IND vs AUS: ఈసారైనా కంగారులను కంగారు పెట్టిస్తారా? | India vs Aus ODI: Strengths, Weaknesses, and Prediction | Sakshi
Sakshi News home page

IND vs AUS: ఈసారైనా కంగారులను కంగారు పెట్టిస్తారా?

Oct 17 2025 11:49 AM | Updated on Oct 17 2025 12:24 PM

India vs Aus ODI: Strengths, Weaknesses, and Prediction

వరల్డ్ క్రికెట్‌లో రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోరుకు సమయం అసన్నమైంది. అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌లో తలపడేందుకు ఆస్ట్రేలియా-భారత్ జట్లు సిద్దమయ్యాయి. తొలి వన్డే పెర్త్ వేదికగా జరగనుంది.

ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నా​యి. ఇప్ప‌టికే పెర్త్‌కు చేరుకున్న భార‌త్ నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తోంది. మ‌రోవైపు ఆసీస్ కూడా స్పెష‌ల్ ట్రైనింగ్ క్యాంపులో చెమటోడ్చుతుంది.  ఈ నేప‌థ్యంలో ఇరు జ‌ట్లు బ‌ల‌బ‌లాలు, గ‌త రికార్డులు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దం.

గిల్ జర్నీ మొద‌లు.. 
ఈ సిరీస్‌తో భార‌త వ‌న్డే కెప్టెన్‌గా శుభ్‌మ‌న్ గిల్ ప్ర‌యాణం మొద‌లు కానుంది. రోహిత్ శ‌ర్మ స్ధానంలో జ‌ట్టు ప‌గ్గాల‌ను గిల్‌కు సెల‌క్ట‌ర్లు అప్ప‌గించిన సంగ‌తి తెలిసిందే. టెస్టు కెప్టెన్‌గా త‌న తొలి టెస్టు సిరీస్‌లో ఆకట్టుకున్న గిల్‌.. ఇప్పుడు వన్డే సార‌థిగా ఎలా రాణిస్తాడో అని అంద‌రూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆసియాకప్‌, విండీస్‌తో టెస్టు సిరీస్ గెలిచి మంచి జోష్‌లో ఉన్న భారత్‌.. అదే జోరును ఆసీస్ గడ్డపై కొనసాగించాలని భావిస్తోంది. గిల్ సేన బ్యాటింగ్ పరంగా బలంగా ఉన్నప్పటికి.. బౌలింగ్‌లో మాత్రం చాలా వీక్‌గా కన్పిస్తోంది.

బుమ్రా దూరం.. సిరాజ్‌పైనే భారం
ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అతడి స్ధానంలో మరో స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్‌లో భారత్‌ పేస్ ధళ నాయకుడిగా సిరాజ్ వ్యవహరించనున్నాడు. అయితే భారత జట్టులో ఫాస్ట్ బౌలర్లలో సిరాజ్‌కు ఒక్కడికే ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన అనుభవం ఎక్కువగా ఉంది.

అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ద్ కృష్ణ వంటి యువ పేసర్లకు ఆసీస్ పిచ్‌ల్‌పై ప‌ట్టు లేదు. ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచ‌క‌ప్‌-2022లో అర్ష్‌దీప్ 10 వికెట్లు పడగొట్టినప్పటికి.. ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లో ఎలా రాణిస్తాడన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

హర్షిత్ రాణా, ప్ర‌సిద్ద్ కృష్ణ బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీలో ఆడినప్పటికి వారి స్ధాయికి తగ్గ ప్రదర్శనలు చేయలేకపోయారు. జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఒక్కడే ఉన్నాడు. అతడితో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లగా వాషింగ్టన్ సుందర్‌, అక్షర్ పటేల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే ఆసీస్ పిచ్‌లు ఎక్కువగా పేస్ బౌలర్లు అనుకూలించే అవకాశమున్నందన తుది జట్టులో కుల్దీప్‌కు చోటు దక్కడం కష్టమే.

రో-కోపై అందరి కళ్లు.. 
భారత ‍బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా కన్పిస్తోంది. భారత్ టాప్ ఆర్డర్‌, మిడిలార్డర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లతో నిండి ఉన్నది. నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి స్టార్ ఆల్‌రౌండర్లు సైతం జట్టులో ఉన్నారు.

