ఆస్ట్రేలియా గడ్డపై ఓ ‘భారత’ క్రికెటర్ సరికొత్త చరిత్ర లిఖించాడు. ఆసీస్ ఫస్ట్‌క్లాస్ హిస్టరీలో శతకం బాదిన తొలి భారతీయుడిగా రికార్డు సాధించాడు. అతడే నిఖిల్ చౌదరి.
గిల్ సహచర క్రికెటర్
ఢిల్లీలో జన్మించిన నిఖిల్ చౌదరి.. దేశీ క్రికెట్‌లో పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. టీమిండియా ప్రస్తుత టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill).. భారత స్టార్లు అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh)లతో కలిసి లిస్ట్-ఎ క్రికెట్ ఆడాడు. అయితే, భారత్‌లో అతడికి ఆశించిన మేర అవకాశాలు రాలేదు.
ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు వెళ్లిన నిఖిల్ చౌదరి.. కోవిడ్-19 (Covid 19)లాక్‌డౌన్ కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా అతడు భారత్‌కు తిరిగి రావాలని అనుకోలేదు. ఆస్ట్రేలియాలోనే ఉంటూ శాశ్వత నివాసిగా మారిపోయాడు. అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ కావాలన్న అతడి కల మాత్రం అలాగే ఉండిపోయింది.
మాంసం కొట్టులో పని
ఎలాగైనా తన ఆశయాన్ని నెరవేర్చుకోవాలనే సంకల్పంతో నిఖిల్ చౌదరి.. శిక్షణ కోసం డబ్బు కూడబెట్టడం మొదలుపెట్టాడు. మాంసం కొట్టులో పని చేయడంతో పాటు.. పార్శిళ్లు అందించే డెలివరీ బాయ్‌గా.. ఉబర్ క్యాబ్ డ్రైవర్‌గా.. ఇలా ఎన్నో పనులు చేశాడు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకున్నాడు.
కొన్నాళ్ల తర్వాత నిఖిల్ చౌదరి శ్రమకు ఫలితం దక్కింది. ఆస్ట్రేలియా టీ20 టోర్నీ బిగ్ బాష్ లీగ్‌లో ఆడే అవకాశం అతడికి వచ్చింది. హోబర్ట్ హ్యారికేన్స్‌కు ప్రాతినిథ్యం వహించే సమయంలో నిఖిల్ చౌదరి.. పాకిస్తాన్ ఓవరాక్షన్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌లో సిక్సర్ బాది.. దానిని తొడగొడుతూ మరీ సెలబ్రేట్ చేసుకోవడం హైలైట్‌గా నిలిచింది.

సరికొత్త చరిత్ర
ఈ క్రమంలోనే ఆసీస్ దేశీ క్రికెట్ జట్ల యాజమాన్యాలను ఆకర్షించిన నిఖిల్ చౌదరికి ఊహించని విధంగా ఓ అవకాశం వచ్చింది. స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమన్ ఆస్ట్రేలియా తరఫున ఆడేందుకు జాతీయ జట్టులోకి వెళ్లగా.. టాస్మేనియా జట్టు నుంచి నిఖిల్‌కు పిలుపు వచ్చింది. ఆ తర్వాత అతడు జట్టులో భాగమైపోయాడు.
ఆసీస్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌లో టాస్మేనియాకు ఆడుతున్న నిఖిల్ ఇటీవలే సరికొత్త చరిత్ర సృష్టించాడు. న్యూ సౌత్ వేల్స్‌తో మ్యాచ్‌లో ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. శతక్కొట్టాడు. 184 బంతుల్లోనే 163 పరుగులు రాబట్టాడు. తద్వారా ఆసీస్ దేశీ రెడ్‌బాల్ టోర్నీలో సెంచరీ చేసిన భారత మూలాలున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టాస్మేనియా న్యూ సౌత్ వేల్స్‌పై ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో గెలవడం విశేషం.
ఫాస్ట్ బౌలర్‌గా మొదలుపెట్టి..
ఢిల్లీలో జన్మించిన నిఖిల్ చౌదరి పంజాబ్‌లో పెరిగాడు. పంజాబ్ తరఫున అన్ని ఏజ్ గ్రూపులలోనూ క్రికెట్ ఆడాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌తో సమయం గడిపే అవకాశం అతడికి వచ్చింది. నిజానికి నిఖిల్ తొలుత ఫాస్ట్ బౌలర్ కావాలని భావించాడు.
అయితే, కాలక్రమేణా తన నైపుణ్యాలకు మెరుగు దిద్దుకుని లెగ్ స్పిన్నర్‌గా ఎదిగాడు. ఐపీఎల్ ట్రయల్స్‌లో ముంబై ఇండియన్స్ సెలక్షన్‌కు వెళ్లినప్పటికీ నిఖిల్‌కు నిరాశే మిగిలింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లిన 29 ఏళ్ల నిఖిల్.. అక్కడి స్థానిక క్లబ్‌లలో ఆడుతూ టాస్మేనియా జట్టులో కుదురుకున్నాడు.
చదవండి: స్మృతిని మోసం చేసిన పలాష్?!.. పెళ్లికి ముందు రోజు రాత్రి.. ఏం జరిగింది?


