
టీమిండియా దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli)- రోహిత్ శర్మ (Rohit Sharma)ల అంతర్జాతీయ క్రికెట్ భవితవ్యంపై గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. వీరిద్దరు ఇంగ్లండ్ పర్యటనలో టెస్టులు ఆడేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు వచ్చినా.. అనూహ్యంగా ఇద్దరూ ఐదు రోజుల వ్యవధిలోనే రిటైర్మెంట్ ప్రకటించారు.
వన్డే కెప్టెన్సీ నుంచి తొలగింపు
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పెద్దల వైఖరితో నొచ్చుకున్న రో- కో ఈ మేరకు అనూహ్య నిర్ణయం తీసుకున్నారనే వార్తలు వినిపించాయి. ఇక ఇప్పటికే అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కూ వీడ్కోలు పలికిన రోహిత్- కోహ్లి.. ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్నారు. అయితే, ఊహించని రీతిలో రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించింది బీసీసీఐ.
దేశీ టోర్నీలు కూడా ఆడాలి
ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు రోహిత్ స్థానంలో శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు వన్డే జట్టు పగ్గాలు అప్పగించింది. వన్డే వరల్డ్‌కప్-2027ను దృష్టిలో పెట్టుకునే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. ఈ సందర్భంగా రో- కో వన్డే వరల్డ్‌కప్ వరకు కొనసాగుతారనే హామీ కూడా లేదని చెప్పాడు. అంతేకాదు.. అవసరమైతే ఈ ఇద్దరు దేశీ టోర్నీలు కూడా ఆడాల్సి ఉంటుందని సంకేతాలు ఇచ్చాడు.
రోహిత్, కోహ్లిలకు ఇదే ఆఖరి సిరీస్!
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి వన్డేలకూ త్వరలోనే గుడ్‌బై చెప్పనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆసీస్‌తో జరిగే వన్డే సిరీస్ వీరి అంతర్జాతీయ కెరీర్‌లో చివరిదనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ విషయంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించాడు.
స్పందించిన బీసీసీఐ
ఢిల్లీలో మంగళవారం వెస్టిండీస్‌తో రెండో టెస్టులో భారత్ జయభేరి మోగించిన అనంతరం రాజీశ్ శుక్లా మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలో రో- కో వన్డే రిటైర్మెంట్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘వాళ్లిద్దరు జట్టులో ఉండటం మాకు అతిపెద్ద సానుకూలాంశం. ఇద్దరూ గొప్ప బ్యాటర్లు.
వారిద్దరి సమక్షంలో టీమిండియా కచ్చితంగా ఆస్ట్రేలియాను ఓడించి తీరుతుంది. రో-కో లకు ఇదే చివరి సిరీస్ అనడం హాస్యాస్పదం. అసలు మేము ఈ విషయం గురించి ఆలోచించము. రిటైర్మెంట్ అనేది ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయం. ఏదేమైనా రోహిత్- కోహ్లికు ఆసీస్ సిరీస్ ఆఖరిది అనడం తప్పు’’ అని రాజీవ్ శుక్లా పేర్కొన్నాడు.
ఇద్దరూ ఇద్దరే
కాగా వన్డేల్లో కోహ్లి, రోహిత్‌లకు ఉన్న రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వన్డేల్లో 51 సెంచరీలతో కోహ్లి ప్రపంచ రికార్డు సాధిస్తే.. రోహిత్ వన్డే ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఏడాది వీరిద్దరు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ విజేతగా నిలవడంలో తమ వంతు పాత్ర పోషించారు.
అంతేకాదు 2025లో రోహిత్ ఇప్పటికి 8 వన్డేల్లో ఓ సెంచరీ సాయంతో 302 పరుగులు చేయగా.. కోహ్లి ఏడు ఇన్నింగ్స్ ఆడి 275 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 36 ఏళ్ల కోహ్లి ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే విధంగా.. 37 ఏళ్ల రోహిత్ ఇటీవల పది కిలోలు తగ్గి మరింత ఫిట్‌గా తయారయ్యాడు. కాబట్టి ప్రస్తుత ఫామ్, ఫిట్‌నెస్ దృష్ట్యా వీరిద్దరు ఇప్పట్లో రిటైర్ కాకపోవచ్చని చెప్పవచ్చు.