కాబట్టి బ్యాటింగ్ పరంగా భారత్‌కు ఎటువంటి సమస్య లేదు. ముఖ్యంగా కోహ్లి, రోహిత్‌కు ఆసీస్ గడ్డపై మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ సీనియర్ ద్వయం మరోసారి చెలరేగితే కంగారులకు కంగారు తప్పదు. వీరిద్దరూ దాదాపు 7 నెలల తర్వాత భారత జట్టు తరపున ఆడేందుకు సిద్దమయ్యారు. దీంతో అందరి కళ్లు వీరిద్దరిపైనే ఉన్నాయి.

ఆసీస్‌కు గాయల బెడద..
కాగా ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా రెగ్యూలర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ లేకుండా ఆడనుంది. నిజంగా ఇది ఆసీస్‌కు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే కమ్మిన్స్‌కు ఒంటి చేత్తో గెలిపించే సత్తా ఉంది. అతడితో పాటు వెన్ను గాయం కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ సైతం భారత్‌తో సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. 

గ్రీన్ స్దానంలో మార్న‌స్ ల‌బుషేన్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. అదేవిధంగా తొలి వన్డేకు స్టార్ స్పిన్నర్ జంపా, ఇంగ్లిష్ కూడా దూరమయ్యారు. క‌మ్మిన్స్ లేక‌పోవ‌డంతో ఆసీస్ బౌలింగ్ విభాగం కూడా కాస్త వీక్‌గానే క‌న్పిస్తోంది. మిచెల్ స్టార్‌, జోష్ హాజిల్‌వుడ్‌లతో కూడిన ఆసీస్ బౌలింగ్ యూనిట్ ఫ‌వ‌ర్ ఫుల్ భార‌త బ్యాటింగ్ లైన‌ప్‌ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. అయితే హోమ్‌ ఎడ్వంటేజ్‌ ఖచ్చితంగా ఆసీస్‌కు కలిసిస్తోంది.

భారత్‌కు హెడ్‌ 'ఎక్‌'
భార‌త బౌల‌ర్ల‌కు ఆసీస్ స్టార్ ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ నుంచి ముప్పు పొంచి ఉంది. టీమిండియాపై వ‌న్డేల్లో ట్రావిస్ హెడ్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్‌పై 9 వ‌న్డేలు ఆడిన హెడ్‌.. 43.12 స‌గ‌టుతో 345 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచ‌రీతో పాటు హాఫ్ సెంచ‌రీ కూడా ఉన్నాయి. 

హైయెస్ట్ స్కోర్ 137 ప‌రుగులుగా ఉంది. టెస్టుల్లో భార‌త్‌పై 27 మ్యాచ్‌లు ఆడి 46.52 స‌గ‌టుతో 1163 ప‌రుగులు సాధించాడు. ఇక అత‌డితో కెప్టెన్ మిచిల్ మార్ష్‌, మాథ్యూ షార్ట్, అలెక్స్ క్యారీ వంటి స్టార్ ఆట‌గాళ్లు ఉన్నారు. ఏదేమైన‌ప్ప‌టికి ఆసీస్ కంటే భార‌త్ బ్యాటింగ్ విభాగ‌మే ప‌టిష్టంగా క‌న్పిస్తోంది.

ఆసీస్‌దే పైయి..
భారత జట్టు చివరగా వైట్‌బాల్ సిరీస్‌లు ఆడేందుకు 2020-21లో వెళ్లింది. అయితే వన్డే సిరీస్‌ను 2-1తో టీమిండియా కోల్పోయింది. ఆ సిరీస్‌లో భారత్ తరపున హార్దిక్ పాండ్యా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు భారత్‌-ఆసీస్ మధ్య 152 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఆస్ట్రేలియా 84 మ్యాచ్‌లలో విజయం సాధించగా, భారత్‌ 58 మ్యాచ్‌లలో గెలిచింది. 10 మ్యాచ్‌లు ఫలితంలేకుండా ముగిశాయి.

చెత్త రికార్డు..
ఆస్ట్రేలియాలో భారత్ జట్టు చెత్త రికార్డు ఉంది. ఆసీస్ గడ్డపై భారత్‌ 54 వన్డేలు ఆడగా.. కేవలం 14 సార్లు మాత్రమే గెలిచింది. 38 సార్లు ఓడింది, 2 మ్యాచ్‌లు ఫలితంలేకుండా ముగిశాయి. అక్కడ భారత్‌ విజయం శాతం సుమారు 25.9% మాత్రమే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement