అమరావతిలో 15 బ్యాంకులు, రెండు బీమా సంస్థల కార్యాలయాలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. కూటమి నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్‌లు కేంద్రం తమకు సహకరిస్తోందని చంకలు గుద్దుకుంటున్నారు. పైగా ఈ చిన్న విషయంతోనే అమరావతి ముంబై అయిపోతుందన్నంత బిల్డప్ కూడా ఇచ్చేశారు. నిన్నమొన్నటివరకూ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అన్నవాళ్లు కాస్తా ఇప్పుడు అమరావతి అంటున్నారు. ఇలా రోజుకో మాట మారిస్తే నమ్మేదెలా?.. ఇంతకి ఏమిటి వీరి బలహీనత?..
టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి సర్కారుకు చిత్తశుద్ది ఉంటే, ఈ బ్యాంకు కార్యకలాపాలన్నీ కొత్తగా వస్తువన్నవి అని నమ్ముతూంటే అవి విశాఖలో పెరిగేలా చేస్తే ఏపీకి సత్వర ప్రయోజనం కలిగేది కదా! అని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ విలువలు పెంచడానికి, ధరలు పెరిగాయన్న కృత్రిమ భావన కల్పించడానికి తంటాలు పడుతున్న ప్రభుత్వ పెద్దలు దీనిని ఒక గిమ్మిక్కుగా మార్చారన్న అనుమానం కలుగుతుంది.
తాజా ప్రచారం ప్రకారం మరికొన్ని సంస్థలను కూడా విశాఖ అమరావతికి తరలిస్తున్నారట. స్టాక్ ఎక్చేంజ్ బోర్డు ఆఫీస్‌ను గతంలో విశాఖలో ఏర్పాటు చేయాలని తలపెట్టగా ఇప్పుడు అమరావతికి మార్చే యోచన చేస్తున్నారు. గత ప్రభుత్వం రిజర్వు బ్యాంక్ ఆఫీస్‌ను వైజాగ్‌లో ప్రతిపాదిస్తే అమరావతికి మార్చారు. ఈఎస్ఐ మెడికల్ కాలేజీ, బిట్స్ పిలాని క్యాంపస్, ఏఐ, స్కిల్ యూనివర్శిటీలరె కూడా అమరావతికి మారుస్తారట. ఇప్పటికే అనంతపురం నుంచి ఎయిమ్స్, కర్నూలు నుంచి లా యూనివర్శిటీ తిరుపతి నుంచి హెచ్‌సీఎల్‌లను తరలించారు కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామికవాడ నుంచి ఒక కార్యాలయం ఇక్కడకు తీసుకురావాలని ప్రతిపాదించారు. ఇలా చేస్తే మళ్లీ ప్రాంతీయ అసమానతలు,విద్వేషాలు పెరగవా అని కొంతమంది విజ్ఞులు బాదపడుతున్నారు.
కొత్త ప్రభుత్వ సంస్థలను అమరావతిలో స్థాపించవచ్చు.గతంలో అనేక ప్రైవేటు పరిశ్రమలు అమరావతికి పరుగులు పెట్టుకుంటూ వస్తాయని అన్నారు.అలా జరిగితే అందరికి ప్రయోజనంగా ఉంటుంది. వేల కోట్ల అప్పులు తెచ్చి అమరావతిలోనే ఖర్చు చేస్తున్నారు. దాని ప్రయోజనం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి దక్కాలి.అలాకాకుండా అప్పులు భారం అందరిపై పడి, ఆర్థిక లాభం మాత్రం అమరావతి ప్రాంతంలోని కొందరికే లభిస్తే అది సమస్యలకు దారి తీయవచ్చు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమరావతిలో పెడుతున్న బ్యాంకు ఆఫీసులు అన్ని విజయవాడలో ఇప్పటికే పనిచేస్తున్నాయట. వాటినే అమరావతికి తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారన్నమాట. కాకపోతే దానికి ఫైనాన్షియల్ స్ట్రీట్ అని ఒక పేరు తగిలిస్తారన్నమాట.
