
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ఆదివారం (అక్టోబర్ 19) నుంచి ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య తొలి వన్డే పెర్త్ వేదికగా జరగనుంది. ఇప్పటికే పెర్త్‌కు చేరుకున్న భారత జట్టు నెట్ ప్రాక్టీస్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది.
మరోవైపు ఆస్ట్రేలియా కూడా తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంది. రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరం కావడంతో ఆసీస్ జట్టు పగ్గాలను మిచెల్ మార్ష్ చేపట్టాడు. ఇక మొన్నటివరకు టీమిండియా వన్డే కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మ.. ఇప్పడు కేవలం ఆటగాడిగా మాత్రమే బరిలోకి దిగనున్నాడు.
భారత వన్డే జట్టు సారథ్య బాధ్యతలను యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు అప్పగించారు. భారత వన్డే కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత హిట్‌మ్యాన్ ఆడుతున్న తొలి మ్యాచ్ కావడంతో అందరి దృష్టి అతడిపైనే ఉంది.
ఆసీస్ గడ్డపై అదుర్స్..
కాగా ఆస్ట్రేలియా గడ్డపై రోహిత్ శర్మకు అద్భుతమైన రికార్డు ఉంది. ఆసీస్‌లో ఇప్పటివరకు ఇప్పటివరకు 30 వన్డేలు(ప్రపంచకప్ మ్యాచ్‌లతో కలిపి) ఆడిన రోహిత్ శర్మ.. 53.12 సగటుతో 1,328 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఐదు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాడు.
అదేవిధంగా కంగారుల గడ్డపై ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్‌ల్లో భారత తరపున అత్యధిక పరుగులు చేసిన రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. 19 వన్డేల్లో 58.23 సగటుతో 990 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. అత్యదిక స్కోర్ 171 పరుగులుగా ఉంది.
పెర్త్‌లో తిరుగులేని హిట్‌మ్యాన్..
ఇక తొలి వన్డే జరిగే పెర్త్‌లో కూడా రోహిత్ మంచి రికార్డు ఉంది. పెర్త్ మైదానంలో హిట్‌మ్యాన్ కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 122.5 సగటుతో ఏకంగా 245 పరుగులు చేశాడు. ఈ వేదికగా 2016లో ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో రోహిత్ విధ్వంసం సృష్టించాడు. ఆస్ట్రేలియా బౌలర్లను ఉతికారేశాడు.
ఈ మైదానంలో రోహిత్ ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆ మ్యాచ్‌లో 163 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్..13 ఫోర్లు, 7 సిక్స్‌లతో 171 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. పెర్త్‌లోనే వాకా స్టేడియంలో వన్డే సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. ఇప్పుడు అదే జోరును కనబరిచాలని రోహిత్ అభిమానులు కోరుకుంటున్నారు.
చదవండి: 'ఇదొక క్రూరమైన చర్య'.. అఫ్గాన్ క్రికెటర్ల మృతిపై రషీద్ ఖాన్ దిగ్భ్రాంతి