
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో ఏ ప్రాంతంలో ఇల్లు కొనుగోలు చేయాలన్నా.. కనీసం రూ.80 లక్షల నుంచి రూ.కోటి వెచ్చించాల్సిందే. అదే ఐటీ హబ్ పరిసరాలు, సిటీలోని ప్రధానమైన ప్రాంతాల్లో ఇల్లు కొనాలంటే మాత్రం కనీసం రూ.కోటిన్నరకు పైగా ఖర్చు చేయాల్సిందే. ఇక గేటెడ్ కమ్యూనిటీలు, ప్రీమియం ప్రాజెక్ట్‌లలో అయితే కోట్లు ఖర్చు చేయాల్సిందే. అందుకే చాలా మంది మధ్యతరగతి వారికి హైదరాబాద్‌లో సొంతిల్లు కలగానే మిగిలిపోతోంది. ఇటువంటి సమయంలో చాలా మంది పాత ఇళ్ల కొనుగోలుపై దృష్టిసారించారు. అందులోనూ పాత అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్స్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
సెకండ్ సేల్స్ ఫ్లాట్స్‌ను కొనుగోలు చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే చిక్కులు ఎదుర్కోక తప్పదని రియల్టీ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాత అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్ కొనుగోలు చేసే సమయంలో పలు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. సెకండ్ సేల్స్ ఫ్లాట్స్ కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల డబ్బులను ఆదా చేసుకోవడంతో పాటు న్యాయపరమైన చిక్కుల నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు.
మార్కెట్ రేటు కనుక్కోండి..
రీసేల్ ప్రాపర్టీలను కొనుగోలు చేసే ప్రాంతంలో అసలు ఆ ప్రాంతంలో చ.అ. ధరలు ఎంత ఉన్నాయో ముందుగానే తెలుసుకుంటే మీరు ఆ ప్రాంతంలోని ధరను బట్టి బేరం ఆడుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా బ్రాండ్ న్యూ ఫ్లాట్ ధరతో పోలిస్తే పాత అపార్ట్‌మెట్లలోని ఫ్లాట్ ధరలో చాలా వ్యత్యాసం ఉంటుంది. చ.అ.కు ప్రాంతాన్ని బట్టి కనీసం 20-40 శాతం వరకు వ్యత్యాసం ఉంటుంది. అందుకే ఆ ప్రాంతంలో ఫ్లాట్స్ ధరలను తెలుసుకుని బేరమాడి తక్కువ ధరకు ఫ్లాట్ కొనుక్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
డాక్యుమెంట్లను పరిశీలించాలి
పాత అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్ కొనుగోలు సమయంలో డాక్యుమెంట్లను క్షుణ్నంగా పరిశీలించాలి. అవసరమైన న్యాయ నిపుణులను సంప్రదించాలి. యాజమాన్య హక్కులు, ప్రభుత్వ రంగ ఏజెన్సీల అనుమతులు, బ్యాంక్ రుణాలు వంటి వాటి గురించి తెలుసుకోవాలి. ప్రధానంగా బ్యాంక్‌లలో ఫ్లాట్‌లో ఎంత రుణం నేరుగా సంబంధిత బ్యాంక్‌ను సంప్రదించి కనుక్కోవాలి. కొనుగోలుకు ముందే అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన కమ్యూనిటీ నిబంధనలు తెలుసుకోవడం వల్ల నివాసిత సంఘంతో చిక్కులు లేకుండా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
బ్రోకర్లపై ఆధారపడొద్దు..
ఫ్లాట్ కొనుగోలు కోసం బ్రోకర్లపై ఆధారపడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. నేరుగా ఫ్లాట్ ఓనర్‌తో మాట్లాడుకొని డీల్ కుదుర్చుకుంటే ధర తగ్గే అవకాశం ఉంటుంది.