
బార్ కౌన్సిల్ సిఫార్సు భవిష్యత్‌లో ‘స్పేస్ లా’కు డిమాండ్
జాతీయ స్థాయిలో అధ్యయనం
కొన్నేళ్ల క్రితమే దీనిపై అధ్యయనం చేసిన మండలి చైర్మన్
తెలంగాణ లా కాలేజీల్లోనూ కోర్సుకు ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: న్యాయవాద కోర్సులను ఆధునీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా అంతరిక్ష చట్టాలకు సంబంధించిన కోర్సులు విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనికోసం బార్ కౌన్సిల్ సహా పలువురు న్యాయ నిపుణుల సూచనలు తీసుకుంది. ఇటీవల న్యాయవాద విద్యకు సంబంధించి ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఇటీవల కాలంలో అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనలు పెరుగుతున్నాయి. దీంతోపాటు వైమానిక రంగం విస్తృతమవుతోంది. ఆయా రంగాల్లో ఇప్పటి వరకూ పరిశోధనలు, ఉపాధి అవకాశాలపై మాత్రమే సంస్థలు దృష్టి పెట్టాయి.
అంతరిక్ష చట్టాలకు సంబంధించిన కోర్సులు దేశంలో అరుదుగా ఉన్నాయి. వైమానిక, అంతరిక్ష కంపెనీలకు చట్టాలపై అవగాహన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రంగంలో అంతరిక్ష న్యాయవాద కోర్సులు చేసిన వారి డిమాండ్ పెరిగింది. వచ్చే ఏడాది నుంచి ఈ కోర్సును దేశవ్యాప్తంగా ప్రధాన లా కాలేజీల్లో అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి నల్సార్ వర్సిటీలో విధులు నిర్వర్తించే సమయంలో స్పేస్ లాపై ప్రత్యేక అధ్యయనం చేశారు. లా జర్నల్‌లో ప్రచురితమైన ఈ అంశాలు ప్రస్తుతం కీలకంగా మారబోతున్నాయి.
స్పెషలైజేషన్ కోర్సులు
దేశంలో ప్రస్తుతం మూడు, ఐదేళ్ల లా కోర్సులు ఉన్నా యి. వీటిలో క్రిమినల్, సివిల్, కంపెనీ చట్టాలకు సంబంధించిన చాప్టర్లకు ఎక్కువ ప్రాచుర్యం ఉంది. స్పేస్ లాను మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం చేసిన తర్వాత ప్రత్యేక కోర్సుగా తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ కోర్సులో అంతర్జాతీయ చట్టాలను కూడా మేళవింపు చేయాలని నిర్ణయించారు. ప్రత్యేక కోర్సు గా అందుబాటులోకి తేవాలని కేంద్రం భావిస్తున్న ఈ కోర్సులో వివిధ దేశాల చట్టాలు, బీమా సంస్థల న్యాయపరమైన అంశాలను క్రోడీకరించే యోచనలో ఉన్నారు. ఇప్పటికే స్పేస్ ఎక్స్, ఇస్రో వంటి సంస్థలు లా కాలేజీల భాగస్వామ్యంతో స్పేస్‌లా కోర్సులను పరిమితంగా అందిస్తున్నాయి.

అంతరిక్ష ప్రయోగాలు, ఉపగ్రహాలు, ప్రైవేట్ స్పేస్ కంపెనీలు, దేశాల మధ్య ఒప్పందాలు, స్పేస్‌లో ఆస్తుల హక్కులు వంటి అంశాలను నియంత్రించే అంశాలను ఇందులోకి తేవాలన్న సూచనలు కేంద్రానికి వచ్చాయి. కోర్సులో స్పేస్ మిషన్లకు సంబంధించిన భద్రతా చట్టాలు, స్పేస్ మిషన్ల వల్ల జరిగే ప్రమాదాలకు బాధ్యత, స్పేస్‌లో ఆస్తుల హక్కులు, మిలిటరీ ఉపయోగం, ప్రైవేట్ కంపెనీల కార్యకలాపాలు కోర్సులో ప్రధాన చాప్టర్లుగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
పెరుగుతున్న డిమాండ్
స్పేస్‌లా చేసిన వారికి విస్తృత ఉపాధి అవకాశాలున్నాయి. ఇస్రో, డీఆర్‌డీవో వంటి సంస్థల్లో లీగల్ కౌన్సెల్‌లో తీసుకుంటున్నారు. యూఎన్ ఆఫీస్ ఫర్ అవుట్ స్పేస్ ఎఫైర్స్‌లో మంచి వేతనంతో ఉద్యోగం లభించే వీలుంది. అంతర్జాతీయ ఎన్‌జీవోలు, స్పేస్ కంపెనీలు (స్పేస్ ఎక్స్, బ్లూ ఆర్జిన్, ఒన్ వెబ్, స్కైరూట్, అగి్నకుల్ వంటి సంస్థల్లో వీరికి లీగల్ కన్సల్టెంట్‌గా లేదా పాలసీ అడ్వైజర్‌గా అవకాశం కలి్పస్తున్నారు. స్పేస్ టూరిజం, ఉపగ్రహ వ్యాపారం, డేటా ప్రైవసీ, భద్రతా చట్టాలు.. ఇవన్నీ కొత్త కెరీర్ మార్గాలుగా నిపుణులు చెబుతున్నారు.
న్యాయ వృత్తికి సరికొత్త కవచం
చాలామందికి ఏరో స్పేస్, వైమానిక వ్యవస్థ గురించే తెలుసు. ఈ రంగంలో రక్షణ, భద్రత, బీమా వంటి కీలకమైన అంశాలకు అంతర్జాతీయంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. వైమానిక పరిశోధన, అంతరిక్ష శోధన పెరుగుతున్న తరుణంలో ఇందుకు సంబంధించిన చట్టాలపై నైపుణ్యం అవసరం. ఈ కోర్సులను విస్తృతంగా అందుబాటులోకి తేవాల్సిన అవసరం కూడా ఉంది. – ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి ఉన్నత విద్యామండలి చైర్మన్
వీటి అవసరం చాలా ఉంది
అంతరిక్ష వివాదాల పరిష్కారంపై ఆధిపత్యం అవసరం. న్యాయవాద వృత్తిలో ఇందుకు సంబంధించిన చట్టాలను ఆధునీకరించి అందించడం కీలకం. వైమానిక ప్రమాదాల సమయంలో నిబంధనలు, బీమా పొందేందుకు ఉండే చట్టపరమైన అంశాలను పరిశీలించాలంటే ఈ రంగంలో ఉన్న న్యాయపరమైన అంశాలపై పట్టు ఉండాలి. ఈ తరహా కోర్సుల అవసరం చాలా ఉంది. – జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి