ఎప్పుడూ హడావుడే..
2014–19 మధ్య కాలంలో పాఠశాలల భవనాలకు తాత్కాలిక మరమ్మతులు నిర్వహించడం, నామమాత్రపు మెరుగులు దిద్దడమొక్కటే టీడీపీ పాలనలో అభివృద్ధిగా చెప్పారు. ఇప్పుడు కూడా అదే తంతు నడుస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్లు, సిస్టమ్స్ ఇప్పుడు మూలనపడ్డాయి. విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందడం లేదు. మెయింట్‌నెన్స్ లేకపోవడంతో విలువైన బ్యారీలు, మోటార్లు, ఫిల్టరేషన్ సామగ్రి పాడైపోతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా నాడు–నేడు మొదటి దశలో 994 ఆర్వో వాటర్ సిస్టమ్స్, 155 మినరల్ వాటర్ ఫ్రిజ్‌లు ఏర్పాటు చేశారు.
అంతటా నిర్లక్ష్యమే
గుంటూరు నగరంలోని ఏటీ అగ్రహారంలోని ఎస్‌కేబీఎం నగరపాలకసంస్థ ఉన్నత పాఠశాలలో 771 మంది, ప్రాథమిక పాఠశాలలో మరో 250 మంది చదువుతున్నారు. గతంలో ఏర్పాటు చేసిన రెండు ఆర్వో ప్లాంట్లు నేడు మూలనపడ్డాయి. విద్యార్థులు తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు. బాలబాలికలకు రెండే టాయిలెట్లు ఉన్నాయి. గత ప్రభుత్వంలో నిర్మించిన టాయిలెట్ సముదాయాన్ని పూర్తి చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. పొన్నూరు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి జాడే కనిపించడం లేదు. బడుల పరిసరాల్లో పిచ్చి చెట్లు పెరిగినా పట్టించుకోవడం లేదు. అదనపు తరగతి గదుల నిర్మాణాలు గతంలో దాదాపు పూర్తయ్యాయి. చివరి దశలో చంద్రబాబు సర్కారు పట్టించుకోకపోవడంతో అలాగే ఆగిపోయాయి. భవనాలు శిథిలావస్థకు చేరుతున్నాయి. మరుగుదొడ్లు అద్వానంగా మారాయి. ఆర్వో ప్లాంట్లు మరమ్మతులకు గురైనా పట్టించుకోవడం లేదు.


