మహ్మద్‌ షమీ కీలక నిర్ణయం | After regular India snubs Shami turns to Ranji Trophy to prove himself | Sakshi
Sakshi News home page

టీమిండియాలో దక్కని చోటు.. మహ్మద్‌ షమీ కీలక నిర్ణయం

Oct 8 2025 8:47 PM | Updated on Oct 8 2025 9:29 PM

After regular India snubs Shami turns to Ranji Trophy to prove himself

టీమిండియా సీనియర్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ (Mohammed Shami)కి గడ్డుకాలం నడుస్తోంది. భారత పేస్‌ దళంలో కీలక ఆటగాడిగా కొనసాగిన ఈ బెంగాల్‌ క్రికెటర్‌కు ఇప్పుడు జట్టులో చోటే కరువైంది. వన్డే వరల్డ్‌కప్‌-2023 టోర్నీలో గాయం తాలూకు బాధను దిగమింగి.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు షమీ.

సొంతగడ్డపై జరిగిన ఈ మెగా టోర్నీలో కేవలం ఆరు మ్యాచ్‌లే ఆడిన షమీ ఏకంగా 23 వికెట్లు కూల్చాడు. తద్వారా ఈ ఐసీసీ ఈవెంట్లో లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. అయితే, ఆ తర్వాత నుంచి షమీ చీలమండ గాయం తీవ్రత ఎక్కువ కావడంతో సర్జరీ చేయించుకున్నాడు.

చాంపియన్‌ జట్టులో
కోలుకునే క్రమంలో దాదాపు ఏడాదిన్నర పాటు టీమిండియాకు దూరంగా ఉన్న షమీ.. స్వదేశంలో ఈ ఏడాది ఇంగ్లండ్‌తో సిరీస్‌ సందర్భంగా పునరాగమనం చేశాడు. ఈ క్రమంలో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 గెలిచిన భారత జట్టులోనూ షమీ భాగమయ్యాడు. అయితే, ఈ వన్డే టోర్నీలో షమీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఐదు మ్యాచ్‌లలో కలిపి తొమ్మిది వికెట్లు తీయగలిగాడు.

రెండేళ్ల నుంచీ నిరాశే 
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పరిస్థితి ఇలా ఉంటే.. టెస్టుల్లో మాత్రం షమీకి రెండేళ్ల నుంచీ నిరాశే ఎదురవుతోంది. ఫిట్‌నెస్‌ సమస్యల దృష్ట్యా అతడిని పక్కనపెట్టినట్లు టీమిండియా మేనేజ్‌మెంట్‌ చెబుతోంది. మరోవైపు.. ఇటీవల దులిప్‌ ట్రోఫీలో బెంగాల్‌ తరఫున బరిలోకి దిగిన షమీ.. 34 ఓవర్ల బౌలింగ్‌లో కేవలం ఒకే ఒక్క వికెట్‌ తీయగలిగాడు.

షమీ కీలక నిర్ణయం
ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో స్వదేశంలో టెస్టులకు కూడా సెలక్టర్లు షమీని ఎంపిక చేయలేదు. అంతేకాదు ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌ ఆడే జట్టులోనూ అతడికి చోటి వ్వలేదు. ఈ విషయం గురించి చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ మాట్లాడుతూ.. షమీ గురించి అప్‌డేట్‌ లేదని చెప్పడం గమనార్హం. ఈ క్రమంలో షమీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తనను తాను నిరూపించుకునేందుకు రంజీ ట్రోఫీ తాజా సీజన్‌లో ఆడేందుకు షమీ సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయం గురించి బెంగాల్‌ కోచ్‌ టెలిగ్రాఫ్‌తో మాట్లాడుతూ.. ‘‘ఆరేడు రోజుల క్రితం షమీతో మాట్లాడాను. అతడు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. రంజీ ట్రోఫీలో మా ఓపెనింగ్‌ మ్యాచ్‌ నుంచే అతడు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నాడు.

తలుపులు శాశ్వతంగా మూసుకుపోయినట్లే
ఇదిలా ఉంటే.. బీసీసీఐ అధికారి ఒకరు షమీ గురించి ప్రస్తావన రాగా.. ‘‘టీమిండియాలోకి షమీ తిరిగి రావడం ప్రస్తుతం కష్టమే. ఇటీవల దులిప్‌ మ్యాచ్‌లోనూ అతడు రాణించలేకపోయాడు. రోజురోజుకీ వయసు మీద పడుతోంది. యువ ఆటగాళ్లతో అతడు పోటీ పడలేడు.

అయితే, ఐపీఎల్‌లో అవకాశాలు దక్కించుకోవాలంటే.. అతడు ఆడక తప్పని పరిస్థితి’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. తద్వారా షమీకి టీమిండియా తలుపులు శాశ్వతంగా మూసుకుపోయినట్లేననే సంకేతాలు ఇచ్చారు సదరు అధికారి. కాగా ఐపీఎల్‌-2025లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన 35 ఏళ్ల షమీ కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీయగలిగాడు.

చదవండి: IND vs AUS: 462 వికెట్లు.. స్వింగ్ సుల్తాన్‌.. క‌ట్ చేస్తే! ఊహించ‌ని విధంగా కెరీర్‌కు ఎండ్ కార్డ్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement