
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27 సైకిల్‌లో టీమిండియా ఖాతాలో తొలి టెస్టు సిరీస్ విజయం చేరింది. ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో భారత్ విజయ భేరి మ్రోగించింది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను గిల్ సేన 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.
121 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా కేవలం మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. ఆఖరి రోజు తొలి సెషన్‌లోనే మ్యాచ్ ముగిసిపోయింది. భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ 58 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా.. సుదర్శన్(39) రెండో ఇన్నింగ్స్‌లోనూ సత్తాచాటాడు.
అంతకుముందు యశస్వి జైశ్వాల్, గిల్ సెంచరీలతో కదం తొక్కడంతో టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 518/5 డిక్లేర్ చేసింది. అనంతరం విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 248 రన్స్ చేసి ఫాలోఆన్ ఆడింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ బ్యాటర్లు పోరాడారు. క్యాంప్‌బెల్, హోప్‌లు సెంచరీలతో సత్తాచాటడంతో సెకెండ్ ఇన్నింగ్స్‌లో కరేబియన్ జట్టు 390 పరుగులు చేయగల్గింది. దీంతో విండీస్ 121 పరుగుల టార్గెట్‌ను భారత్ ముందు ఉంచింది. ఈ టార్గెట్‌ను భారత్ ఆడుతూ పాడుతూ చేధించింది.
సౌతాఫ్రికా వరల్డ్ రికార్డు సమం..
ఇక ఈ మ్యాచ్‌లో అద్బుతమైన విజయం సాధించిన భారత్ ఓ వరల్డ్ రికార్డును సమం చేసింది. ఒకే జట్టుపై వరుసుగా అత్యధిక టెస్టు సిరీస్ విజయాలు సాధించిన జట్టుగా సౌతాఫ్రికా సరసన టీమిండియా నిలిచింది. దక్షిణాఫ్రికా టీమ్ విండీస్(1198-24)పై వరుసగా 10 సార్లు టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది.
భారత్ కూడా వెస్టిండీస్ (2002-25)పై 10 సార్లు టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ రెండు జట్ల తర్వాత ఆస్ట్రేలియా ఉంది. విండీస్‌పై ఆసీస్ ఇప్పటివరకు 9 సార్లు టెస్టు సిరీస్‌లలో పై చేయి సాధించింది.
చదవండి: అర్జున్ టెండూల్కర్‌కు గుడ్ న్యూస్.. జట్టులో చోటిచ్చిన సెలక్టర్లు