
సీనియర్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami)ని టీమిండియా సెలక్టర్లు పక్కన పెట్టేశారు. ముఖ్యంగా టెస్టు జట్టులో అతడికి చోటు దక్కడమే లేదు. ఫిట్‌నెస్ కారణాలు చూపి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలకు షమీని ఎంపిక చేయని సెలక్టర్లు.. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కూడా అతడికి మొండిచేయి చూపారు.
బుమ్రా అలా.. సిరాజ్ ఇలా
మరోవైపు.. ఫిట్‌నెస్ సమస్యలు ఉన్నప్పటికీ ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా కొన్ని మ్యాచ్‌లకు విశ్రాంతి తీసుకుంటూ.. మరికొన్ని మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఇక మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) మాత్రం రెస్ట్ అన్నదే లేకుండా టెస్టుల్లో ఇరగదీస్తుండగా.. షమీని కాదని యువ పేసర్ ప్రసిద్ కృష్ణ వైపు మేనేజ్‌మెంట్ మొగ్గుచూపుతోంది.
ఇక పరిమిత ఓవర్ల క్రికెట్ విషయానికొస్తే... ఈ ఏడాది మార్చిలో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆఖరిగా ఆడాడు షమీ. ఆ తర్వాత ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫునా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఫలితంగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే వన్డే, టీ20 జట్లకు కూడా సెలక్టర్లు షమీని ఎంపిక చేయలేదు.
స్పందించిన షమీ
ఈ విషయం గురించి టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. షమీ గురించి తమకు అప్‌డేట్ లేదని చెప్పాడు. ఈ నేపథ్యంలో షమీ మౌనం వీడాడు. టీమిండియా నుంచి తనను పక్కనపెట్టడం గురించి స్పందిస్తూ..
‘‘నా విషయంలో ఎన్నో వదంతులు పుట్టుకొస్తున్నాయి. మీమ్స్ కూడా వేస్తున్నారు. ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపిక కాకపోవడంపై నా స్పందన తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు. ఏదేమైనా సెలక్షన్ అనేది నా చేతుల్లో లేదు.
అందుకే నన్ను సెలక్ట్ చేయలేదు.. కానీ
సెలక్షన్ కమిటీ, కోచ్, కెప్టెన్ నిర్ణయానుసారమే అంతా జరుగుతుంది. ఒకవేళ నేను జట్టులో ఉండాలని వారు భావిస్తే ఎంపిక చేస్తారు. లేదు నేను ఇంకొన్నాళ్లు వేచిచూడాలని అనుకుంటే ఇలా చేస్తారు. నేను మాత్రం పూర్తి ఫిట్‌గా ఉన్నాను. ప్రాక్టీస్ కూడా చేస్తున్నా.
దులిప్ ట్రోఫీ ఆడాను. 35 ఓవర్లు బౌలింగ్ చేశాను. ఫిట్‌నెస్ కారణంగా ఎలాంటి సమస్యా ఎదురుకాలేదు. నా రిథమ్ బాగుంది’’ అని షమీ తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు. కాగా అక్టోబరు 19- నవంబరు 8 వరకు టీమిండియా ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.