సమస్యలు గాలికి.. వేడుకలు దేనికి?
● గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో
పాఠశాలలకు సకల వసతులు
● ఇప్పుడు పాలకుల నిర్లక్ష్యంతో
మూలనపడిన ఆర్వో ప్లాంట్లు
● బాలికలకు సరిపడా మరుగుదొడ్లు
లేక అవస్థలు
● మెగా పీటీఎం పేరిట
చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తెచ్చిన చదువుల పండుగ నేడు కళ తప్పింది. ప్రస్తుత చంద్రబాబు సర్కార్ ఆర్భాటం తప్ప.. చిన్నారులకు కనీసం గుక్కెడు నీరు కూడా ఇవ్వడం లేదు. బాలికలకు మరుగుదొడ్లు కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటిని పక్కనపెట్టి నేడు మెగా పీటీఎం పేరుతో సర్కారు హడావుడి చేస్తోంది. విద్యార్థులు, తల్లిదండ్రులను దగా చేసేందుకు సిద్ధమైంది.
సాక్షి ప్రతినిధి, గుంటూరు/గుంటూరు ఎడ్యుకేషన్:
చదువుల విప్లవాన్ని తెచ్చిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పుణ్యమాని ప్రభుత్వ పాఠశాలలకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త హంగులు సమకూరాయి. నాడు–నేడు మొదటి విడతలో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1,183 పాఠశాలలను రూ.283 కోట్ల వ్యయంతో ఆధునికీకరించారు. రెండో విడతలో ఒక్క గుంటూరు జిల్లాలోనే 562 స్కూళ్లలో రూ.204 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక నాడు–నేడు పనులు కుంటుపడ్డాయి. వైఎస్ జగన్ హయాంలో పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లాలోని 165 పాఠశాలల్లో కొత్తగా 584 తరగతి గదుల నిర్మాణాన్ని ప్రారంభించారు. నేడు ఆ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
మధ్యాహ్న భోజనంలోనూ..
పాఠశాలల్లో విద్యార్థులకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించేందుకు అమలు చేసిన జగనన్న గోరుముద్ద కార్యక్రమం విద్యార్థుల సంతృప్తే లక్ష్యంగా విజయవంతంగా కొనసాగింది. గత ప్రభుత్వంలో రోజూ పాఠశాలల్లో 90 శాతానికిపైగా విద్యార్థులు మధ్యాహ్న భోజనం ఆరగించారు. ప్రస్తుతం అది 65 శాతంగా ఉంది. జిల్లాలోని 1,074 పాఠశాలల్లో చదువుతున్న 96,576 మంది విద్యార్థుల్లో సగటున 62 వేల మంది మధ్యాహ్న భోజనం ఆరగిస్తున్నారు. మిగిలిన విద్యార్థులు ఇళ్ల దగ్గర నుంచి క్యారేజీలు తెచ్చుకుంటున్నారు.
ఉపాధ్యాయులపై ఖర్చుల భారం
గుంటూరు జిల్లాలోని 1,074 పాఠశాలలకు రూ.22.20 లక్షలను మాత్రమే ఈ కార్యక్రమం నిమిత్తం ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే పలు సమస్యలతో సతమతం అవుతున్న ఉపాధ్యాయులకు ఈ కార్యక్రమం నిర్వహణ మరో భారంగా మారింది.


