
అగార్కర్ (PC: BCCI)
టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma) శకం ముగిసింది. ఇప్పటికే టెస్టు, అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన హిట్‌మ్యాన్.. వన్డేల్లో మాత్రం కెప్టెన్‌గా కొనసాగుతానని ప్రకటించాడు. అయితే, అనూహ్య రీతిలో ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రోహిత్‌పై వేటు వేసింది.
వన్డే సారథిగా రోహిత్ శర్మను తప్పించి.. అతడి స్థానంలో.. యువ ఆటగాడు, టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు పగ్గాలు అప్పగించింది. దీంతో రోహిత్ కేవలం ఆటగాడిగానే జట్టులో కొనసాగనున్నాడు.
ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై రోహిత్ శర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిగ్గజ కెప్టెన్‌కు ఇది అవమానం లాంటిదేనని సోషల్ మీడియా వేదికగా సెలక్టర్ల తీరును ఎండగడుతున్నారు. వన్డేల్లో డెబ్బై ఐదుకు పైగా విజయశాతం కలిగి ఉన్న సారథి పట్ల ఇలా వ్యవహరించడం సరికాదని హితవు పలుకుతున్నారు.
అందుకే రోహిత్ శర్మపై వేటు
ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్‌లకు జట్టును ప్రకటించిన సందర్భంగా ఈ విషయంపై వివరణ ఇచ్చాడు. ‘‘భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది.
జట్టు అత్యుత్తమ ప్రయోజనాల గురించే ఆలోచించాల్సి ఉంటుంది. ముందుగానే స్పందించి.. కొత్త వ్యక్తి (గిల్) చుట్టూ జట్టును నిర్మించాల్సి ఉంటుంది. ఇది సహేతుకమైన నిర్ణయం’’ అగార్కర్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు.
అదే విధంగా.. మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లు ఉండటం ప్రాక్టికల్‌గా అంతగా వర్కౌట్ కాదని.. అన్ని జట్లకు ఒకే కెప్టెన్ ఉండటం ద్వారా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌కు కూడా పని సులువు అవుతుందని పేర్కొన్నాడు. అయితే, కెప్టెన్సీ నుంచి తప్పించడంపై రోహిత్‌తో ఎలాంటి చర్చ జరిగిందన్న విషయంపై మాత్రం అగార్కర్ స్పష్టతనివ్వలేదు.
అప్పటి వరకు రో-కో ఆడటం కష్టమే
ఏదేమైనా వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీని దృష్టిలో పెట్టుకుని.. కెప్టెన్సీ విషయం గురించి రోహిత్‌తో మాట్లాడమని మాత్రమే అగార్కర్ వెల్లడించాడు. ఇక రోహిత్‌తో పాటు మరో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా దేశీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఆటగాళ్లు అందుబాటులో ఉన్నపుడు కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందని మేము స్పష్టంగా చెప్పాము’’ అని పేర్కొన్నాడు.
అంతేకాదు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వన్డే వరల్డ్‌కప్-2027 నాటికి ఆడే విషయంపై తమకు ఎలాంటి హామీ ఇవ్వలేదని అగార్కర్ ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం నిబంధనలకు అనుగుణంగా ఇద్దరికీ ఫిట్‌నెస్ టెస్టులు నిర్వహించామని.. ఇద్దరూ మ్యాచ్ ఆడేందుకు ఫిట్‌గా ఉన్నారని తెలిపాడు.
కాగా అక్టోబరు 19 నుంచి నవంబరు 8 వరకు టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన బీసీసీఐ శనివారం తమ జట్లను ప్రకటించింది.
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియా టూర్‌కు భారత జట్టు ప్రకటన.. నితీశ్ రెడ్డికి బంపరాఫర్