
టీమిండియా టీ20 కెప్టెన్‌గా గతేడాది పగ్గాలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. పూర్తిస్థాయి సారథిగా తొలుత శ్రీలంకతో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఈ ముంబై బ్యాటర్.. ఆ తర్వాత కూడా ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత్‌ను గెలుపుబాటలో నడిపించాడు.
తాజాగా ఆసియా టీ20 కప్-2025 (Asia Cup)లో అజేయంగా ఫైనల్‌కు చేర్చిన సూర్య... టైటిల్ పోరులో దాయాది పాకిస్తాన్‌ను ఓడించి టీమిండియాను విజేతగా నిలిపాడు. కెప్టెన్‌గా ఈ మేరకు విజయవంతమవుతున్నా.. బ్యాటర్‌గా మాత్రం సూర్య రోజురోజుకూ గడ్డు పరిస్థితుల్లో కూరుకుపోతున్నాడు.
ఐపీఎల్‌లో అదరగొట్టినా...
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తరఫున అదరగొట్టిన సూర్య.. సగటు 65తో ఏకంగా 717 పరుగులు రాబట్టాడు. కానీ టీమిండియా తరఫున మాత్రం బ్యాట్‌తో రాణించలేకపోయాడు. ముఖ్యంగా ఆసియా కప్ టోర్నీలో ఏడు మ్యాచ్‌లలో కలిపి సూర్య సాధించిన పరుగులు కేవలం 72. సగటు 18. స్ట్రైక్‌రేటు 101.41. అంతకు ముందు కూడా అంతర్జాతీయ టీ20లలో సూర్య పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
నిజం చెప్పడానికి సిగ్గెందుకు?
ఈ నేపథ్యంలో తన ఫామ్‌లేమి గురించి సూర్యకుమార్ యాదవ్ తాజాగా స్పందించాడు. ‘‘నిజం చెప్పడానికి సిగ్గుపడాల్సిన పనిలేదు. ఆసియా కప్ టోర్నీని నేను మెరుగ్గానే ఆరంభించాను. 40 పరుగుల వరకు చేయగలిగా. ఆ తర్వాత కూడా నా బ్యాటింగ్ బాగానే ఉంది.
కానీ పరుగులు మాత్రం రాబట్టలేకపోయాను. మ్యాచ్‌కు సన్నద్ధమయ్యే తీరు, ప్రక్రియలో నేను ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉంటాను. సరైన దారిలో నడుస్తున్నపుడు ఒక్కోసారి పరుగులు రాకపోయినా పెద్దగా ఆందోళన పడకుండా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాటిని సరిచేసుకుంటే సరి.
జట్టుపై ప్రభావం పడకుండా..
ఏదేమైనా నా ఫామ్ జట్టుపై ప్రభావం చూపనంత వరకు పెద్దగా బెంగ పడాల్సిన అవసరం లేదు. అయితే, మా జట్టు ప్రస్తుతం అదరగొడుతోంది. సూపర్ ఫామ్‌లో ఉంది. డ్రెసింగ్‌రూమ్‌లో వాతావరణం గొప్పగా ఉంటుంది.
నా ఫామ్ ప్రభావం జట్టుపై పడకుండా.. విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లడంపై మాత్రమే నేను దృష్టి సారిస్తాను’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. విమల్ కుమార్ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
లేటు వయసులో అరంగేట్రం
కాగా సూర్యకుమార్ తదుపరి ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో బిజీకానున్నాడు. అక్టోబరు 29- నవంబరు 8 మధ్య భారత్- ఆస్ట్రేలియా మధ్య ఈ సిరీస్‌కు షెడ్యూల్ ఫిక్స్ అయింది.
ఇక 2021లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన 35 ఏళ్ల సూర్య.. ఇప్పటి వరకు 90 టీ20లు, 37 వన్డేలు, ఒక టెస్టు ఆడాడు. టీ20లలో నాలుగు శతకాల సాయంతో 2670 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. వన్డేల్లో 773, టెస్టుల్లో 8 పరుగులు చేయగలిగాడు. ఐపీఎల్‌లో ఇప్పటికి 166 మ్యాచ్‌లు ఆడి 4311 పరుగులు చేశాడు.
చదవండి: ఫిట్‌గానే ఉన్నా.. అందుకే నన్ను సెలక్ట్ చేయలేదు: స్పందించిన షమీ