
వెస్టిండీస్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌ను 2-0తో వైట్‌వాష్ చేసిన టీమిండియా.. తదుపరి ఆస్ట్రేలియా (India Tour Of Australia 2025)లో పర్యటించనుంది. కంగారూ జట్టుతో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. అక్టోబరు 19 నుంచి టీమిండియా ఆసీస్ టూర్ ప్రారంభం కానుండగా... దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) చాన్నాళ్ల తర్వాత పునరాగమనం చేయనున్నారు.
అనూహ్యంగా టెస్టులకు రిటైర్మెంట్
చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియాకు ఆడిన రో- కో.. ఆ తర్వాత అనూహ్యంగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక గతేడాదే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు పలికిన ఈ ఇద్దరు మేటి బ్యాటర్లు.. వన్డేల్లో మాత్రం కొనసాగుతున్నారు.
ఆస్ట్రేలియాలో గిల్ సారథ్యంలో
ఇలాంటి తరుణంలో రోహిత్ శర్మ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించి.. అతడి స్థానంలో శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో గిల్ సారథ్యంలో మాజీ కెప్టెన్లు రోహిత్- కోహ్లి కలిసి ఆడనున్నారు.
కాగా రోహిత్‌పై వేటు వేసిన సమయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. రోహిత్, కోహ్లి వన్డే వరల్డ్‌కప్-2027 ఆడటం గురించి తమకు ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిపాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రో-కో గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మరో నాలుగైదేళ్లు ఢోకా లేదు
‘‘దయచేసి విరాట్ ఫిట్‌నెస్ గురించి ఎవరూ ఏమీ అడగకండి. ఫిట్‌నెస్ విషయంలో అతడొక గురు. అతడు ఏం చేసినా మిగతా వాళ్లు ఫాలో అయిపోతారు. కాబట్టి విరాట్ కోహ్లి ఫిట్‌నెస్ గురించి మనమేమీ ఆందోళన పడాల్సిన పనిలేదు.
అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుతం అతడి కంటే ఫిట్‌గా ఉన్న మరొక ప్లేయర్ ఎవరూ లేరు. అయితే, కోహ్లి బ్యాట్‌చేతపట్టి ఎప్పుడెప్పుడు మైదానంలో దిగుతాడా అని నేను ఎదురుచూస్తున్నా.
చాలా రోజులుగా అభిమానులతో పాటు నేనూ అతడి ఆటను మిస్సవుతున్నాను. వన్డేల్లో కోహ్లి ఇంకా ఎంతో సాధించగలడు. ఇంకొన్నేళ్లు ఆడగల సత్తా అతడికి ఉంది. కనీసం మరో నాలుగైదేళ్లు కోహ్లి వన్డేలు ఆడతాడని నేను నమ్ముతున్నా.
కేవలం ఆడటమే కాదు.. తనదైన శైలిలో ఆధిపత్యం కూడా చూపిస్తాడని విశ్వసిస్తున్నా. ఆస్ట్రేలియాలో అతడి ఆట కోసం ఎదురుచూస్తున్నా. ఇక రోహిత్ విషయంలోనూ నేను ఇదే చెప్తా.
కోహ్లి రెండు సెంచరీలు చేస్తాడు
ఆస్ట్రేలియాలో ఈ ఇద్దరు దిగ్గజాలు భారీ స్కోర్లు సాధించి టీమిండియాను గెలిపిస్తారని ఆశిస్తున్నా. ఆస్ట్రేలియా కోహ్లికి ఇష్టమైన ప్రత్యర్థి. మూడు వన్డేల్లో కలిపి అతడు కనీసం రెండు శతకాలైనా బాదుతాడని అనుకుంటున్నా’’ అని భజ్జీ చెప్పుకొచ్చాడు. కాగా అక్టోబరు 19 నుంచి నవంబరు 8 వరకు ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య వన్డే, టీ20 సిరీస్‌లు జరుగనున్నాయి.
చదవండి: చరిత్ర సృష్టించిన ధ్రువ్ జురెల్.. భారత తొలి క్రికెటర్‌గా ఫీట్