
రోహిత్ భాయ్ నుంచి నేర్చుకున్నవి ఇవే
రోహిత్ శర్మ నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) తెలిపాడు. రోహిత్ భయ్యా తనకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నాడు. టీమిండియాకు రెండు ఐసీసీ టైటిళ్లు అందించిన సారథి రోహిత్ శర్మ (Rohit Sharma).
వన్డే కెప్టెన్‌గా రోహిత్‌పై వేటు!
గతేడాది టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన రోహిత్.. ఈ ఏడాది ఐసీసీ (వన్డే) చాంపియన్స్ ట్రోఫీ -2025లో జట్టుకు కప్ అందించాడు. ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన హిట్‌మ్యాన్.. ఇటీవలే టెస్టులకూ రిటైర్మెంట్ ప్రకటించగా.. టెస్టు సారథిగా గిల్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు.
అయితే, వన్డేల్లో కొనసాగుతానని రోహిత్ శర్మ చెప్పినా.. బీసీసీఐ (BCCI) ఇటీవలే అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించింది. రోహిత్ స్థానంలో వన్డే కొత్త కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌ను నియమించింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ సందర్భంగా అతడి శకం మొదలుకానుంది. ఇక ప్రసుతం స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్న గిల్ గురువారం మీడియాతో మాట్లాడాడు.
నాకు ముందే ఈ విషయం గురించి తెలుసు
ఈ సందర్భంగా వన్డే సారథిగా రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేయడం గురించి స్పందిస్తూ.. ‘‘టెస్టు మ్యాచ్ మధ్యలోనే ఈ ప్రకటన వచ్చింది. అయితే, అంతకంటే ముందే నాకు ఈ విషయం గురించి తెలుసు. నాకు దక్కిన గొప్ప గౌరవం. అతిపెద్ద బాధ్యత.
వన్డేల్లో టీమిండియాను ముందుకు నడిపించడానికి ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నా. గత కొన్ని నెలలుగా నా జీవితం కొత్తగా మారిపోయింది. ఉత్సుకతను పెంచింది. భవిష్యత్తులో జట్టును గొప్పగా ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తా’’ అని గిల్ పేర్కొన్నాడు. మూడు ఫార్మాట్లలోనూ నాయకత్వం వహించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపాడు.
రోహిత్ భాయ్ నుంచి నేర్చుకున్నవి ఇవే
ఇక రోహిత్ శర్మ గురించి ప్రస్తావన రాగా.. ‘‘రోహిత్ భాయ్‌లో ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి. వాటిని వారసత్వంగా నేను స్వీకరిస్తా. ముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండటం.. డ్రెసింగ్‌రూమ్‌లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం ఆయనలో నాకు నచ్చే గుణాలు. ఈ రెండింటిని నేను తప్పకుండా కొనసాగిస్తా’’ అని గిల్ పేర్కొన్నాడు.
కాగా వెస్టిండీస్‌తో తొలి టెస్టులో ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. అక్టోబరు 10- 14 మధ్య జరిగే రెండో టెస్టులోనూ గెలిచి వైట్‌వాష్ చేయాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం వేదిక.