
టీమిండియా యువ క్రికెటర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) అరుదైన ఘనత సాధించాడు. అరంగేట్రం నుంచి ఇప్పటికి వరుసగా అత్యధిక టెస్టు విజయాలు సాధించిన భారత క్రికెటర్‌గా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) పేరిట ఉండేది. వెస్టిండీస్‌తో రెండో టెస్టు (IND vs WI 2nd Test) సందర్భంగా ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఈ ఫీట్ అందుకున్నాడు.
ఏడు వికెట్ల తేడాతో జయభేరి
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా టీమిండియా స్వదేశంలో విండీస్‌తో రెండు మ్యాచ్‌లు ఆడింది. తొలుత అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో చిత్తు చేసిన గిల్ సేన.. ఢిల్లీలో మంగళవారం ముగిసిన రెండో టెస్టులో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
కేఎల్ రాహుల్‌తో కలిసి
తద్వారా విండీస్‌తో టెస్టు సిరీస్‌ను భారత్ 2-0తో వైట్‌వాష్ చేసింది. ఇక వెస్టిండీస్‌తో రెండో టెస్టులో జురెల్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 79 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు పరుగులతో అజేయంగా నిలిచి.. కేఎల్ రాహుల్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
సరికొత్త చరిత్ర
కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధ్రువ్ జురెల్ గతేడాది ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రధాన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కారణంగా కొన్నిసార్లు బెంచ్‌కే పరిమితమైన జురెల్.. ఇప్పటికి ఏడు టెస్టులు పూర్తి చేసుకున్నాడు. ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 761 పరుగులు సాధించాడు.
ఈ క్రమంలోనే సరికొత్త చరిత్ర సృష్టించాడు. అరంగేట్రం నుంచి భారత్ తరఫున ఆడిన ఏడు టెస్టుల్లోనూ విజయం సాధించిన జట్లలో భాగమైన తొలి ఆటగాడిగా జురెల్ నిలిచాడు. అంతకు ముందు ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన అరంగేట్రం (2013) నుంచి వరుసగా ఆరు టెస్టుల్లో గెలిచిన భారత జట్టులో భాగమయ్యాడు.
భారత్ తరఫున వరుసగా అత్యధిక టెస్టు మ్యాచ్‌లు గెలిచిన క్రికెటర్లు
👉ధ్రువ్ జురెల్- 7
👉భువనేశ్వర్ కుమార్- 6
👉కరుణ్ నాయర్- 4
👉వినోద్ కాంబ్లీ- 4
👉రాజేశ్ చౌహాన్- 4.