
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్ (Rashid Khan) సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్‌లో వారి దేశం (Afghanistan) తరఫున 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశతో నిన్న (అక్టోబర్ 8) జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం వికెట్లు తీసిన రషీద్ తన వన్డే వికెట్ల సంఖ్యను 202కు పెంచుకున్నాడు. రషీద్ కేవలం 115 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.
రషీద్ ఖాన్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లుగా మొహమ్మద్ నబీ (176), దవ్లత్ జద్రాన్ (115), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (101), గుల్బదిన్ నైబ్ (74) ఉన్నారు.
మరో ఘనత
రషీద్ ఆఫ్ఘన్ తరఫున 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించడంతో పాటు మరో ఘనత కూడా సాధించాడు. వన్డేల్లో సక్లయిన్ ముస్తాక్ (పాక్) తర్వాత అత్యంత వేగంగా 200 వికెట్లు పూర్తి చేసిన స్పిన్నర్‌గా రికార్డు నెలకొల్పాడు. సక్లయిన్ 104 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించగా.. రషీద్‌కు 115 మ్యాచ్‌లు అవసరమయ్యాయి.
ఓవరాల్‌గా చూస్తే.. రషీద్ వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు మైలురాయిని తాకిన బౌలర్ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. మిచెల్ స్టార్క్ (102), సక్లయిన్ ముస్తాక్ (104), మొహమ్మద్ షమీ (104), ట్రెంట్ బౌల్ట్ (107), బ్రెట్ లీ (112) రషీద్ కంటే వేగంగా ఈ ఘనత సాధించారు.
మ్యాచ్ విషయానికొస్తే.. రషీద్ మాయాజాలం (10-0-38-3), ఒమర్‌జాయ్ ఆల్‌రౌండ్ షోతో (9-0-40-3, 40) సత్తా చాటడంతో తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఘనంగా ప్రారంభించింది. దీనికి ముందు ఆఫ్ఘనిస్తాన్ ఇదే బంగ్లాదేశ్ చేతిలో 0-3 తేడాతో టీ20 సిరీస్‌ను కోల్పోయింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. రషీద్ ఖాన్, ఒమర్‌జాయ్, అల్లా ఘజన్‌ఫర్ (9.5-1-55-2) ధాటికి 48.5 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా ఇన్నింగ్స్‌లో తౌహిద్ హృదోయ్ (56), కెప్టెన్ మెహిది హసన్ మిరాజ్ (60) అర్ద సెంచరీలతో రాణించారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 47.1 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి ఆట ముగించింది. రహ్మానుల్లా గుర్బాజ్ (50), రహ్మత్ షా (50) అర్ద సెంచరీలతో రాణించగా.. ఒమర్‌జాయ్, కెప్టెన్ హష్మతుల్లా షాహీది (33 నాటౌట్) పర్వాలేదనిపించారు. బంగ్లా బౌలర్లలో తంజిమ్ హసన్ సకీబ్ 3 వికెట్లు పడగొట్టగా.. తన్వీర్ ఇస్లాం, మెహిది హసన్ తలో వికెట్ దక్కించుకున్నారు. రెండో వన్డే అక్టోబర్ 11న జరుగుతుంది.