ఐపీఎల్-2026 వేలానికి ముందు భారత ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer)కు భారీ షాక్ తగిలింది. గతేడాది కోట్లు కుమ్మరించి అతడిని కొనుక్కున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఈసారి మాత్రం ఆక్షన్‌లోకి విడిచిపెట్టేసింది. అన్నీ కుదిరితే కేకేఆర్ వెంకటేశ్‌ను మళ్లీ సొంతం చేసుకునే అవకాశం ఉంది. కానీ 2025లో అతడి ప్రదర్శన దృష్ట్యా ఇది సాధ్యం కాకపోవచ్చు అనిపిస్తోంది.
ఏకంగా రూ. 23.75 కోట్లు
కాగా మధ్యప్రదేశ్‌కు చెందిన వెంకటేశ్ అయ్యర్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్. రూ. 20 లక్షలకు 2021లో కేకేఆర్ అతడిని కొనుగోలు చేసింది. అదే ఏడాది వెంకటేశ్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. పది మ్యాచ్‌లలో కలిపి 370 పరుగులతో సత్తా చాటిన ఈ ఆల్‌రౌండర్‌ను 2022లో ఏకంగా రూ. 8 కోట్లకు కేకేఆర్ రిటైన్ చేసుకుంది.
ఇక గతేడాది కేకేఆర్ టైటిల్ గెలవడంలో వెంకీ తన వంతు పాత్ర పోషించాడు. 15 మ్యాచ్‌లలో కలిపి 370 పరుగులు చేసిన ఈ ఆల్‌రౌండర్.. ఫైనల్లోనూ సత్తా చాటాడు. ఈ క్రమంలో వెంకటేశ్ వేలంలోకి వెళ్లినా కేకేఆర్ అతడి కోసం ఏకంగా రూ. 23.75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. కానీ ఈసారి అతడు పూర్తిగా విఫలమయ్యాడు.
ఆల్‌టైమ్ టీ20 ఎలెవన్
ఐపీఎల్-2025లో పదకొండు మ్యాచ్‌లు ఆడి కేవలం 142 పరుగులే చేశాడు. దీంతో కేకేఆర్ వెంకటేశ్ అయ్యర్‌ను వేలంలోకి విడిచిపెట్టింది. ఇదిలా ఉంటే.. డిసెంబరు 16న అబుదాబి వేదికగా వేలంపాట జరుగనున్న నేపథ్యంలో క్రిక్‌ట్రాకర్‌కు వెంకీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన ఆల్‌టైమ్ టీ20 ఎలెవన్‌ను వెంకటేశ్ అయ్యర్ ప్రకటించాడు.

రోహిత్, కోహ్లికి దక్కని చోటు
అయితే, వెంకీ ఎంచుకున్న టీ20 ఆల్‌టైమ్ జట్టులో భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు చోటు దక్కలేదు. ఐపీఎల్‌లో.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో పరుగుల వరద పారించిన రో-కోకు వెంకటేశ్ అయ్యర్ తన జట్టులో స్థానం ఇవ్వకపోవడం గమనార్హం.
ఓపెనర్లుగా వీరూ, అభిషేక్
ఇక తన జట్టులో ఓపెనర్లుగా భారత విధ్వంసకర బ్యాటర్లు వీరేందర్ సెహ్వాగ్, అభిషేక్ శర్మను ఎంచుకున్న వెంకీ.. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ను వన్‌డౌన్‌లో ఆడిస్తానని తెలిపాడు. మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందిన టీమిండియా మాజీ బ్యాటర్ సురేశ్ రైనాను ఎంపిక చేసుకున్న అతడు.. తన జట్టులో ఇద్దరు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లుకు చోటిచ్చాడు.
ఇంగ్లండ్ స్టార్ బెన్ స్టోక్స్‌తో పాటు టీమిండియా మేటి ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు వెంకీ ఈ మేరకు తన జట్టులో స్థానం కల్పించాడు. ఇక ఏడో స్థానానికి, వికెట్ కీపర్ బ్యాటర్‌గా.. కెప్టెన్‌గా టీమిండియా దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోనిని వెంకటేశ్ అయ్యర్ ఎంచుకున్నాడు.
బౌలింగ్ విభాగంలో స్పిన్నర్లు అఫ్గనిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్, వెస్టిండీస్ దిగ్గజం సునిల్ నరైన్‌లకు చోటు ఇచ్చిన వెంకటేశ్ అయ్యర్.. పేస్ దళంలో భారత మేటి బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగలను ఎంచుకున్నాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్‌కు వెంకీ స్థానమిచ్చాడు.
వెంకటేశ్ అయ్యర్ ఆల్‌టైమ్ టీ20 ప్లేయింగ్ ఎలెవన్ ఇదే
వీరేందర్ సెహ్వాగ్, అభిషేక్ శర్మ, ఏబీ డివిలియర్స్, సురేశ్ రైనా, బెన్ స్టోక్స్, హార్దిక్ పాండ్యా, ఎంఎస్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), రషీద్ ఖాన్, సునిల్ నరైన్, లసిత్ మలింగ, జస్‌ప్రీత్ బుమ్రా
ఇంపాక్ట్ ప్లేయర్: మాథ్యూ హెడెన్.


