
ఆస్ట్రేలియా సిరీస్ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్ల తీరుపై భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆగ్రహం వ్యక్తం చేశాడు. రెండేళ్ల క్రితం అద్భుతమైన డెలివరీ సంధించాడని.. అదే ప్రాతిపదికగా ఇప్పటికీ ఓ ఆటగాడికి జట్టులో స్థానం కల్పిస్తున్నారంటూ ‘యువ పేసర్’ను టార్గెట్ చేశాడు.
గిల్ సారథ్యంలో ..
వెస్టిండీస్ స్వదేశంలో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన (IND vs AUS)కు వెళ్లనుంది. ఆతిథ్య జట్టుతో అక్టోబరు 19- నవంబరు 8 వరకు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే జట్టును ప్రకటించింది.
వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మపై వేటు వేసిన బీసీసీఐ.. అతడి స్థానంలో శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు పగ్గాలు అప్పగించింది. ఇక ఆసీస్‌తో ఆడే వన్డే, టీ20 జట్లలో యువ పేసర్ హర్షిత్ రాణాకు చోటు దక్కడం గమనార్హం. ఈ నేపథ్యంలో అశ్విన్ ఘాటుగా స్పందించాడు.

అతడిని ఎందుకు సెలక్ట్ చేస్తున్నారో అర్థం కాదు
‘‘అసలు అతడిని ఎందుకు సెలక్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. నాకైతే ఈ విషయం అంతుపట్టడం లేదు. రాణాను జట్టులో చేర్చడానికి గల కారణమేమిటో తెలుసుకునేందుకైనా సెలక్షన్ కమిటీ సమావేశంలో భాగమైతే బాగుండు అనిపిస్తోంది.
ఆస్ట్రేలియాలో బ్యాట్‌తోనూ రాణించగల ఫాస్ట్‌బౌలర్ టీమిండియాకు అవసరం. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయగలిగే బౌలర్‌ను వాళ్లు ఎంపిక చేయాలి. నాకైతే అతడి బ్యాటింగ్‌పై ఎలాంటి నమ్మకమూ లేదు.
రెండేళ్ల క్రితం ఐపీఎల్ మ్యాచ్‌లో నితీశ్ కుమార్ రెడ్డిని అద్భుతమైన పేస్ డెలివరీతో అవుట్ చేసినందుకు.. నేటికీ ఆ ఒక్క కారణంతోనే వరుస అవకాశాలు ఇస్తున్నారు’’ అని అశ్విన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
గంభీర్‌కే చురకలు
కాగా ఢిల్లీకి చెందిన హర్షిత్ రాణా ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సమయంలో కేకేఆర్ మెంటార్‌గా ఉన్న గౌతం గంభీర్.. తర్వాత టీమిండియా హెడ్‌కోచ్ అయ్యాడు. ఈ క్రమంలో గంభీర్ ప్రియ శిష్యుడైన హర్షిత్ ఇప్పటికే మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేయడమే కాదు.. వైఫల్యాలు ఎదురైనా జట్టులో వరుస అవకాశాలు దక్కించుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో అశూ పరోక్షంగా గంభీర్‌కు ఈ విధంగా చురకలు అంటించినట్లు తెలుస్తోంది.
చదవండి: వన్డే కెప్టెన్‌గా రోహిత్‌పై వేటు!.. నాకు ముందే తెలుసు: గిల్