
ప్యాట్ కమిన్స్ కామెంట్స్ వైరల్
టీమిండియా దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో చివరగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన వీరిద్దరు.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ (IND vs AUS ODIs)తో పునరాగమనం చేయనున్నారు. చాన్నాళ్ల తర్వాత రో- కో తిరిగి వస్తున్న నేపథ్యంలో అభిమానులు ఖుషీ అవుతున్నారు.
అదే సమయంలో రోహిత్- కోహ్లి వన్డేల నుంచి కూడా త్వరలోనే రిటైర్ అవనున్నారనే వార్త ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన సమయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.
హామీ ఇవ్వలేదు
వన్డే కెప్టెన్‌గా రోహిత్‌పై వేటు వేసి.. శుబ్‌మన్ గిల్ (Shubman Gil)కు పగ్గాలు అప్పగించడంపై స్పందిస్తూ.. ‘‘వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ ప్రణాళికల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. అంతేకాదు.. రో- కో ఈ మెగా ఈవెంట్లో ఆడతామని హామీ ఇవ్వలేదు’’ అంటూ రిటైర్మెంట్ ఊహాగానాలకు అగార్కర్ ఊతమిచ్చాడు.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. టీమిండియా టాప్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు ఆస్ట్రేలియాలోని అభిమానులకు ఇది ఆఖరి అవకాశమని కమిన్స్ అన్నాడు.
ఆస్ట్రేలియాలో ఉన్న ఫ్యాన్స్‌కు ఇదే ఆఖరు
‘‘ నిస్సందేహంగా వారిద్దరు ఆటలో చాంపియన్లు. వారితో మేం ఆడినప్పుడల్లా అభిమానులు మ్యాచ్‌లు చూసేందుకు ఎంతో ఉత్సాహం ప్రదర్శించారు. గత 15 ఏళ్లలో వారిద్దరు భారత్ ఆడిన ప్రతీ సిరీస్‌లో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియాలో ఉన్న ఫ్యాన్స్‌కు వారి ఆటను చూడటం ఇదే ఆఖరిసారి కావచ్చు’’ అని కమిన్స్ అభిప్రాయపడ్డాడు.
కమిన్స్ లేకుండానే
కాగా వెన్ను నొప్పితో బాధపడుతున్న కమిన్స్ టీమిండియాతో సిరీస్‌లలో ఆడటం లేదన్న విషయం తెలిసిందే. అతడి స్థానంలో.. ఆసీస్ టీ20 సారథి మిచెల్ మార్ష్.. వన్డే జట్టును కూడా ముందుకు నడిపించనున్నాడు. ఇక అక్టోబరు 19- నవంబరు 8 వరకు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది.
ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే.. ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్టులకు కూడా రోజుల వ్యవధిలో రో- కో గుడ్‌బై చెప్పేశారు. ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్న ఈ దిగ్గజ బ్యాటర్లు.. ఐపీఎల్‌లోనూ అభిమానులను అలరిస్తున్నారు.
చదవండి: IND vs AUS: వన్డే సిరీస్‌కు ముందు.. విరాట్ కోహ్లి పోస్ట్ వైరల్