సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ప్రొటిస్ జట్టు విధించిన 549 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఆదిలోనే తడ‘బ్యాటు’కు లోనైంది. నాలుగో రోజు ఆట ముగిసే సరికి కేవలం 27 పరుగులే చేసి రెండు వికెట్లు కోల్పోయింది.
రోడ్డు మీద కూడా ఆడలేరా?
ఈ నేపథ్యంలో టీమిండియా ఆట తీరుపై ముఖ్యంగా బ్యాటర్లపై మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు సైతం మండిపడుతున్నారు. ‘‘రోడ్డు లాంటి పిచ్ మీద సఫారీలు రయ్ రయ్‌మని దూసుకుపోతుంటే.. మీరు మాత్రం ఇంత చెత్తగా ఆడతారా?’’ అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. ‘‘మరో వైట్‌వాష్ పరాభవానికి ముందుగానే సిద్ధమైపోయారు.. భేష్’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
చేదు అనుభవం తప్పదా?
స్వదేశంలో గతేడాది న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది టీమిండియా. సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇలా దారుణ ఓటమి చవిచూడటం టీమిండియా చరిత్రలోనే తొలిసారి. తాజాగా మరోసారి అదే చేదు అనుభవం ముంగిట నిలిచింది భారత జట్టు.
సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం గువాహటిలో రెండో టెస్టు మొదలైంది. బర్సపరా స్టేడియంలో తొలిసారి జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది.
భారత బౌలర్లు ఆరంభంలో కాస్త పొదుపుగా బౌలింగ్ చేసినా.. ఆ తర్వాత ప్రొటిస్ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. ముఖ్యంగా టెయిలెండర్లు సెనూరన్ ముత్తుస్వామి (109), మార్కో యాన్సెన్ (93) ఇన్నింగ్స్ బాదడం టీమిండియా చెత్త బౌలింగ్‌కు నిదర్శనం. ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా ఏకంగా 489 పరుగులు చేసింది.
యాన్సెన్ ఆరు వికెట్లతో చెలరేగి
సఫారీ బ్యాటర్లు అదరగొట్టిన ఈ పిచ్‌పై భారత బ్యాటర్లు మాత్రం అట్టర్‌ఫ్లాప్ అయ్యారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (58)తో పాటు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (48) ఫర్వాలేదనిపించగా.. మిగతా వారంతా చేతులెత్తేశారు. మార్కో యాన్సెన్ ఆరు వికెట్లతో చెలరేగి భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.
ఫలితంగా 201 పరుగులకే భారత్ తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలగా.. ప్రొటిస్ 288 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. అనంతరం టీమిండియాను ఫాలో ఆన్ ఆడించకుండా.. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా.. ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
మరోసారి మనోళ్లు ఫెయిల్
రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ (35), ఐడెన్ మార్క్రమ్ (29) ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ భారీ హాఫ్ సెంచరీ (94) సాధించాడు. కెప్టెన్ తెంబా బవుమా (3) విఫలం కాగా.. టోనీ డి జోర్జి (49), వియాన్ ముల్దర్ (35 నాటౌట్) రాణించారు. ఇక భారత బౌలర్లలో స్పిన్నర్లు రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
ఇక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (288) కలుపుకొని సౌతాఫ్రికా టీమిండియాకు 549 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. అయితే, కొండంత టార్గెట్‌ను ఛేదించే క్రమంలో భారత ఓపెనర్లు తీవ్రంగా నిరాశపరిచారు. యశస్వి జైస్వాల్ 13 పరుగులు చేసి.. యాన్సెన్ బౌలింగ్‌లో వెనుదిరగగా.. కేఎల్ రాహుల్ 6 పరుగులు చేసి సైమన్ హార్మర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.
గువాహటిలో నాలుగో రోజు ఆట ముగిసేసరికి సాయి సుదర్శన్ 2, కుల్దీప్ యాదవ్ 4 పరుగులతో క్రీజులో నిలిచారు. టీమిండియా విజయానికి ఇంకా ఏకంగా 522 పరుగుల దూరంలో ఉండగా.. సౌతాఫ్రికాకు ఎనిమిది వికెట్లు చాలు!!.. ఆఖరిదైన ఐదో రోజు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత్ ఈ మ్యాచ్‌లో ఓడిపోవడాన్ని ఎవరూ ఆపలేరు!!
చదవండి: పీవీ సింధు ఫిట్‌నెస్‌పై సైనా నెహ్వాల్ కీలక వ్యాఖ్యలు


