టీమిండియా స్టార్ మహ్మద్ షమీకి జాతీయ సెలెక్టర్లు మరోసారి మొండిచేయి చూపించారు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టులో షమీకి చోటు దక్కలేదు. కివీస్‌తో వన్డే సిరీస్‌కు షమీని ఎంపిక చేయనున్నారని జోరుగా ప్రచారం జరిగింది.
కానీ అజిత్ అగార్కర్ అండ్ కో మాత్రం షమీని పరిగణలోకి తీసుకోలేదు. జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడంతో మహ్మద్ సిరాజ్‌కు తిరిగి పిలుపునిచ్చారు. అదేవిధంగా పేస్ బౌలింగ్ విభాగంలో ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌లకు చోటు దక్కింది.
అయితే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై చాలా మంది మాజీలు తప్పుబడుతున్నారు. భారత జట్టుకు తిరిగి ఆడాలంటే అతడు ఇంకా ఏమి చేయాలని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్ జట్టు హెడ్ కోచ్ లక్ష్మీ రతన్ శుక్లా సెలెక్టర్లపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డాడు.
దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నప్పటికి, షమీని జాతీయ జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదని అతడు ఫైరయ్యాడు. షమీ చివరగా భారత్ తరపున గతేడాది మార్చిలో ఆడాడు. అప్పటి నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. కానీ దేశవాళీ క్రికెట్‌లో మాత్రం క్రమం తప్పకుండా ఆడుతున్నాడు.
షమీకి అన్యాయం..
సెలక్షన్ కమిటీ మరోసారి మహమ్మద్ షమీకి అన్యాయం చేసింది. ఇటీవలి కాలంలో ఏ అంతర్జాతీయ ఆటగాడు కూడా షమీ అంత పట్టుదలతో దేశవాళీ క్రికెట్ ఆడలేదు. డొమెస్టిక్ క్రికెట్‌లో అతడు అద్భుతంగా రాణిస్తున్నప్పటికి సెలెక్టర్లు ఎంపిక చేయకపోవడం నిజంగా సిగ్గు చేటు అని రేవ్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శుక్లా పేర్కొన్నాడు. షమీ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో సీజన్‌లో దుమ్ములేపుతున్నాడు.
రంజీ ట్రోఫీ 2025-26లో బెంగాల్ తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా కొనసాగుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీలోన అతడు అదరగొట్టాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు దాదాపు 45 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు.
అయితే షమీ ఫామ్ లేదా ఫిట్‌నెస్ విషయంలో ఎలాంటి సమస్యలు లేవు. 2027 వన్డే ప్రపంచకప్ సమయానికి హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ లాంటి బౌలర్లను సిద్దం చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ క్రమంలోనే షమీకి అవకాశమివ్వడం లేదని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడతున్నారు.
న్యూజిలాండ్ వన్డేలకు భారత జట్టు : శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కె.ఎల్. రాహుల్ (కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసీద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్.


