీ కారణంతో వెనక్కు పంపిన నాలుగు నెయ్యి ట్యాంకర్లను ఆగస్టులో ఎలా అనుమతి ఇచ్చారు?. కల్తీ నెయ్యితో లడ్డూలు చేసి ఉంటే మరి టీటీడీ ఛైర్మన్, ఈవోలపై ఎందుకు కేసు పెట్టలేదు? అని అడిగారు. వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించిన ఇలాంటి అనేక ప్రశ్నలకు ప్రభుత్వ పెద్దలు, మంత్రులు ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం చెప్పలేదు. అసలు నోరే తెరవలేక పోవడం గమనార్హం.


