
ఆస్ట్రేలియా జట్టులో చోటు కోల్పోయిన స్టార్ మార్నస్ లాబుషేన్.. తన కోపాన్ని రెడ్‌బాల్ క్రికెట్ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌లో చూపించేస్తున్నాడు. ఈ ఏడాది షెఫీల్డ్ షీల్డ్ సీజన్‌లో క్వీన్స్‌లాండ్‌కు సారథ్యం వహిస్తున్న లబుషేన్ దుమ్ములేపుతున్నాడు. వరుసగా రెండో సెంచరీని నమోదు చేశాడు.
తొలి మ్యాచ్‌లో టాస్మానియాపై భారీ సెంచరీతో చెలరేగిన లాబుషేన్.. ఇప్పుడు సౌత్ ఆస్ట్రేలియాపై శతక్కొట్టాడు. ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి బౌలర్లకు లబుషేన్ చుక్కలు చూపించాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
197 బంతుల్లో 18 ఫోర్లు, 1 సిక్సర్‌తో 159 పరుగులు చేసి ఔటయ్యాడు. లాబుషేన్‌కు ఇది తన చివరి ఐదు ఇన్నింగ్స్‌లలో నాలుగో సెంచరీ కావడం గమనార్హం. షెఫీల్డ్ షీల్డ్ సీజన్ ఆరంభానికి ముందు ఆసీస్ దేశవాళీ వన్డే కప్‌లో క్వీన్స్‌లాండ్ తరపున రెండు శతకాలు సాధించాడు.
అదే ఫామ్‌ను రెడ్ బాల్ టోర్నీలోనూ కొనసాగిస్తున్నాడు. వాస్తవానికి మొన్నటివరకు లబుషేన్ ఫేలవ ఫామ్‌తో సతమతమయ్యాడు. దీంతో సెలక్టర్లు అతడిని జాతీయ జట్టును తప్పించారు. మూడు నెలల కిందటే టెస్టు జట్టులో చోటు కోల్పోయిన లాబుషేన్.. ఇప్పుడు వన్డే జట్టు నుంచి కూడా పక్కన పెట్టాడు.
అయితే ప్రస్తుత ఫామ్ బట్టి అతడు తిరిగి జాతీయ జట్టులోకి వచ్చే అవకాశముంది. యాషెస్ సిరీస్‌కు అతడిని సెలక్టర్లు ఎంపిక చేసే సూచనలు కన్పిస్తున్నాయి. లాబుషేన్ చివరిగా టెస్టుల్లో సౌతాఫ్రికాతో జరిగిన డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్ ఆడాడు. ఇప్పటివరకు 58 టెస్ట్‌లు ఆడిన లబూషేన్.. 46.2 సగటున 12 సెంచరీల సాయంతో 4435 పరుగులు చేశాడు.
చదవండి: టీమిండియా సెలక్టర్లకు ఇషాన్ స్ట్రాంగ్ కౌంటర్.. అంతలోనే...