భారత్, న్యూజిలాండ్ మధ్య జనవరి 11న వడోదరలోని కొటంబి స్టేడయంలో జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆన్‌లైన్‌లో అమ్మకం ప్రారంభించిన 8 నిమిషాల్లోనే టికెట్లన్నీ సోల్డ్ ఔటయ్యాయి. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకున్న వారిని ఈ విషయం బాధిస్తున్నప్పటికీ.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అభిమానులకు మాత్రం సంతృప్తినిస్తుంది.
తమ ఆరాధ్య ఆటగాళ్లకు ఉన్న క్రేజ్ వల్లే, ఇలా తక్కువ సమయంలో టికెట్లు అమ్ముడుపోయాయని వారు సంబరపడిపోతున్నారు. ఇది కదా రో-కో క్రేజ్ అంటే అంటూ సోషల్‌మీడియాలో బజ్ క్రియేట్ చేస్తున్నారు. రాజ్‌కోట్, ఇండోర్‌లో జరిగే మిగతా రెండు వన్డేల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంటుందంటూ హడావుడి చేస్తున్నారు.
కాగా, రోహిత్-విరాట్ టెస్ట్, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో రో-కో ఆకాశమే హద్దుగా చెలరేగడంతో న్యూజిలాండ్ సిరీస్ తొలి వన్డేకు హైప్ మరింత పెరిగింది.
కోహ్లి ఆటను ప్రత్యక్షంగా చూడటమే లక్ష్యంగా అభిమానులు టికెట్ల కోసం ఎగబాడ్డారు. సౌతాఫ్రికా సిరీస్‌లో విరాట్ వరుసగా రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ చేసి ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించాడు. ఇదే ఫామ్‌ను విరాట్ వడోదర వన్డేలోనూ కొనసాగిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లలో తొలుత వన్డేలు జరుగనున్నాయి. జనవరి 11, 14, 18 తేదీల్లో వడోదర, రాజ్‌కోట్, ఇండోర్ వేదికలుగా మూడు వన్డేలు జరుగుతాయి.
అనంతరం 21, 23, 25, 28, 31 తేదీల్లో నాగ్‌పూర్, రాయ్‌పూర్, గౌహతి, విశాఖపట్నం, తిరువనంతపురం వేదికలుగా టీ20లు జరుగనున్నాయి. టీ20 సిరీస్ కోసం భారత జట్టును ఇదివరకే ప్రకటించగా.. వన్డే జట్టును ప్రకటించాల్సి ఉంది.


