భర్త, సంతానం లేని మహిళలనుద్దేశించి సుప్రీంకోర్టు విజ్ఞప్తి
మీ స్వార్జితాలపై వారసత్వ హక్కుల కోసం పోటీలేకుండా చూసుకోవాలి
న్యూఢిల్లీ: భారతీయ స్త్రీలు తమ స్వార్జితాలను తమ తదనంతరం ఎవరికి చెందాలనే విషయంలో కచ్చితంగా వీలునామా రాస్తే ఆయా ఆస్తులపై భవిష్యత్తులో ఎలాంటి వారసత్వ తగాదాలు రాబోవని సుప్రీంకోర్టు ఆశాభావం వ్యక్తంచేసింది.
ఉన్నత విద్యావంతురాలై కష్టపడి పనిచేసే మహిళలు హఠాత్తుగా భర్త, కుమారులు, కుమార్తెలను కోల్పోతే ఆమె ఆస్తులు అత్తింటి వాళ్లకు చెందుతాయా? పుట్టినింటి వాళ్లకు చెందుతాయా? అనే ప్రశ్న తలెత్తకుండా ఉండేందుకు వీలునామా అనేది చక్కటి పరిష్కారమని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల ధర్మాసనం అభిప్రాయపడింది.
హిందూ వారసత్వ చట్టం, 1956ను అమల్లోకి తెచ్చేనాటికి మన రాజ్యాంగ నిర్మాతలు భారతీయ హిందూ మహిళలు ఒకవేళ పెద్దమొత్తంలో ఆమె పేరిటే ఆస్తిపాస్తులు ఉంటే ఎలా అనే ఆలోచన వచ్చి ఉండకపోవచ్చని అందుకే ఆ నిబంధనలు చట్టంలో లేవని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆస్తుల వారస త్వం విషయంలో తల్లిదండ్రులు, అత్తా మామల మధ్య మనస్పర్థల నివారణకు ఇకనైనా హిందూ మహిళ వీలునామా బాట పట్టాలని ధర్మాసనం సూచించింది.
హిందూ మహిళ మరణిస్తే వీలునా మా రాయని పక్షంలో ఆమె పేరిట ఉన్న స్థిరచ రాస్తులన్నీ భర్త తరఫు వారసులకే చెందుతాయంటూ హిందూ వారసత్వచట్టం,1956లోని 15(1) (బి) సెక్షన్‌లో పేర్కొనడాన్ని న్యాయవాది స్నిధా మెహ్రా కోర్టులో సవాల్‌చేయగా ఈ ప్రజా ప్రయోజనవ్యాజ్యాన్ని బుధవారం సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ సెక్షన్ రాజ్యాంగంలోని 14, 15, 21వ అధికరణాలను ఉల్లంఘించేదిగా ఉందన్న వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.
‘‘ దేశంలోని మహిళలు ముఖ్యంగా హిందు మహిళల ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు తావివ్వకూడదనే ఉద్దేశంతోనే వీలునామా ఉంటే బాగుంటుందని సూచి స్తున్నాం’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘వారసత్వం పోరు రాకుండా ఉండాలంటే సంబంధిత మహిళ చనిపోతే వెంటనే తల్లిదండ్రులు, అత్తామామలు రాజీ మార్గాన్ని ఎంచుకోవాలి. మ ధ్య వర్తిత్వంతో తీసుకునే నిర్ణయాన్ని కోర్టు తీర్పుగా మేం గౌరవిస్తాం’’ అని కోర్టు హామీ ఇచ్చింది.