నిజానికి బ్యాంకులు, బీమా సంస్థలు అన్నీ ఒకచోటే ఉండాల్సిన అవసరం లేదు. మరో సంగతి ఏమిటంటే ఆయా చోట్ల వివిధ బ్యాంకులకు రీజినల్ ఆఫీసులు కూడా ఉంటాయి. సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిన ఈ రోజుల్లో అన్ని బ్యాంకులు ఓకే చోట ఉండడం వల్ల కలిసివచ్చేది ఏమీ ఉండదు. వికేంద్రీకరిస్తే అందరికి సమన్యాయం జరుగుతున్నట్లు అవుతుంది.అందుకు భిన్నంగా ఇతర చోట్ల నుంచి తీసుకు వచ్చి వాటిని అమరావతిలో పెడితే పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.కాకపోతే ప్రభుత్వ సొమ్ము కాబట్టి కోట్ల రూపాయలకు వారికి భూమిని కేటాయించామని చెప్పుకోవచ్చేమో!.
విశాఖలో ప్రైవేటు సంస్థలకు 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు పందారం కావిస్తూ, అమరావతిలో ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు అనేది ఆలోచించాలి. ఒకప్పుడు అమరావతిలో ఐటీ మొదలు అనేక సంస్థలు వస్తున్నాయని ఊదరగొట్టారు.నవ నగరాల పేరుతో ఏదో జరిగిపోతుందని ప్రచారం చేశారు. ఇప్పుడేమో అందుబాటులో ఉన్న ఏభైవేల ఎకరాలు సరిపోదని, అలా అయితే మున్సిపాల్టీగానే మిగిలిపోతుందని చంద్రబాబు బెదిరిస్తున్నారు. కొత్తగా మరో నలభైవేల ఎకరాల భూముల సమీకరణకు సిద్దం అవుతున్నారు. నిర్మలా సీతారామన్ కు ఈ విషయాలన్నీ తెలుసో ,లేదో కాని ఆమె ఒక విషయం చెప్పారు. ఈ ప్రాంతంలో కూరగాయలు బాగా పండుతాయని, వాటికి ప్రోసెసింగ్ యూనిట్లు పెట్టడం, ఎగుమతికి అవసరమైన కోల్డ్ స్టోరేజీ ప్లాంట్లు నెలకొల్పడం వంటివి చేయాలని సూచించారు.
కాని ఇప్పటికే రాజధాని పేరుతో భూములన్నిటిని చంద్రబాబు ప్రభుత్వం దున్నివేయించింది. వేలాది ఎకరాలలో పంటలు లేకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగి అడవిలా మారినట్టు పలు కథనాలు వచ్చాయి. ఈ విషయాన్ని ఆమె గమనించి సరైన సలహా ఇచ్చి ఉండాల్సింది. బ్యాంకులు వారు రైతులకు సహకరించాలని చెబుతూనే కమర్షియల్ గా మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు. అంటే ఎవరికి ఎలాంటి రాయితీలు ఇవ్వవలసిన అవసరం లేదని తేల్చేశారన్నమాట. పోనీ అమరావతికి ఏమైనా కొత్తగా నిధులు ఇస్తున్నారా అంటే అదేమి చెప్పలేదు.
చంద్రబాబు తన ప్రసంగంలో కేంద్రం రూ.15 వేల కోట్ల ఇచ్చి సహకరిస్తోందని అన్నారు. కాని అది రుణమా?లేక గ్రాంటా అన్నది చెప్పినట్లు కనిపించలేదు. నిజంగానే అది గ్రాంట్ అయితే నిర్మలా సీతారామన్ ప్రస్తావించకుండా ఉంటారా?.. బడ్జెట్ లో ఏపీకి బలమైన మద్దతు ఇవ్వాలని ప్రధాని మోదీ చెప్పారని ఆమె తెలిపారు. కాని అది ఏ రూపంలో ఇంతవరకు ఇచ్చారు.
