BCCI: గంభీర్‌ వ్యాఖ్యలపై స్పందించిన బీసీసీఐ | BCCI vice president Rajeev Shukla backs Gambhir Over Harshit Selection | Sakshi
Sakshi News home page

సిగ్గుచేటు అంటూ గంభీర్‌ ఫైర్‌.. బీసీసీఐ స్పందన ఇదే

Oct 14 2025 7:21 PM | Updated on Oct 14 2025 7:45 PM

BCCI vice president Rajeev Shukla backs Gambhir Over Harshit Selection

టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir) చేసిన ‘సిగ్గుచేటు’ వ్యాఖ్యలపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా (Rajeev Shukla) స్పందించాడు. గంభీర్‌ సరిగ్గానే మాట్లాడానని సమర్థించిన అతడు.. యువ ఆటగాడి పట్ల సీనియర్ల ప్రవర్తన సరికాదని పేర్కొన్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

గంభీర్‌ హెడ్‌కోచ్‌ కాగానే..
ఐపీఎల్‌-2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ టైటిల్‌ గెలవడంలో యువ పేసర్‌ హర్షిత్‌ రాణా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాటి కేకేఆర్‌ మెంటార్‌ గంభీర్‌.. టీమిండియా హెడ్‌కోచ్‌ కాగానే హర్షిత్‌ జాతీయ జట్టులోకి వచ్చేశాడు. వరుస వైఫల్యాలు చెందినా.. టీమిండియాలో అతడి స్థానానికి ఢోకా లేకుండా పోయింది.

ముఖ్యంగా సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ ఫిట్‌గానే ఉన్నానని మొత్తుకుంటున్నా.. సెలక్టర్లు అతడిని పట్టించుకోవడం లేదు. ఇలాంటి తరుణంలో ఆస్ట్రేలియాతో వన్డే, టీ20లకు హర్షిత్‌ రాణా ఎంపిక కావడం విమర్శలకు దారితీసింది. గంభీర్‌ ప్రియ శిష్యుడు కాబట్టే అతడికి ఛాన్సులు వస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

చిక్కా, అశూ విమర్శలు
ఈ విషయంలో మాజీ చీఫ్‌ సెలక్టర్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌, టీమిండియా స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ ఘాటుగానే స్పందించారు. హర్షిత్‌ను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారో అర్థం కావడం లేదని పరోక్షంగా గంభీర్‌ను విమర్శించారు.

గంభీర్‌ ఆగ్రహం
ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో రెండో టెస్టులో విజయానంతరం మీడియాతో మాట్లాడిన గంభీర్‌.. చిక్కా, అశూలను టార్గెట్‌ చేశాడు. ‘‘యూట్యూబ్‌లో వ్యూస్‌ కోసం యువ ఆటగాడి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు.

మీ స్వార్థం కోసం 23 ఏళ్ల క్రికెటర్‌ను టార్గెట్‌ చేస్తారా? ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా కష్టపడి పైకి వచ్చిన ఆటగాడి గురించి ఇలా మాట్లాడకండి’’ అంటూ ఫైర్‌ అయ్యాడు. తాజాగా ఈ విషయంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా కూడా స్పందించాడు.

బీసీసీఐ స్పందన ఇదే
‘‘గౌతం గంభీర్‌ సరిగ్గానే చెప్పాడు. ఓ ఆటగాడి ఎంపిక గురించి ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉంటే.. బాధ్యతాయుతంగా విమర్శించాలి. అంతేకానీ.. సదరు ప్లేయర్‌ ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా మాట్లాడకూడదు.

ఎవరిని ఎంపిక చేయాలో యాజమాన్యం చూసుకుంటుంది. ఇతర ఆటగాళ్ల గురించి మాట్లాడేటపుడు.. మీరెంత బాధ్యతాయుతంగా ఉన్నారో ఆలోచించుకోండి’’ అంటూ రాజీవ్‌ శుక్లా గంభీర్‌కు మద్దతు పలికాడు. ANIతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా గంభీర్‌, హర్షిత్‌ ఇద్దరూ ఢిల్లీకి చెందిన వారే కావడం గమనార్హం.

చదవండి: చరిత్ర సృష్టించిన ధ్రువ్‌ జురెల్‌.. భారత తొలి క్రికెటర్‌గా ఫీట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement