వన్డే క్రికెట్ రారాజుగా వెలుగొందుతున్నాడు భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి. ఇప్పటికే యాభై ఓవర్ల ఫార్మాట్లో 53 సెంచరీలు చేసిన ఈ ఢిల్లీ స్టార్... పరుగుల వేట కొనసాగిస్తూనే ఉన్నాడు. మరోవైపు.. టీమిండియా లెజెండరీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma). వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేయడంతో పాటు.. అత్యధిక స్కోరు (264) రికార్డును కూడా తన పేరిటే లిఖించుకున్నాడు.
వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియాను ఫైనల్‌కు చేర్చిన రోహిత్ శర్మ.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో జట్టును చాంపియన్‌గా నిలిపాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో శతక్కొట్టిన ఈ ముంబైకర్.. స్వదేశంలో సౌతాఫ్రికాతో సిరీస్‌లోనూ ఫామ్‌ను కొనసాగించాడు.
దేశీ మ్యాచ్‌లకు భారీ క్రేజ్
ఇలా వన్డే క్రికెట్‌లో తమదైన ముద్ర వేసిన రో-కో.. బీసీసీఐ ఆదేశాల మేరకు దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ బరిలోనూ దిగారు. ఢిల్లీ తరఫున కోహ్లి (Virat Kohli).. ముంబైకి ఆడుతూ రోహిత్ మరోసారి శతకాలతో చెలరేగారు. వీరిని చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. ఎన్నడూలేని విధంగా ఈ దేశీ మ్యాచ్‌లకు భారీ క్రేజ్ ఏర్పడింది.
ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రో-కో.. వన్డే వరల్డ్‌కప్-2027 తర్వాత యాభై ఓవర్ల ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కెప్టెన్సీలోనూ ఆడిన భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వాళ్లిద్దరు రిటైర్ అయితే వన్డే క్రికెట్ ఏమైపోతుందో!
‘‘రోహిత్, విరాట్.. విజయ్ హజారే ట్రోఫీ టోర్నీ ఆడేందుకు రాగానే ప్రేక్షకులు ఈ మ్యాచ్‌లను చూడటం కూడా మొదలుపెట్టారు. అన్నింటికంటే ఆటే గొప్పది. అయితే, రో-కో వంటి ఆటగాళ్లు మాత్రం తమ వల్ల ఆటకు మరింత వన్నె తెచ్చారు.
దేశీ వన్డేలను కూడా క్రికెట్ ప్రేమికులు ఫాలో అవుతున్నారంటే అందుకు వీరిద్దరే కారణం. ఒకవేళ రోహిత్, విరాట్ గనుక వన్డేలు ఆడటం మానేస్తే.. పరిస్థితి ఏమైపోతుందో!’’ అని అశ్విన్ విచారం వ్యక్తం చేశాడు. వన్డే ఫార్మాట్‌కు క్రేజ్ తగ్గకుండా ఉండేలా అంతర్జాతీయ క్రికెట్ మండలి చర్యలు చేపట్టాలని అశూ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశాడు.
చదవండి: పాకిస్తాన్ నుంచి వచ్చిన వాడిని.. ఇక్కడ ఇలా: ఉస్మాన్ ఖవాజా


