
భారత వన్డే జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్న యువ సంచలనం అభిషేక్ శర్మకు నిరాశే ఎదురైంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో అభిషేక్‌కు చోటు దక్కలేదు. రెగ్యూలర్ ఓపెనర్లగా శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ ఉండగా.. బ్యాకప్ ఓపెనర్‌గా యశస్వి జైశ్వాల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు.
జైశ్వాల్ చివరగా ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత తరపున వన్డేల్లో ఆడాడు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి అతడిని పక్కన పెట్టారు. మళ్లీ ఇప్పుడు ఆసీస్‌తో సిరీస్‌కు ఈ ముంబై ఆటగాడికి సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు.
అభిషేక్ వెయిట్ చేయాల్సిందే..
అయితే అభిషేక్ శర్మ ప్రస్తుతం వైట్ బాల్ క్రికెట్‌లో దుమ్ములేపుతున్నాడు. ఇటీవల ముగిసిన ఆసియాకప్‌లో అభిషేక్ ప్లేయర్ ఆఫ్‌ది టోర్నమెంట్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో పంజాబ్ ఆటగాడు 200 స్ట్రైక్ రేట్‌తో 314 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
టీ20ల్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా అభిషేక్ కొనసాగుతున్నాడు. దీంతో ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు అభిషేక్‌ను సెలక్టర్లు ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అతడిని పరిగణలోకి తీసుకోలేదు.
రోహిత్ శర్మ, గిల్, జైశ్వాల్ రూపంలో ఓపెనర్లు అందుబాటులో ఉండడంతో అభిషేక్ వైపు సెలక్టర్లు మొగ్గు చూపున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 50 ఓవర్ల ఫార్మాట్‌లో శర్మ తన స్కిల్స్‌ను మరింత మెరుగుపరుచుకోవాలని సెలక్టర్లు సూచించినట్లు సమాచారం.
అభిషేక్ శక్రవారం ఆసీస్-ఎతో జరిగిన అనాధికారిక వన్డేలో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఇది కూడా అతడి ఎంపికపై ప్రభావం చూపించింది. అభిషేక్ శర్మ తన కెరీర్‌లో ఇప్పటివరకు 61 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడి 35.33 సగటుతో 2,014 పరుగులు చేశాడు.
అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 170గా ఉంది. అదేవిధంగా బౌలింగ్‌లో కూడా 38 వికెట్లు పడగొట్టాడు. అయితే అభిషేక్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే అత్యంత త్వరలోనే వన్డే జట్టులోకి కూడా వచ్చే అవకాశముంది. కాగా భారత వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను బీసీసీఐ తప్పించింది. అతడి స్ధానంలో శుబ్‌మన్ గిల్‌కు వన్డే జట్టు పగ్గాలను అప్పగించారు.