
21, 22 తేదీల్లో యూజీ, పీజీ కోర్సులకు రిజిస్ట్రేషన్లు
25న సీట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీ లాసెట్, పీజీఎల్ సెట్–2025లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 21, 22 తేదీల్లో సంబంధిత కోర్సులకు రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, 25న సీట్లు కేటాయిస్తారని ఉన్నత విద్యామండలి కార్యదర్శి బి.తిరుపతిరావు తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 27 నుంచి 29 మధ్య ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలన్నారు.
అయితే, ఈ నెల 27 నుంచే తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. కాగా, చిత్తూరులోని రాయలసీమ లా కాలేజీ, కేఎంఆర్ లా కాలేజీలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) ఆమోదం, యూనివర్సిటీ గుర్తింపు లేనందున వీటిలో ప్రవేశాలు కోర్టు తీర్పునకు లోబడి జరుగుతాయని తెలిపారు. అనంతపురంలోని బెస్ట్ యూనివర్సిటీకి బీసీఐ ఆమోదం లేదని, శ్రీకాకుళంలోని ఎంపీఆర్ లా కాలేజీకి సైతం బీసీఐ ఆమోదంతోపాటు యూనివర్సిటీ గుర్తింపు కూడా లేదని వివరించారు. ఆయా విద్యాసంస్థల్లో అడ్మిషన్లకు ఆప్షన్లు ఇచ్చే అభ్యర్థులు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.