
ఇషాన్ కిషన్ (PC: X)
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌ను జార్ఖండ్ జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) ఘనంగా ఆరంభించాడు. ఎలైట్ గ్రూప్-‘ఎ’లో భాగంగా తమిళనాడు (Tamil Nadu vs Jharkhand)తో మ్యాచ్‌లో భారీ శతకంతో చెలరేగాడు. ఒకానొక సమయంలో డబుల్ సెంచరీ దిశగా పయనించిన ఇషాన్.. ద్విశతకానికి ఇరవై ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.
సెలక్టర్లకు గట్టి వార్నింగ్
ఏదేమైనా ఈ జార్ఖండ్ డైనమైట్ ప్రదర్శన పట్ల అభిమానులు ఖుషీ అవుతున్నారు. అద్భుత సెంచరీతో టీమిండియా సెలక్టర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్‌ను చాన్నాళ్లుగా టీమిండియా నుంచి పక్కన పెట్టడం గురించి మాట్లాడుతూ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలను తెరమీదకు తెస్తున్నారు.
మెరుగైన ప్రదర్శనతో
‘‘ఇషాన్ కిషన్ మంచి ఆటగాడు. అయితే, అతడు దేశీ క్రికెట్‌లో తరచుగా ఆడుతూ.. నిలకడైన ప్రదర్శనలు ఇస్తేనే పరిగణనలోకి తీసుకునేందుకు సెలక్టర్లు సిద్ధంగా ఉన్నారు’’ అని అగార్కర్ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. గత సీజన్‌లో దేశవాళీ మ్యాచ్‌లు ఆడకుండా బీసీసీఐ ఆగ్రహానికి గురైన ఈ యువ ఆటగాడు... ఈసారి మెరుగైన ప్రదర్శనతో సీజన్‌ను ఆరంభించడం విశేషం.
తొలిరోజే శతకం
ఇక మ్యాచ్ విషయానికొస్తే... కోయంబత్తూర్ వేదికగా తమిళనాడుతో బుధవారం మొదలైన పోరులో టాస్ గెలిచిన జార్ఖండ్.. తొలుత బ్యాటింగ్‌కు దిగింది. తొలిరోజు టీమిండియా ప్లేయర్, జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ (183 బంతుల్లో 125 బ్యాటింగ్; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. ఈ క్రమంలో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది.
ఇషాన్ అజేయ శతకంతో ఆకట్టుకోగా... సాహిల్ రాజ్ (105 బంతుల్లో 64 బ్యాటింగ్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో కెప్టెన్‌కు అండగా నిలిచాడు. శరణ్‌దీప్ సింగ్ (102 బంతుల్లో 48; 6 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. మిగిలినవాళ్లు విఫలమవడంతో ఒక దశలో జార్ఖండ్ జట్టు 157 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో సాహిల్‌తో కలిసి ఇషాన్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. తమిళనాడు బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జోడీ... క్రీజులో కుదురుకున్న తర్వాత చక్కటి షాట్‌లతో ఆకట్టుకుంది. ఈ జంట అబేధ్యమైన ఏడో వికెట్‌కు 150 పరుగులు జోడించడంతో జార్ఖండ్ కోలుకుంది. తమిళనాడు బౌలర్లలో గుర్‌జప్‌నీత్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా... చంద్రశేఖర్ 2 వికెట్లు తీశాడు.
డబుల్ సెంచరీ మిస్
ఇక రెండో రోజు ఆటలో భాగంగా ఇషాన్ తన ఓవర్‌నైట్ స్కోరు 125కు మరో 48 పరుగులు జోడించి అవుటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో మొత్తంగా ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 247 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 173 పరుగులు చేశాడు. ఆర్‌ఎస్ అంబరీశ్ బౌలింగ్‌లో షారుఖ్ ఖాన్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఇషాన్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకోకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.
మరోవైపు సాహిల్ రాజ్ 77 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గురప్‌జీత్ సింగ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఇక అనుకూల్ రాయ్‌ను (12)ను సందీప్ వారియర్ వెనక్కి పంపించాడు. ఈ నేపథ్యంలో 122 ఓవర్లు ముగిసే సరికి ఎనిమిది వికెట్ల నష్టానికి జార్ఖండ్ 379 పరుగులు చేసింది. జతిన్ పాండే 4, రిషావ్ రాజ్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.
చదవండి: 20 నెలలుగా టీమిండియా వద్దంది.. కట్ చేస్తే! విధ్వంసకర సెంచరీ