‘ఒంటరితనానికి ఇక్కడ చోటు లేదు.. దయచేసి ఒంటరిగా రాకండి’ అంటూ ఒక రెస్టారెంట్ పెట్టిన బోర్డు ఇప్పుడు సోషల్‌మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. మారుతున్న సామాజిక పోకడలు, ఏకాంతంగా జీవించే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఒక నూడిల్ రెస్టారెంట్ ఒంటరిగా వచ్చే కస్టమర్లకు సర్వీసు చేయబోమని బోర్డు పెట్టడం వివాదానికి కారణమైంది.
దక్షిణకొరియా జియోలా ప్రావిన్స్‌లో ఉన్న యోసు నగరంలోని ఒక నూడిల్ రెస్టారెంట్ వెలుపల ఉంచిన నోటీసు బోర్డు చర్చకు దారితీసింది. కొరియా టైమ్స్‌లోని వివరాల ప్రకారం.. ఒక సందర్శకుడు ఈ నోటీసును ఫోటో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయగా అది త్వరగా వైరల్ అయింది. ఈ నోటీసులో సోలో డైనర్ల కోసం కొన్ని సూచనలు ఉన్నాయి.
రెండు ఐటమ్స్ ఆర్డర్ చేయండి.
రెండు ఐటమ్స్ తినండి.
మీరు ఒంటరిగా ఉంటే మీ స్నేహితుడిని పిలవండి.
తదుపరి మీ భార్యతో రెస్టారెంట్‌కు రండి.
ఒంటరితనానికి ఇక్కడ చోటు లేదు.. దయచేసి ఒంటరిగా రాకండి.. అని ఉన్నాయి.
ఈ పోస్ట్‌పై ఆన్‌లైన్‌లో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. చాలా మంది రెస్టారెంట్ వైఖరిని విమర్శించారు. ఒంటరిగా తినడం అనేది ఒంటరితనంతో ఎందుకు సమానం అవుతుందని ప్రశ్నించారు. కస్టమర్లకు విలువ ఇవ్వడం లేదని వాదించారు. అయితే, మరికొంతమంది ఈ విధానాన్ని సమర్థించారు. తమ వ్యాపారంలో అలాంటి నిర్ణయాలు తీసుకునే హక్కు యజమానికి ఉంటుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ‘కేంద్రం లేబర్ కోడ్స్ మాకొద్దు’.. అందులో ఏముంది?


