లంచ్ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా ఆధిక్యం ఎంతంటే?
టీమిండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా (IND vs SA) మరింతగా పట్టు బిగిస్తోంది. టీ విరామ సమయానికి 395 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. గువాహటి వేదికగా 26/0 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం నాటి నాలుగో రోజు ఆట మొదలుపెట్టింది సౌతాఫ్రికా.
ఈ క్రమంలో ప్రొటిస్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా బంతితో రంగంలోకి దిగాడు. జడ్డూ బౌలింగ్‌లో మూడో బంతికి షాట్ ఆడబోయి బంతిని గాల్లోకి లేపిన ర్యాన్ రికెల్టన్ (35) సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది.
ఇక 29వ ఓవర్లో జడ్డూ మార్క్రమ్ (29)ను బౌల్డ్ చేయగా.. 32వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) అద్భుతం చేశాడు. కెప్టెన్ తెంబా బవుమా (3) రూపంలో కీలక వికెట్ పడగొట్టాడు. వాషీ బౌలింగ్‌లో లెగ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న నితీశ్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి బవుమా పెవిలియన్ చేరాడు.
ఈ క్రమంలో టీ విరామ సమయానికి సౌతాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. తద్వారా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని 395 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కాగా భారత్ సొంతగడ్డపై సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్ ఆడుతోంది.
1-0తో ఆధిక్యంలో సౌతాఫ్రికా
ఇందులో భాగంగా కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య టీమిండియా సఫారీల చేతిలో 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక ఇరుజట్ల మధ్య గువాహటిలోని బర్సపరా వేదికగా శనివారం రెండో టెస్టు మొదలు కాగా.. టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది.
టాపార్డర్ మెరుగ్గా రాణించగా.. టెయిలెండర్లు సెనూరన్ ముత్తుస్వామి (109), మార్కో యాన్సెన్ (91 బంతుల్లో 93) అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో ప్రొటిస్ జట్టు 489 పరుగులకు ఆలౌట్ అయింది.
తేలిపోయిన భారత బ్యాటర్లు
అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ కేవలం 201 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికాకు 288 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
ఈ నేపథ్యంలో టీమిండియాను ఫాలో ఆన్ ఆడిస్తారనుకుంటే.. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ఆడేందుకే మొగ్గుచూపింది. సోమవారం నాటి మూడో రోజు ఆట ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది.
UPDATE: లంచ్ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా ఆధిక్యం 508 పరుగులు
స్కోరు: 220/4 (70)
చదవండి: అసలు సెన్స్ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్


