కుటుంబ పోషణార్థం టెన్త్‌కే చదువుకి స్వస్తి పలికాడు. ఏదో సాధించేద్దాం అనుకుంటూ ముంబై మహానగరంలో అడుగుపెట్టాడు. అది కూడా జేబులో కేవలం రూ. 200లతో కుటుంబ సభ్యులకు చెప్పపెట్టకుండా వచ్చేశాడు. అక్కడ బాంద్రాస్టేషన్‌లో పరిచయమైన స్నేహితుడి చేతిలో మోసానికి గురయ్యా..రోడ్డుపై నిలబడిపోయాడు. కట్‌చేస్తే..ఏంలేదు అన్న పరిస్థితిని నుంచి ఏకంగా 50 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయ్యి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. స్వయంకృషితో పైకొచ్చిన మరో సాంబయ్య అతడు..
అతడే దోసప్లాజ్ వ్యవస్థాపకుడు ప్రేమ్ గణపతి. తల్లిదండ్రులు ఏడుగురు తోబుట్టువులతో కడు పేదరికంలో ఉన్న కుటుంబాన్ని పేదరికం నుంచి బయపటపడేయాలన్న ఆరాటంతో ముంబైకి ఒంటరిగా వచ్చేశాడు. అది కూడా కేవలం రూ. 200 రూపాయాలతో మహానగరంలో అడుగుపెట్టాడు. అక్కడ బాంద్రా స్టేషన్‌లో పరిచయమైన స్నేహితుడే తోడు అనుకుంటే..తనదగ్గరున్న ఆ కాస్త డబ్బుని తీసుకుని పరారయ్యాడు.
తోపుడు బండితో మొదలైన వ్యాపారం..
తొలిసారిగా నమ్మకంతో చెలగాట మాడిన స్నేహితుడిని ఎదుర్కొని తల్లడిల్లిపోయాడు. ఏం చేయాలి..ఆకలిని ఎలా ఓర్చుకోవాలో అర్థంకాని పరిస్థితుల్లో కూడా ఆశను వెతుక్కుంటూ ఓ బేకరీలో ప్లేట్లు కడిగే పనికి కుదిరాడు. అలా నెలకు 150 రూపాయలు సంపాదించేవాడు. పడుకోవడానికి కటికి నేలపై స్థలం ఏర్పరుచుకున్నాడు. అలా ప్రతి నెల సంపాదించిన డబ్బుని ఆదాచేసి ఒక హ్యాండ్ బండిని అద్దెకు తీసుకున్నాడు.
పాత్రలు స్టవ్ కోసం దాదాపు రూ. వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టాడు. అలా వాషి రైల్వే స్టేషన్ ఎదురగా ఉన్న వీధిలో ఇడ్లీలు, దోసెలు అమ్మడం ప్రారంభించాడు. అది చూడటానికి కేవలం ఒక బండి, కానీ కస్టమర్లకు చాలా పరిశుభ్రంగా అందించే ఆహార ప్రదేశంగా వారి మనసులను గెలుచుకున్నాడు. తన సోదరులను ఈ పనిలో చేర్చుకుని..అందమైన బట్టలు, టోపీలతో కస్టమర్లను ఆకర్షించేలా వ్యాపారం చేశాడు.
అతడి భోజనంలోని రుచి త్వరలో వేలాది మంది ప్రజలకు చేరువై నెలకు దాదాపు రూ. 20 వేలు టర్నోవర్‌ని ఆర్జించే స్థాయికి చేరుకుంది. వారంతా ఒకే అద్దె గదిలో ఉండేవారు. నిరంతరం జీవనాధారమైన తమ తోపుడు బండి, వంటగది కమ్ బెడ్‌రూం తమనుంచి లాగేసుకుంటారనే భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. అలా ఐదేళ్ల తర్వాత 1997లో చిన్న స్థలంలో ప్రేమ్ సాగర్ దోస ప్లాజా హోటల్‌ని పెట్టుకునే రేంజ్‌కి వచ్చాడు.
అలా పుట్టింది షెజ్వాన్ దోస..
అక్కడకు వచ్చిన విద్యార్థులు, స్నేహితులై ఇంటర్నెట్‌ని పరిచయం చేశారు. దాని సాయంతో ప్రపంచవ్యాప్తంగా విభిన్న రకాల వంటకాలపై అవగాహన ఏర్పరుచుకున్నాడు. అలా పలు ప్రయోగాలు చేస్తూ ఉండగా..షెజ్వాన్ దోస అనే రెసిపీని కనుగొన్నాడు. అక్కడ నుంచి వెనుదిరగకుండా ఏకంగా 105 రకాల దోసెలను సృష్టించాడు. ఆ తర్వాత మాల్‌లో తన వ్యాపారానికి కాస్త చోటు ఇవ్వమని అడగగా బ్రాండ్ కాదంటూ పోమ్మన్నారు మాల్ నిర్వాహకులు.
మరో సెంటర్ వన్‌మాల్ నిర్వాహకులకు అతడి చేతి ఆహారం రుచి గురించి తెలుసు. దాంతో వాళ్లు వ్యాపారం పెట్టుకునేందుకు స్థలాన్ని అందించారు. అక్కడ నుంచి మరిన్ని దుకాణాలు పెట్టమంటూ అభ్యర్థనలు వెల్లువెత్తాయి. ఆ సింగిల్ తోపుడు బండి నుంచి భారతదేశం నుంచి దుబాయ్, ఆస్ట్రేలియా వరకు విస్తేరించేలా 70కి పైగా దుకాణాలు వెలిసాయి. ఆ రోజు మోసగింపబడిని రూ. 200లతో మొదలైన ప్రస్థానం ఇప్పుడూ ఏడాదికి రూ. 50 కోట్ల టర్నోవర్ అందుకునే వ్యాపారాన్ని నిర్మించే రేంజ్‌కి చేరాడు.
చివరగా ప్రేమ్ గణమపతి మాట్లాడుతూ..ఇదంతా అకస్మాత్తుగా వచ్చిన ఐడియా కాదని, రెండు చేతులు ఖాళీగా ఆకాశాన్ని చూస్తూ ఉన్నప్పుడూ మోసానికి గురైన రైల్వేస్టేషన్‌ని దురదృష్టకరమైన ప్రదేశం చూడలేదని అంటాడు. ఇదే ప్రదేశం తనకు ఏదో మార్గాన్ని చూపిస్తుందని వెతుక్కుంటూ వెళ్లాను అలా దొరికిన ప్లేట్లు కడిగే పనే తన పాలిట దైవంగా నమ్మా..అదే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది అంటాడు ప్రేమ్ గణపతి.
దొరికిన చిన్న పనిని చూసి నిరాశ పడకుండా..ఒక్కో మెట్టుని చేసుకుంటూ..అభ్యున్నతికి మార్గం వేసుకుని యువతకు ప్రేరణగా నిలవడమే గాక, మోసపోవడం అంటే దురదృష్టం కాదు..స్ట్రాంగ్ నిలబడేందుకు పునాది అని ప్రేమ్ గణపతి కథ చెప్పకనే చెబుతోంది. అంతేగాదు "కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషలవుతారు అన్న నానుడికి సరైన అర్థం మన ప్రేమ్ గణపతి" కదూ..!


