
ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్‌లకు టీమిండియా పేసర్ హర్షిత్ రాణా(Harshit Rana)ను ఎంపిక చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Goutham Gambhir) అండదండలతోనే అతడికి సెలక్టర్లు అవకాశమిచ్చారని అశ్విన్, కృష్ణమాచారి శ్రీకాంత్ వంటి దిగ్గజ క్రికెటర్లు మండిపడ్డారు.
అంతేకాకుండా చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా రాణాను ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో విమర్శకులకు గంభీర్ స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు. రాణా జట్టులోకి మెరిట్ ప్రాతిపదికన వచ్చాడనీ, అతడి ఎంపికలో ఎవరి జోక్యం లేదని గౌతీ తెలిపాడు. ఒక యువ క్రికెటర్ ఇలా ట్రోల్ చేయడం సరికాదని వారించాడు.
"నిజంగా ఇది సిగ్గు చేటు.. మీ యూట్యూబ్ ఛానల్స్ నడపడానికి 23 ఏళ్ల ఒక క్రికెటర్‌ను టార్గెట్ చేస్తారా? అతడి తండ్రి మాజీ బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మెనో, ఓ మాజీ క్రికెటరో, ఎన్నారైనో కాదు. అతడు ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చాడు. కష్టపడి ఈ స్ధాయికి చేరుకున్నాడు. అతడి ప్రదర్శనను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేశాము.
భారత క్రికెట్‌కు మంచి జరిగేలా చూసుకోవాల్సిన నైతిక బాధ్యత మనలో ప్రతి ఒక్కరిపై ఉంది. మీ యూట్యూబ్ ఛానెల్ వ్యూస్ కోసం అతడిని ఏమీ అనకండి. మీరు నన్ను విమర్శించినా పర్వాలేదు. వాటిని నేను హ్యాండిల్ చేసుకోగలను. కానీ ఒక యువ క్రికెటర్‌ను టార్గెట్ చేయడం సరికాదు.
భవిష్యత్తులో మీ బిడ్డ కూడా దేశం తరపున ఆడవచ్చు. అప్పుడు ఇలానే ఎవరైనా ట్రోల్ చేస్తే అప్పుడు మీరు ఎలా తీసుకుంటారు? దయచేసి ఇకనైనా మారండి" అంటూ వెస్టిండీస్‌తో రెండో టెస్టు విజయానంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంభీర్ ఫైరయ్యాడు.
చదవండి: IND vs WI: టీమిండియా వరల్డ్ రికార్డు..