ప్రపంచ బ్యాంక్, ఇతర అంతర్జాతీయ బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకోవడానికి అనుమతి ఇస్తే ఏపీకి ఆర్థిక భారం అవుతుంది. అలాంటప్పుడు అది సాయం ఎలా అవుతుంది?. కేంద్రం నుంచి సుమారు రూ.36 వేల కోట్ల సాయం వస్తుందని ఏపీ బడ్జెట్లో పెడితే ఇప్పటికి కేవలం ఐదువేల కోట్ల లోపే అందిందట. దీని గురించి ఆమె ఏమైనా హామీ ఇస్తే బాగుండేది కదా!.
రాష్ట్రం సుమారు రూ.45 వేల కోట్ల భారీ రెవెన్యూ లోటుతో కొట్టుమిట్టాడుతోంది. అది తగ్గించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి సాయపడి ఉంటే అందరు అభినందించేవారు. అవేవి చేయకపోయినా చంద్రబాబు, తదితరులు మెచ్చుకుంటున్నారు. కాబట్టి కేంద్రంలోని వారికి ఇబ్బంది లేదనుకోవాలి. నిర్మలా సీతారామన్ కూడా చంద్రబాబుకు లేని క్రెడిట్ ఇవ్వడం ఆశ్చర్యపరిచింది. ఆయన చేసిన పనులు చెప్పి పొగిడితే తప్పు లేదు. కాని హైదరాబాద్‌లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నిర్మాణం అయనే చేసినట్లు నిర్మలా వ్యాఖ్యానించడం అందరిని విస్తుపరచింది.
హైదరాబాద్‌లో ఈ ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ అభివృద్ది అంతా వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ అంతా తానే నిర్మించానన్నట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటారు. ఈ మధ్య ఆయన ఒక స్పీచ్ ఇస్తూ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తానే వేసినట్లు చెప్పుకున్న వీడియో ఒకటి వైరల్ అయింది. దానికింద ఒక అధికారి గతంలో ఈ రింగ్ రోడ్డును వైఎస్సార్ ఎలా అభివృద్ది చేసింది వివరిస్తున్న దృశ్యం కనిపించింది. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రింగ్ రోడ్డు నిర్మాణం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిందని తెలిపే వీడియో కూడా వచ్చింది. అయినా చంద్రబాబు ఎందుకో అసత్యాలు చెప్పడానికే ప్రాధాన్యం ఇస్తూంటారు.
ఇలాంటి పరిస్థితిలో నిర్మలా సీతారామన్ కూడా హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ క్రెడిట్ ను చంద్రబాబుకు ఇవ్వడం ఎంతవరకు సమంజసం. చంద్రబాబు ఎప్పుడో ఇరవై ఏళ్ల కిందట ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి. ఆ తర్వాత జరిగిన అభివృద్దిని కూడా తన ఖాతాలో వేసుకుని ఏపీలో ప్రచారం చేసుకోవడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలన్నది ఆయన ఉద్దేశం అన్నది కనిపిస్తూనే ఉంది. హైదరాబాద్‌ను అంతగా అభివృద్ది చేసి ఉంటే మరి ఏపీలో విశాఖ,విజయవాడ,తిరుపతి వంటి నగరాలను ఎందుకు వృద్ది చేయలేకపోయారు?..
ఇకపై ముంబై ఆర్ధిక నగరం కాదట.అమరావతి అట. ఈ విషయాన్ని రాష్ట్ర ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు.ఈ రకంగా మాట్లాడడం నవ్వులపాలయ్యే అంశమా? కాదా? అన్నది ఆలోచించుకోవాలి. ముంబై ఎక్కడ?అమరావతి ఎక్కడ? అర్థం ఉండాలి కదా మాట్లాడడానికి!. విమానాశ్రయం పేరుతో, స్పోర్ట్స్ సిటీ పేరుతో రకరకాలుగా వేల ఎకరాల అదనపు భూమి సమీకరణకు ప్రభుత్వం సన్నద్దమవుతున్న తీరు అమరావతి రైతుల గుండెల్లో రైళ్లు పరుగులెత్తిస్తోంది. వారిని మభ్య పెడుతూ ఇలాంటి కార్యక్రమాలలో ప్రసంగాలు చేస్తే ఏమి ఉపయోగం?.

::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


