
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లేనా? అంటే అవునానే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కూ షమీని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఆసీస్ టూర్‌కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది.
ఈ సందర్భంగా చీఫ్ సెలక్టర్ కనీసం షమీ ప్రస్తావన కూడా తీసుకు రాలేదు. షమీ ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తరుపున ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్-2025లో ఆడినప్పటికి ఈ వెటరన్ పేసర్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.
అయితే ఐపీఎల్ అనంతరం ఇంగ్లండ్ పర్యటనకు షమీని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఐదో రోజుల పాటు జరిగే టెస్టు మ్యాచ్‌లో ఆడే ఫిట్‌నెస్ షమీకి లేదని సెలక్టర్లు చెప్పుకొచ్చారు. కానీ డొమాస్టిక్ క్రికెట్‌లో మాత్రం షమీ రెగ్యూలర్‌గా ఆడుతూనే వస్తున్నాడు. గత నెలలో జరిగిన దులీప్ ట్రోఫీలో ఈస్ట్‌జోన్ జట్టుకు ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ప్రాతినిథ్యం వహించాడు. కానీ షమీ ఏ మాత్రం రిథమ్‌లో కన్పించలేదు.
దీంతో ప్రస్తుతం విండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకోలేదు. అంతేకాకుండా ఆసియాకప్-2025కు కూడా షమీ ఎంపిక కాలేదు. టెస్టు, టీ20 ఫార్మాట్‌లను పక్కన పెడితే కనీసం వన్డే జట్టులో అయినా అతడికి చోటు దక్కుతుందని అంతా భావించారు.
కానీ మరోసారి అతడి పేరు టీమ్ సెలక్షన్ లిస్ట్‌లో కన్పించలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత్ ఆడుతున్న తొలి వన్డే సిరీస్ ఇది. ఈ సిరీస్‌కు కూడా షమీ ఎంపిక కాకపోవడంతో అతడి ఇంటర్ననేషనల్ కెరీర్ ప్రశ్నార్ధకంగా మారింది.
కెరీర్‌ను మార్చేసిన గాయం..
షమీ గత రెండేళ్ల నుంచి చీలమండ గాయంతో సతమతవుతున్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీలో లీడ్ వికెట్ టేకర్‌గా నిలిచిన షమీ.. అనంతరం తన చీలమండ గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. దీంతో ఈ రైట్ ఆర్మ్ పేసర్ దాదాపు ఏడాది పాటు ఆటకు దూరమయ్యాడు.
ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో షమీ పునరాగమనం చేశాడు. అక్కడ మెరుగైన ప్రదర్శన చేయకపోయినప్పటికి ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ మెగా టోర్నీలో షమీ కాస్త పర్వాలేదన్పించాడు. కానీ అంత టచ్‌లో మాత్రం షమీ కన్పించలేదు.
అప్పటినుంచి భారత జట్టుకు ఈ బెంగాల్ పేసర్ దూరంగా ఉంటున్నాడు. భారత క్రికెట్‌లో షమీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకున్నాడు. షమీకి టెస్టుల్లో 229, వన్డేల్లో 206 వికెట్లు ఉన్నాయి. అదేవిధంగా టీ20ల్లో అతడు 27 వికెట్లు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తంగా 462 వికెట్లు పడగొట్టాడు. షమీ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ కెరీర్ ఇలా ముగుస్తుందని ఎవరూ ఊహించి ఉండరు.
చదవండి: IND vs AUS: పాపం అభిషేక్ శర్మ.. ఊహించని షాకిచ్చిన బీసీసీఐ!?