కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో అనుహ్య ఓటమి చవిచూసిన భారత్.. ఇప్పుడు గౌహతిలో జరగనున్న రెండో టెస్టుకు సిద్దమవుతోంది. మంగళవారం ఈడెన్ గార్డెన్స్‌లో తమ మొదటి ట్రైనింగ్ సెషన్‌లో టీమిండియా పాల్గోనుంది. ఆ తర్వాత బుధవారం గౌహతికి భారత జట్టు పయనం కానుంది. నవంబర్ 22 నుంచి సెకెండ్ టెస్టు ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూరమయ్యే సూచనలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.
మెడనొప్పితో తొలి టెస్టు నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న భారత టెస్టు జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. . ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినా అతని పరిస్థితి ఇంకా మెరుగుపడలేదని సమాచారం. ‘గిల్‌కి మెడ నొప్పి తీవ్రంగా ఉంది. అతను నెక్ కాలర్ ధరిస్తూనే ఉన్నాడు. కనీసం 3–4 రోజులు విశ్రాంతి తీసుకోవాలని, విమానం ఎక్కరాదని వైద్యులు చెప్పారు.
ఇలాంటి స్థితిలో అతను ప్రయాణించే పరిస్థితి లేదు. అయితే అతని ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం’ అని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. అయితే గిల్ బుధవారం జట్టుతో పాటు గౌహతికి వెళ్లనున్నాడని మరి కొన్ని రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఒకవేళ బుధవారం కాకపోతే గురువారం గౌహతికి గిల్ పయనం కానున్నాడు. ఏదేమైనప్పటికి భారత కెప్టెన్ ఫుల్ ఫిట్‌నెస్ సాధిస్తేనే రెండో టెస్టులో ఆడనున్నాడు.
నితీశ్‌కు పిలుపు..
ఈ నేపథ్యంలో స్టార్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి టీమ్ మేనెజ్‌మెంట్ తిరిగి పిలుపునిచ్చింది. వాస్తవానికి సౌతాఫ్రికాతో టెస్టులకు తొలుత ఎంపిక చేసిన భారత జట్టులో నితీశ్ కూడా ఉన్నాడు. కానీ సౌతాఫ్రికా-తో వన్డే సిరీస్ ఆడేందుకు జట్టు నుంచి అతడిని రిలీజ్ చేశారు. ఇప్పుడు గిల్ గాయపడడంతో అతడిని తిరిగి జట్టులో చేరమని ఆదేశించారు. ఈ ఆంధ్ర ఆటగాడు మంగళవారం జట్టుతో చేరి ప్రాక్టీస్‌లో పాల్గోనున్నట్లు తెలుస్తోంది.
రెండో టెస్టుకు భారత తుది జట్టు(అంచనా)
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రిషబ్ పంత్,ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
చదవండి: IPL 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా అతడే.. అధికారిక ప్రకటన


